అన్సారీకి రాజ్యసభ వీడ్కోలు
చైర్మన్‌గా తన వంతు న్యాయం చేశారు: ప్రధాని
► సభా నియమాల్ని పాటించడంలో ఆయనకు ఆయనే సాటి: సభ్యులు
► అన్సారీ నుంచి ఎన్నో సలహాలు, సూచనలు తీసుకున్నా: మన్మోహన్
► ప్రభుత్వ విధానాలపై విమర్శల్ని అనుమతించకపోతే నిరంకుశత్వమే: అన్సారీ
న్యూఢిల్లీ: రాజ్యసభ చైర్మన్‌గా చివరి రోజైన గురువారం హమీద్ అన్సారీకి పార్టీల కతీతంగా ఘనంగా వీడ్కోలు పలికారు. రాజ్యాంగ ధర్మాన్ని పరిరక్షించడంలో అన్సారీ తన వంతు న్యాయం చేశారని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. రాజ్యసభను సజావుగా నడపడంలో అన్సారీ పాత్రను సభ్యులు గుర్తు చేసుకున్నారు.
విధి నిర్వహణలో ఎక్కువ సమయం సభా నియమాల్ని పాటించేందుకు కృషిచేశారని, ఆయన హయాంలో గందర గోళం మధ్య ఏ బిల్లు ఆమోదం పొందలేదని ప్రశంసించారు. రెండుసార్లు ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన అన్సారీ.. పదేళ్ల పాటు రాజ్యసభ చైర్మన్‌గా వ్యవహరించారు. తదుపరి చైర్మన్‌గా శుక్రవారం ఎం.వెంకయ్య నాయుడు బాధ్యతలు చేపట్టనున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ..‘ ప్రజలు, పార్లమెంట్ ఉభయ సభల తరఫున దేశ ఉపాధ్యక్షుడిగా మీరు అందించిన సేవలకు కృతజ్ఞతలు చెబుతున్నాను. దౌత్య ప్రతినిధిగా పశ్చిమాసియాలో ఎంతో చురుగ్గా పనిచేశారు. ఉద్యోగ విరమణ అనంతరం కూడా.. మైనార్టీ కమిషన్, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీతో కలిసి ఎక్కువ సమయం పనిచేశారు. ఇన్నేళ్లలో మీలో మీరు ఎంతో సంఘర్షణ అనుభవించి ఉంటారు. ఇక నుంచి ఆ సందిగ్ధత ఉండదు. స్వేచ్ఛగా ఉండేందుకు, మీ మనోభీష్టం మేరకు పనిచేసేందుకు, మాట్లాడేందుకు అవకాశం దొరుకుతుంది’ అని మోదీ పేర్కొన్నారు.
శారీరకంగా కూడా అన్సారీ ఎంతో ఆరోగ్యవంతుడని మోదీ ప్రశంసించారు. సభా నాయకుడు, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లా డుతూ ‘అన్సారీకి, సభ్యులకు ఇది ఎంతో ఉద్వేగభరిత సమయం. చైర్మన్‌గా మీ విధి నిర్వహణ ఎంతో సవాలుతో కూడింది. రాజ్య సభ 1950, 60ల్లో ఉన్నట్లు లేదు, ప్రస్తుతం పార్టీల బలాబలాల్ని సభ ప్రతిఫలిస్తుంది. పరస్పర దూషణలతో చర్చ మొదలై గందర గోళం, ఆందోళనల మధ్య సాగుతోంది. అయి తే అన్సారీ హయాంలో ఎన్నోసార్లు సభకు అంతరాయం కలిగినా.. చాలా సందర్భాల్లో మంచి చర్చ జరిగింది’ అని జైట్లీ పేర్కొన్నారు.
నడక, యోగా అన్సారీ ఆరోగ్య రహస్యం
రాజ్యసభ చైర్మన్‌గా అన్సారీ పాత్రను మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కొనియాడారు. దేశం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నా.. అన్సారీ వంటి వ్యక్తుల వల్లే పురోగమిస్తోందన్నారు. ఎన్నో సార్లు ఆయన నుంచి సలహాలు సహకారం పొందానని మన్మోహన్ గుర్తు చేసుకున్నారు. చైర్మన్‌గా సభ నడిపిన తీరును ప్రతిపక్ష నేత ఆజాద్ కొనియాడారు. మంచి ఆరోగ్యం కోసం అన్సారీ క్రమం తప్పకుండా నడకతో పాటు యోగా చేస్తారని తృణమూల్ ఎంపీ డెరెక్ ఒబ్రియాన్ వెల్లడించారు.
బాధ్యతగా వ్యవహరించాలి: అన్సారీ
ప్రభుత్వ విధానాలపై స్వేచ్ఛగా, నిజాయతీతో కూడిన విమర్శల్ని అనుమతించకపోతే.. ప్రజాస్వామ్యం నిరంకుశత్వానికి దారి తీస్తుందని హమీద్ అన్సారీ అన్నారు. రాజ్యసభ చైర్మన్‌గా చివరి ప్రసంగం చేస్తూ.. ‘సభ్యులకు విమర్శించే హక్కుంది. అయితే కావాలని సభను అడ్డుకునేలా వ్యవహరించకూడదు. అందరికీ హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉంటాయి’ అని పేర్కొన్నారు. రాజ్యాంగం ఏర్పాటుచేసిన రాజ్యసభ దేశంలోని భిన్నత్వాన్ని ప్రతిఫలిస్తుందని అన్సారీ అభిప్రాయపడ్డారు. రాజ్యసభలో అధ్యక్ష స్థానం.. క్రికెట్‌లో అంపైర్, హాకీలో రిఫరీ వంటిదని ఆటను, ఆటగాళ్లను పర్యవేక్షిస్తూ.. రూల్స్ పుస్తకం ఆధారంగా వ్యవహరించాలని చెప్పారు.
‘నా కుమారుడు హిందూనా? ముస్లిమా?’
న్యూఢిల్లీ: రాజ్యసభలో శుక్రవారంతో పదవీకాలం ముగియనున్న ముగ్గురు సభ్యులకు వీడ్కోలు పలికేందుకు గురువారం సమావేశం ఏర్పాటు చేశారు. సీపీఎం నేత సీతారాం ఏచూరి, తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన బంద్యోపాధ్యాయ్, బీజేపీ ఎంపీ దిలీప్ పాండ్యల పదవీకాలం ముగియనుంది. ఈ కార్యక్రమంలో సీతారాం ఏచూరి మాట్లాడుతూ దేశంలో బహుళత్వాన్ని పరిరక్షించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఏకత్వంలోని భిన్నత్వ భావనలను బలపరిచినప్పుడే దేశం బలపడుతుందని ఆయన అన్నారు.
ఏచూరి మాట్లాడుతూ ‘మన భిన్నత్వంపై మీరు మత, భాషా, సాంస్కృతిక తదితర ఏ ఏకత్వాన్నైనా బలవంతంగా రుద్దాలని చూస్తే దేశం ఒకటిగా ముందుకు సాగలేదు. బహుళత్వమే భారత బలం. అది లేనినాడు దేశం కుప్పకూలుతుంది’ అని హెచ్చరించారు. ‘నేను మద్రాసులో ఓ తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను. నా పాఠశాల విద్యాభ్యాసమంతా ఇస్లాం సంస్కృతి ఎక్కువగా ఉండే హైదరాబాద్‌లో సాగింది. ఓ సూఫీ ముస్లిం కూతురిని నేను పెళ్లి చేసుకున్నాను. మా మామయ్య తల్లి రాజ్‌పుత్ వంశానికి చెందిన వారు. అయితే నా కుమారుడు ఏమవుతాడు? అతడు బ్రాహ్మణుడా, హిందూనా, ముస్లిమా?.. అవేమీ కాదు, నా కుమారుడు భారతీయుడు’ అని ఏచూరి అన్నారు.