అపర చాణక్యుడు.. ట్రబుల్‌ షూటర్‌! | Arun Jatiley is A brilliant strategist | Sakshi
Sakshi News home page

అపర చాణక్యుడు.. ట్రబుల్‌ షూటర్‌!

Published Sat, Aug 24 2019 3:56 PM | Last Updated on Sat, Aug 24 2019 4:15 PM

Arun Jatiley is A brilliant strategist - Sakshi

బీజేపీకి ట్రబుల్‌ షూటర్‌ అనదగ్గ నాయకుడు, అపర రాజకీయ చాణక్యుడు అరుణ్‌ జైట్లీ.. తన మూడు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో బీజేపీకి ఏ కష్టమొచ్చినా నేనున్నాంటూ జైట్లీ ట్రబుల్‌ షూటర్‌లా వ్యవహరించారు. వ్యూహకర్తగా తెరవెనుక ఉండి పార్టీని సంక్షోభ సమయాల్లో గట్టెక్కించారు. గతంలో రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా పనిచేసిన జైట్లీ.. తన వాగ్ధాటితో మన్మోహన్‌ సింగ్‌ నేతృత్వంలోని యూపీఏ సర్కారుకు ముచ్చెమటలు పట్టించారు. దేశంలోనే పేరొందిన న్యాయవాదిగా ఘనత సొంతం చేసుకున్న జైట్లీ నిశిత దృష్టికి, పదునైన విమర్శలకు చిక్కకుండా పలు బిల్లులను రాజ్యసభలో ఆమోదించుకోవడం నాటి యూపీఏకు సర్కారుకు కత్తిమీద సాములా ఉండేది. వరుస కుంభకోణాలపై యూపీఏ సర్కారును దునుమాడిన జైట్లీ మన్మోహన్‌ సర్కారు పతనంలో తనవంతు పాత్ర పోషించారు. అనంతరం నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం తొలిహయాంలో అత్యంత కీలక మంత్రిగా ఉండి.. మోదీ సర్కారు నిలదొక్కుకోవడంలోనూ కీలక పాత్ర పోషించారు. 

న్యాయవాదిగా ప్రస్థానం..
న్యాయవాద వృత్తి నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించిన జైట్లీ.. ఇటు పాలిటిక్స్‌లోనే కాదు.. అటు లీగల్‌ సర్కిల్‌లోనే ప్రముఖుడిగా పేరొందారు. దేశంలోనే ప్రఖ్యాత న్యాయవాదిగా పేరొందిన జైట్లీని రాజకీయాలు సహజంగానే ఆకర్షించాయి. 1974లో ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్‌ యూనియన్‌ (డీయూఎస్‌యూ) అధ్యక్షుడిగా గెలుపొందడంతో రాజకీయ రంగంలో ఆయన ప్రవేశానికి మార్గం సుగమం అయింది. అనంతరం ఎమర్జెన్సీ సమయంలోనూ నాటి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జైట్లీ పనిచేశారు.

1990లో దేశ రాజకీయ సామాజిక వాతావరణం విపరీతంగా మార్పులకు లోనవుతున్న సమయం. ఒకవైపు మండల్‌ రాజకీయాలు ఉత్తరాది రాష్ట్రాలను కుదిపేస్తుండగా.. మరోవైపు బాబ్రీ మసీదు కూల్చివేత ఒక చీకటి అధ్యాయంగా దేశ మౌలిక పునాదులను పేకలిస్తుందా? అన్నంతగా కల్లోల పరిస్థితి. మరోవైపు దేశ ఆర్థిక వ్యవస్థలో సమూల సంస్కరణల కోసం అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు, ఆర్థికమంత్రి మన్మోహన్‌సింగ్‌ నూతన అధ్యాయానికి శ్రీకారం చుడుతున్న సమయం. ఇలాంటి సమయంలో జైట్లీ రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తూ.. బీజేపీలో క్రమంగా ఎదుగుతూ వచ్చారు. అటల్‌ బిహారీ వాజపేయి, ఎల్కే అద్వానీ తర్వాతిస్థానం జైట్లీదే అన్నంతగా ఆయన తెరపైకి వచ్చారు. పార్టీ ఎన్నికల వ్యూహాకర్తగా జైట్లీ తనను తాను నిరూపించుకున్నారు. 2003లో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ సర్కారును కూల్చడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అప్పటివరకు బిజిలీ, సడక్‌, పానీ ఎన్నికల నినాదాలుగా ఉండేవి. కానీ జైట్లీ అభివృద్ధి అంశాన్ని ఎన్నికల నినాదంగా మార్చి బీజేపీకి విజయాన్ని అందించారు. 

