సాక్షి, న్యూఢిల్లీ: కశ్మీర్‌లో ఉగ్రదాడికి పాల్పడిన పాకిస్తాన్‌కు దీటైన సమాధానం చెబుతామని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. కేంద్ర భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ... పాకిస్తాన్ చాలా పెద్ద తప్పు చేసిందని, దాడికి పాల్పడినవారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. పుల్వామాలో ఉగ్రదాడి ఘటనతో దేశ ప్రజల రక్తం మరిగిపోతోందని తెలిపారు. (ఉగ్ర మారణహోమం)
ఇలాంటి దాడులతో భారతదేశ సమగ్రతను, స్థిరత్వాన్ని దెబ్బతీయలేరని స్పష్టం చేశారు. మానవతావాదులంతా ఏకమై ఉగ్రవాదులపై పోరాటానికి సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. ఈ ఘటనపై రాజకీయాలు అనవసరమని, ప్రతిపక్ష పార్టీలన్నీ ఏక తాటిపైకి రావాలన్నారు. ఉగ్రవాదంపై కలసికట్టుగా పోరాడదామన్నారు. సైనికుల ధైర్యం, త్యాగాలు వెలకట్టలేనివని అమరుల కుటుంబాలకు అండగా ఉంటామని ప్రధాని మోదీ భరోసాయిచ్చారు. (ఉగ్ర దాడికి కొత్త వ్యూహాలు)
పాక్‌కు మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్ రద్దు
పాకిస్తాన్‌కు గతంలో ఇచ్చిన మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్ ఉపసంహరిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్‌ను ఏకాకిని చేస్తామన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ ఘటన వెనుక పాకిస్తాన్, ఆ దేశ మద్ధతుదారుల హస్తం ఉందని ఆరోపించారు. పాకిస్తాన్‌కు సహకరించేవారిపై కూడా కఠినంగా వ్యవహరిస్తామని వార్నింగ్ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment