
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అనారోగ్యం కారణంగా ప్రస్తుతం విదేశాల్లో ఉన్నందున, ఆర్థిక శాఖ బాధ్యతలను తాత్కాలికంగా పియూష్ గోయల్‌కు ప్రభుత్వం కేటాయించింది. దాంతో కేంద్ర తాత్కాలిక బడ్జెట్‌ను ఫిబ్రవరి 1వ తేదీన గోయల్ ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం పియూష్ గోయల్ రైల్వే, బొగ్గు శాఖల మంత్రిగా ఉండగా, ఇప్పుడు ఆయనకు ఆర్థిక శాఖ బాధ్యతలను అదనంగా ఇచ్చారు. గతేడాది జైట్లీ మూత్రపిండ మార్పిడి చికిత్స చేయించుకున్నప్పడు కూడా ఆర్థిక శాఖ తాత్కాలిక మంత్రిగా వంద రోజులపాటు గోయల్ ఉన్నారు. ఈసారి తాత్కాలిక బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి సరిగ్గా 9 రోజుల ముందు ఆర్థిక శాఖ బాధ్యతలు గోయల్‌కు దక్కడం గమనార్హం. జైట్లీ తిరిగి బాధ్యతలు చేపట్టే వరకు గోయల్ ఆర్థిక మంత్రిగా కొనసాగుతారనీ, జైట్లీ మంత్రిగా కొనసాగనున్నప్పటికీ ఆయనకు ఏ శాఖలూ ఉండవని రాష్ట్రపతి భవన్ నుంచి బుధవారం విడుదలైన ఒక ప్రకటనలో ప్రభుత్వం వెల్లడించింది.