పెద్దల సభలో గర్జించిన గళం
బీజేపీలో కీలక నేతగా, ప్రఖ్యాత న్యాయవాదిగా అప్పటికే పేరు తెచ్చుకున్న జైట్లీ.. 1999లో తొలిసారి వాజపేయి ప్రభుత్వంలో కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రిగా, డిజిన్వెస్ట్‌మెంట్‌ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. అనంతరం 2000 సంవత్సరంలో కేబినెట్‌ మంత్రిగా ప్రమోషన్‌ పొంది.. కీలక లా, సామాజిక న్యాయం, కంపెనీ వ్యవహారాల శాఖలను సమర్థవంతంగా నిర్వర్తించారు. కేంద్ర కేబినెట్‌లో కంటే పార్లమెంటులో ప్రతిపక్ష నేతగా జైట్లీ ఎక్కువ పేరు తెచ్చుకున్నారు. 2004లో వాజపేయి ప్రభుత్వం అనూహ్యంగా ఓడిపోవడంతో రాజ్యసభలో ప్రతిపక్ష గళంగా జైట్లీ అవతరించారు. అదే ఊపులో 2009లో ఆయన పెద్దలసభలో ప్రతిపక్ష నేత పదవిని నిర్వర్తించి.. నాటి యూపీఏ సర్కారుకు చుక్కలు చూపించారు. మన్మోహన్‌ సర్కారును సభలో ఏకిపారేస్తూ.. తన వాగ్ధాటితో ఉక్కిరిబిక్కిరి చేస్తూ.. కేంద్రాన్ని అనేకసార్లు జైట్లీ ఇరకాటంలో పెట్టారు. మన్మోహన్‌ సర్కారు పతనంలో ప్రతిపక్ష నేతగా తనవంతు పాత్రను జైట్లీ అత్యంత సమర్థంగా పోషించారు. 

ఎన్నికల్లో గెలువనప్పటికీ..!
2014లో మోదీ ప్రభంజనంతో కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు అధికారంలోకి వచ్చింది. అయితే, మోదీ హవా కూడా జైట్లీని ఎన్నికల సమరంలో ఒడ్డున పడేయలేకపోయింది. అమృతసర్‌లో పోటీ చేసిన జైట్లీ.. కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ చేతిలో ఓటమిపాలయ్యారు. అయితే, ఈ ఓటమి.. బీజేపీలోని ఆయన చరిష్మాను, విశ్వసనీయతను చెదరగొట్టలేకపోయింది. నరేంద్రమోదీకి అత్యంత నమ్మకస్తుడిగా ఆయన కేబినెట్‌లో జైట్లీ కీలక పదవులు పోషించారు. ఎన్డీయే తొలి హయాంలో కీలకమైన ఆర్థిక, రక్షణ మంత్విత్వ శాఖలను జైట్లీ నిర్వర్తించారు. ఈ క్రమంలో ఆరోగ్య సమస్యలు నిత్యం వెంటాడటం ఆయనను బాగా ఇబ్బందిపెట్టింది. తరచూ ఆస్పత్రులకు వెళ్తూనే.. ఎన్డీయే తొలి హయాంలో కీలక వ్యక్తిగా, ఢిల్లీ పవర్‌ సర్కిల్‌లోని చిక్కులను మోదీ అర్థం చేసుకోవడంలో అండగా నిలిచిన నేతగా జైట్లీ వ్యవహరించారు. అనారోగ్య సమస్యలు తీవ్రం కావడంతో 2019 ఎన్నికలకు జైట్లీ దూరంగా ఉన్నారు. అయినప్పటికీ సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉండే జైట్లీ పలు అంశాల్లో కాంగ్రెస్‌ వైఖరిని చీల్చిచెండాడుతూ బీజేపీకి చివరివరకు నైతిక, భావజాల మద్దతును అందించారు. ఇటీవల ఆర్టికల్‌ 370 రద్దుపై కాంగ్రెస్‌ వ్యవహరించిన వైఖరిని తీవ్రంగా తప్పుబడుతూ జైట్లీ సోషల్‌ మీడియాలోనే ఘాటైన విమర్శలు చేశారు. 

రాజకీయాలే కాదు న్యాయవ్యవస్థలోనూ జైట్లీ తనదైన ముద్ర వేశారు. ఢిల్లీ క్రికెట్‌ అసోసియేషన్‌లోనూ అత్యంత కీలకంగా వ్యవహరిస్తూ తన పట్టు నిలుపుకున్నారు. మోదీ హయాంలో భారత క్రికెట్‌లోనూ ఆయన ఆధిపత్యం కొనసాగింది. భావజాలపరంగా రైట్‌ వింగ్‌ రాజకీయాలను అనుసరించినప్పటికీ జైట్లీ అన్ని రాజకీయ పార్టీల్లోనూ మంచి స్నేహితులు ఉన్నారు. పాత్రికేయులతో నిత్యం స్నేహపూరితంగా ఉండే జైట్లీ.. బీజేపీ అంతర్గత వ్యవహారాలు బయటకు పొక్కేలా చేస్తున్నారని పలు సందర్భాల్లో పార్టీ నేతలే అనుమానించేవారు. అయితే, జర్నలిస్టులతో మాత్రం ఆయన సన్నిహితంగా ఉండేవారు. అందుకే ఎడిటర్లకు కనుక ప్రధానమంత్రిని ఎన్నుకునే అవకాశమొస్తే.. కచ్చితంగా జైట్లీనే ఎన్నుకునే వారని పాత్రికేయ వర్గాలు చెప్పుకునేవి. చివరిక్షణం వరకు రాజకీయాల్లో, న్యాయవ్యవస్థలో తనదైన ముద్రను వేసిన జైట్లీ.. శనివారం శాశ్వతంగా ఈ లోకం నుంచి వీడ్కోలు తీసుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement