గోయల్‌.. ‘జెట్‌’ దిగెన్‌! | Jet Airways remained afloat before final turbulence | Sakshi
Sakshi News home page

గోయల్‌.. ‘జెట్‌’ దిగెన్‌!

Published Tue, Mar 26 2019 12:00 AM | Last Updated on Tue, Mar 26 2019 9:31 AM

Jet Airways remained afloat before final turbulence - Sakshi

ముంబై: కొన్ని నెలలుగా కొనసాగుతున్న జెట్‌ ఎయిర్‌వేస్‌ సంక్షోభానికి పరిష్కారం దొరికింది. తీవ్ర నిధుల కొరత, రుణ భారం సమస్యలను ఎదుర్కొంటున్న జెట్‌ ఎయిర్‌వేస్‌కు బ్యాంకులు తక్షణమే రూ.1,500 కోట్ల మేర నిధులను అందించనున్నాయి. జెట్‌ ఎయిర్‌వేస్‌ చైర్మన్‌ పదవి నుంచి, కంపెనీ బోర్డు నుంచి నరేష్‌ గోయల్, ఆయన సతీమణి అనితాగోయల్‌ తప్పుకున్నారు. ఎస్‌బీఐ ఆధ్వర్యంలోని బ్యాంకుల కమిటీ రూపొందించిన పరిష్కార ప్రణాళికలో భాగమే ఇది. ఈ ప్రణాళికకు సోమవారం అత్యవసరంగా సమావేశమైన జెట్‌ ఎయిర్‌వేస్‌ బోర్డు ఆమోదం తెలిపింది. మధ్యంతర నిధుల సాయం పొందడమే ఈ సమావేశం ప్రధాన ఎజెండాగా సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆర్థిక సంక్షోభం కారణంగా జెట్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన 80కు పైగా విమానాలు సర్వీసులు నడపలేని పరిస్థితుల్లో నిలిచిపోయిన విషయం విదితమే. నరేష్‌ గోయల్, ఆయన భార్య అనితా గోయల్, ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌ పీజేఎస్‌సీ నామినీ డైరెక్టర్‌ కెవిన్‌ నైట్‌ జెట్‌ ఎయిర్‌వేస్‌ బోర్డు నుంచి వైదొలిగారు. కంపెనీలో ఎతిహాద్‌కు 24 శాతం వాటా ఉన్న విషయం తెలిసిందే. డెట్‌ ఇనుస్ట్రుమెంట్ల జారీ ద్వారా బ్యాంకులు రూ.1,500 కోట్లు అందించనున్నాయి. జెట్‌ ఎయిర్‌వేస్‌ బ్యాంకులకు రూ.8,000 కోట్లకు పైగా రుణాలను చెల్లించాల్సి ఉంది. దీంతో 11.4 కోట్ల షేర్లను బ్యాంకులకు జారీ చేయడం ద్వారా రుణాన్ని ఈక్విటీగా కంపెనీ మార్చనున్నది. దీంతో బ్యాంకులకు సంస్థలో నియంత్రిత వాటా 51 శాతం లభిస్తుంది. ప్రమోటర్‌ నరేష్‌ గోయల్‌ వాటా ప్రస్తుతమున్న 50 శాతం నుంచి 25 శాతానికి తగ్గుతుంది. అలాగే, అబుదాబికి చెందిన ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌ వాటా 24 శాతం నుంచి 12 శాతానికి తగ్గుతుంది. రోజువారీ కార్యకలాపాల నిర్వహణ, పర్యవేక్షణకు మధ్యంతర మేనేజ్‌మెంట్‌ కమిటీని ఏర్పాటు చేస్తూ కూడా జెట్‌ ఎయిర్‌వేస్‌ బోర్డు నిర్ణయం తీసుకుంది. మెకెన్సీ అండ్‌ కో సహకారంతో బోర్డు డైరెక్టర్ల పర్యవేక్షణ కింద ఈ కమిటీ పనిచేస్తుంది. ప్రమోటర్లకు చెందిన ఇద్దరు నామినీలు, ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌ తరఫున ఒక నామినీ జెట్‌ ఎయిర్‌వేస్‌ బోర్డులో కొనసాగుతారని జెట్‌ ఎయిర్‌వేస్‌ ప్రకటించింది.

ఉద్యోగుల్లో ఆందోళన 
మరోవైపు జనవరి నుంచి ఉద్యోగులకు జెట్‌ ఎయిర్‌వేస్‌ వేతనాలను చెల్లించడం లేదు. డిసెంబర్‌ నెలకు సంబంధించి కూడా కేవలం 12.5 శాతం వేతనాలనే చెల్లించింది. దీంతో పైలట్లు, ఇంజనీర్లు, ఇతర కీలక విధుల్లోని ఉద్యోగులు ఇతర విమానయాన సంస్థల్లో ఉపాధి వెతుక్కుంటున్న పరిస్థితి ఉంది. ‘‘మాకు కూడా ఆర్థిక బాధ్యతలు ఉన్నాయి. ఎయిర్‌లైన్‌ ఒక్కసారిగా కుప్పకూలితే ఏమవుతుందన్న భయం ఉంది. మా బకాయిలు మార్చి 31 నాటికి చెల్లించాలి. అలాగే, మా కంపెనీకి సంబంధించి రోడ్‌మ్యాప్‌ సిద్ధం కావాలి’’ అని నేషనల్‌ ఏవియేటర్స్‌ గిల్డ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఆసిమ్‌ వలైని పేర్కొన్నారు. 

విషాద దినం: అజయ్‌సింగ్‌
దేశ విమానయాన రంగానికి ఇదొక విషాద దినంగా స్పైస్‌జెట్‌ చీఫ్‌ అజయ్‌సింగ్‌ వ్యాఖ్యానించారు. నరేష్‌ గోయల్, ఆయన సతీమణి అనితా గోయల్‌ జెట్‌ ఎయిర్‌వేస్‌ బోర్డు నుంచి తప్పుకోవాల్సి రావడంతో అజయ్‌సింగ్‌ ఇలా స్పందించారు. ప్రపంచస్థాయి ఎయిర్‌లైన్‌ సంస్థను ప్రారంభించి నరేష్‌ గోయల్, అనితా గోయల్‌ భారత్‌ గర్వపడేలా చేశారని పేర్కొన్నారు. విమానయాన సంస్థలను పోటీ పడలేకుండా చేస్తున్న నిర్మాణాత్మక సవాళ్ల పరిష్కారంపై దృష్టి పెట్టేందుకు విధాన నిర్ణేతలకు ఇదొక మేల్కొలుపుగా అభివర్ణించారు. వీటిని తక్షణమే పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. 

షేరు పరుగు...
గోయల్‌ వైదొలగిన వార్తలతో జెట్‌ షేరు 17 శాతానికి పైగా పెరిగింది. బీఎస్‌ఈలో చివరికి 12.69 శాతం లాభంతో రూ.254.50 వద్ద స్థిరపడింది.

బ్యాంకుల నిర్ణయం పట్ల జైట్లీ సంతోషం
న్యూఢిల్లీ: జెట్‌ ఎయిర్‌వేస్‌కు సంబంధించి ప్రభుత్వరంగ బ్యాంకులు తీసుకున్న నిర్ణయం పట్ల కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వరంగ బ్యాంకులు స్వప్రయోజనాలతోపాటు, ప్రజా ప్రయోజనాలను కూడా దృష్టిలో ఉంచుకున్నట్టు చెప్పారు. ‘‘మరిన్ని విమానాలు, ఎయిర్‌లైన్స్‌ భారత్‌కు అవసరం. లేదంటే చార్జీలు పెరిగిపోతాయి. జెట్‌ ఎయిర్‌వేస్‌ సంస్థ కార్యకలాపాలు కొనసాగే విధంగా బ్యాంకులు నిర్ణయం తీసుకున్నాయి. అప్పుడే అవి తమ బకాయిలను వసూలు చేసుకోగలవు. ఈ నిర్ణయం పట్ల సంతోషంగా ఉన్నా’’ అని జైట్లీ పేర్కొన్నారు.  

