సాక్షి, న్యూఢిల్లీ : మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ దేశభక్తిని, అంకిత భావాన్ని తాము ప్రశ్నించలేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం స్పష్టం చేశారు. ఆయన రాజ్యసభలో మాట్లాడుతూ.. మన్మోహన్ సింగ్ నిబద్ధతను ప్రధాని మోదీ ప్రశ్నించలేదని చెప్పారు. గుజరాత్ ఎన్నికల సందర్భంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీలపై మోదీ అనుచిత వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు. తద్వారా మన్మోహన్‌పై మోదీ చేసిన వ్యాఖ్యలపై ఆయన పరోక్షంగా క్షమాపణ చెప్పినట్టు అయిందని భావిస్తున్నారు.
‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ప్రసంగాల్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను, మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీలను ఎక్కడా ప్రశ్నించలేదు. అదేవిధంగా వారికి దేశంపట్ల ఉన్న నిబద్ధతపై అనుమానాలు లేవు. మన్మోహన్, అన్సారీలకున్న దేశభక్తి పట్ల మాకు నమ్మకం, విశ్వాసం ఉన్నాయని’ అరుణ్ జైట్లీ పేర్కొన్నారు.
గుజరాత్ శాససభ ఎన్నికల సందర్భంగా నిర్వహించిన ప్రచార సభల్లో మన్మోహన్, హమీద్ అన్సారీలపై ప్రధాని మోదీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ప్రధానంగా.. గుజరాత్ ఎన్నికలపై ప్రభావం చూపేలా పాకిస్తాన్ దౌత్యాధికారులను మన్మోహన్ కలిసినట్లు మోదీ తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేకాక ఆదేశ మాజీ మంత్రితో మన్మోహన్ రహస్యంగా సమావేశమయ్యారని ఆరోపణలు గుప్పించారు. మన్మోహన్ సింగ్‌పై ప్రధాని మోదీ నిరాధార ఆరోపణలు చేశారని.. కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఆరోపిస్తోంది. అంతేకాక ఈ ఆరోపణలపై మోదీ క్షమాపణలు చెప్పాంటూ శీతాకాల సమావేశాలు మొదలైనప్పటినుంచీ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.
ఇదిలావుండగా.. అరుణ్‌జైట్లీ ప్రకటనపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్పందించారు. దీనిపై మన్మోహన్ సింగ్ ఓ ప్రకటన విడుదల చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం తనపై తప్పుడు ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు కేవలం రాజకీయ దురుద్దేశంతోనే చేసినవని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. అరుణ్ జైట్లీ చెప్పిన క్షమాపణలు తన గౌరవాన్ని తిరిగి పెంచుతాయని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment