సాక్షి న్యూఢిల్లీ: భవిష్యత్‌లో జీఎస్‌టీ వ్యవస్థను మరింత సరళతరం చేయనున్నామని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ జైట్టీ తెలిపారు. రానున్న కాలంలో దేశంలో మూడే జీఎస్‌టీ రేట్లు ఉంటాయని అరుణ్‌జైట్లీ ప్రకటించారు. జీఎస్‌టీలో అత్యధిక పన్ను శ్లాబు అయిన 28శాతాన్ని క్రమంగా తొలగిస్తామని, 12, 18శాతం శ్లాబులను కూడా తొలగించి వాటి స్థానంలో ప్రామాణిక పన్ను రేటును తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.
18నెలల జీఎస్‌టీ (Eighteen Months of GST) పేరుతో జైట్లీ తన ఫేస్‌బుక్ పేజీలో ఒక పోస్టు పెట్టారు. 2017 జులై 1న జీఎస్‌టీ అమల్లోకి వచ్చింది ఇంకా 18నెలలు కూడా నిండని జీఎస్‌టీపై అసంపూర్ణ సమాచారంతో తీవ్ర విమర్శలు, ఉద్దేశ పూర్వక దాడి జరుగుతోంది. ఈ నేపథ్యంలో జీఎస్‌టీ వ్యవస్థ అమలు అసలు ప్రభావం అంటూ ఆయన రాసుకొచ్చారు. ఈ సందర్బంగా జీఎస్‌టీ అమలుకు ముందు ప్రపంచంలో ఎక్కడాలేని అత్యంత ఘోరమైన పరోక్ష పరోక్ష పన్ను వ్యవస్థ దేశంలో ఉండేదని వ్యాఖ్యానించారు. కానీ తమ హాయాంలో జీఎస్‌టీ అమల్లోకి అమల్లోకి వచ్చిన తర్వాత 31శాతం అంతకంటే ఎక్కువ పన్నులున్న దాదాపు 200 రకాల వస్తువులను 28శాతం శ్లాబులో చేర్చామని తెలిపారు. సామాన్యులు వినియోగించే ఎన్నో నిత్యావసర వస్తువులపై జీరో, లేదా 5శాతం జీఎస్‌టీ మాత్రమే వసూలు చేయనున్నామని తెలిపారు. అలాగే అంతకుముందు 35-110శాతం ఉన్న సినిమా టికెట్లను 12-18 శాతం కిందకు తీసుకొచ్చాం. అలాగే సిమెంట్, ఆటోపార్ట్స్‌పై మాత్రమే ప్రస్తుతం 28శాతం ఉందని, భవిష్యత్‌లో వీటిని తక్కువ పన్ను పరిధిలోకి తీసుకొస్తామని జైట్లీ వెల్లడించారు.
జీఎస్‌టీకి ముందు చాలా వస్తువులపై 31శాతం అంతకన్నా ఎక్కువ పన్నులు ఉండేవి. దీనివల్ల పన్ను ఎగవేత ఎక్కువగా ఉండేది. సరకు రవాణా కూడా ఆలస్యమయ్యేది. కానీ ఇపుడు పరిస్థితి మారింది. విలాసవంతమైన వస్తువులు, సిమెంటు, డిష్‌వాషర్లు, ఏసీలు, పెద్దపెద్ద టీవీలపై మాత్రమే 28శాతం పన్ను ఉంది. నిత్యం వినియోగించే 1216 వస్తువుల్లో.. 183 రకాల వస్తువులపై ఎలాంటి పన్ను లేదు. 5శాతం శ్లాబులో 308, 12శాతం శ్లాబులో 178, 18శాతం శ్లాబులో 517 వస్తువులున్నాయి. 28శాతం శ్లాబు క్రమంగా పూర్తిగా తొలగిపోతుంది.12శాతం, 18శాతం శ్లాబులు కాకుండా వాటి స్థానంలో ప్రామాణిక పన్ను రేటును తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నాం. ఆ రేటు 12, 18శాతాలకు మధ్యస్తంగా ఉంటుంది. దీనికి కొంత సమయం పట్టొచ్చు. పన్ను చెల్లింపులు పెరిగిన దాని ప్రకారంగా ఈ పన్ను రేటును తీసుకొస్తాం. ఇకపై జీఎస్‌టీలో సున్నా, 5శాతం, ప్రామాణిక పన్ను రేటు మాత్రమే ఉంటాయఅని జైట్లీ తెలిపారు. ఫెడరల్ వ్యవస్థలో ప్రయోగాత్మకంగా మొట్టమొదటిసారిగా జీఎస్‌టీని అమలు చేస్తున్నాం. ఇప్పటివరకూ 31 జీఎస్‌టీమండలి సమావేశాలు నిర్వహించుకున్నాం. వేలాది నిర్ణయాలు తీసుకున్నాం. భవిష్యత్తులో మరిన్ని నిర్ణయాలు తీసుకోనున్నామంటూ రాసుకొచ్చారు.
కాగా 2019 సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో 99శాతం వస్తువులను 18శాతం అంతకన్నా తక్కువ శ్లాబుల్లోకి మార్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజా 31వ జీఎస్‌టీ సమావేశంలో పన్ను రేట్లలో పలుమార్పులకు జీఎస్‌టీ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. 28శాతం జీఎస్‌టీ రేటు వున్న వస్తువులలో కొన్నింటిని 18శాతం, 5శాతం శ్లాబులకుమార్చింది. అయితే సినిమా టికెట్లపై జీఎస్‌టీ రేటును తగ్గించిన కేంద్రం, సిమెంట్‌ను మాత్రం 28 శాతం శ్లాబులోనే ఉంచడంపై విమర్శలు చెలరేగాయి.
Comments
Please login to add a commentAdd a comment