మే నాటికి కొనుగోలుదారుల ఖరారు ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీష్‌
జెట్‌ ఎయిర్‌వేస్‌కు సంబంధించి కొనుగోలుదారులు లేదా పెట్టుబడిదారులను మే చివరి నాటికి ఖరారు చేస్తామని ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌ పేర్కొన్నారు. ప్రమోటర్‌ అయిన నరేష్‌ గోయల్‌ సైతం త్వరలో జరిగే బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు అర్హులేనని చెప్పారు. బ్యాంకులు ఇచ్చిన రుణాలను ఈక్విటీగా మార్చడం వల్ల జెట్‌ ఎయిర్‌వేస్‌లో... ఎస్‌బీఐ ఆధ్వర్యంలోని బ్యాంకులకు 51 శాతం వాటా ఉండనుంటే, నరేష్‌ గోయల్‌ వాటా ప్రస్తుత 50 శాతం నుంచి 25 శాతానికి దిగొస్తుంది. అలాగే, అబుదాబికి చెందిన ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌ వాటా 24 శాతం నుంచి 12 శాతానికి తగ్గుతుంది. జెట్‌ ఎయిర్‌వేస్‌ విక్రయానికి సంబంధించి బిడ్డింగ్‌ ప్రక్రియను జూన్‌ నాటికి పూర్తి చేయాలన్నది ప్రణాళిక. అయితే, మే 31 నాటికే ఇది ముగుస్తుందన్న ఆశాభావాన్ని రజనీష్‌ కుమార్‌ వ్యక్తం చేశారు. ‘‘ఎవరు రావాలన్నా జెట్‌ ద్వారాలు తెరిచే ఉంటాయి. ఏప్రిల్‌ 9 నాటికి ఆసక్తి వ్యక్తీకరణ తెలియజేయాల్సి ఉంటుంది. ఏప్రిల్‌ 30 నాటికి బిడ్డింగ్‌ ముగుస్తుంది. మే నాటికి ఇన్వెస్టర్‌ను ఖరారు చేస్తాం’’ అని రజనీష్‌ కుమార్‌ తెలిపారు. ఫైనాన్షియల్‌ ఇన్వెస్టర్‌ లేదా ఎయిర్‌లైన్‌.. నరేష్‌ గోయల్‌ అయినా లేదా ఎతిహాద్‌ అయినా ఇన్వెస్ట్‌ చేయవచ్చన్నారు. బిడ్డింగ్‌కు ఎవరికీ నిషేధం లేదని స్పష్టం చేశారు.   

జెట్‌ ఎయిర్‌వేస్‌ను కాపాడడమే: గోయల్‌ 
జెట్‌లో పనిచేసే 22,000 మంది ఉద్యోగుల కుటుంబ ప్రయోజనాల కంటే తనకు ఏదీ పెద్ద త్యాగం కాదని కంపెనీ చైర్మన్, బోర్డు నుంచి తప్పుకున్న నరేష్‌ గోయల్‌ వ్యాఖ్యానించారు. 25 ఏళ్లుగా సేవలు అందిస్తున్న జెట్‌ ఎయిర్‌వేస్‌ను స్థాపించినది నరేష్‌ గోయల్‌. 1992 నుంచి కంపెనీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ‘‘నా కుటుంబంలోని 22,000 మంది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యల కోసమే జెట్‌ఎయిర్‌వేస్‌ బోర్డు నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నా. నా కుటుంబం నాతో, నా వెనుకనే ఉన్నది. మీరు కూడా నా నిర్ణయానికి మద్దతు ఇస్తారని ఆశిస్తున్నా’’ అని చెప్పారు.

కొత్త అధ్యాయం ఇప్పుడే మొదలు
జెట్‌ బోర్డు నుంచి తప్పుకున్న నేపథ్యంలో తమ ప్రయాణం ముగిసిపోలేదని, నూతన అధ్యాయం ఇప్పుడే మొదలైందన్నారు గోయల్‌. రుణ పునర్నిర్మాణ ప్రణాళిక ఆమోదంతో జెట్‌ బలమైన, స్థిరమైన ఆర్థిక మూలాలపై నిలబడుతుందన్న ఆశాభావాన్ని 22,000 మంది ఉద్యో గులకు రాసిన లేఖలో గోయల్‌ వ్యక్తం చేశారు. సంస్థకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉందన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement