
సాక్షి, న్యూఢిల్లీ : అవినీతికి వ్యతిరేకంగా చేపట్టే ఎలాంటి సాధారణ చర్యలనైనా రాజకీయ కక్ష సాధింపు చర్యలుగా పరిగణించడం పరిపాటైందని ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ఆందోళన వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు జరుగుతున్న ఐటీ దాడులపై దేశవ్యాప్తంగా పలువురు నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో జైట్లీ ఈ వ్యాఖ్యలు చేశారు.
అవినీతిపై చట్టబద్ధమైన చర్యలు చేపట్టడం రాజకీయ కక్షసాధింపు ఎంతమాత్రం కాదని జైట్లీ బుధవారం ఫేస్‌బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు. అవినీతికి పాల్పడి రాజకీయ కక్ష సాధింపుకు పాల్పడుతున్నారంటూ సమర్ధించుకోవడం సరైంది కాదని దుయ్యబట్టారు. అవినీతికి వ్యతిరేకంగా చేపట్టే ఎలాంటి చర్యనైనా రాజకీయ కక్ష సాధింపుగా పేర్కొనడం విపక్షాలకే చెల్లిందని విమర్శించారు. కర్నాటక, మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో ఇటీవల పలువురు ప్రముఖులపై ఐటీ దాడులు జరిగిన సంగతి తెలిసిందే. మధ్యప్రదేశ్‌లో సీఎం కమల్‌నాధ్ సంబంధీకులపై జరిగిన దాడుల్లో రూ 150 కోట్లకు పైగా నగదు, ఆభరణాలు పట్టుబడ్డాయని అధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment