పాకిస్థాన్‌కు మరోసారి అమెరికా స్ట్రాంగ్ మెసేజ్!
వాషింగ్టన్: తన భూభాగాన్ని స్వర్గధామంగా మార్చుకొని కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉగ్రవాదులందరినీ ఏరిపారేయాల్సిందేనని పాకిస్థాన్‌కు అమెరికా మరోసారి స్పష్టం చేసింది. పాకిస్థాన్ భూభాగంలో పనిచేస్తున్న ఉగ్రవాద గ్రూపులన్నింటినీ అక్రమమైనవిగా గుర్తించి.. నిర్మూలించాలని సూచించింది. 'పాకిస్థాన్ భూభాగంలో పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలన్నింటిపై ఉక్కుపాదం మోపాల్సిందేనని మేం ఆ దేశాన్ని కోరుతూనే ఉన్నాం' అని అమెరికా విదేశాంగ డిప్యూటీ అధికార ప్రతినిధి మార్క్ టోనర్ శుక్రవారం విలేకరులకు తెలిపారు. ఉగ్రవాదులు, హింసాత్మక అతివాదుల కారణంగా పాకిస్థానే ఎక్కువగా నష్టపోయిందని ఆయన గుర్తుచేశారు. ఉగ్రవాద ముప్పుపై పోరాటంలో పాకిస్థాన్‌కు తాము సాయం అందిస్తామని, అయితే పాకిస్థాన్ భూభాగాన్ని తమకు స్వేచ్ఛాయుత ఆవాసంగా మార్చుకున్న ఉగ్రవాదులపై ఆ దేశం చర్య తీసుకోవాల్సిందేనని ఆయన స్పష్టంచేశారు.
19 మంది సైనికులను పొట్టనబెట్టుకున్న ఉడీ ఉగ్రవాద దాడితో భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోయిన సంగతి తెలిసిందే. దీంతో భారత సైన్యం పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ దాడులు జరిపింది. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులపై భారత సైన్యం జరిపిన దాడులను అమెరికా సమర్థించింది. ఉడీ దాడీ సీమాంతర ఉగ్రవాదానికి స్పష్టమైన నిదర్శనమని తేల్చిచెప్పిన అగ్రరాజ్యం... ఉగ్రవాద ముప్పుపై సైనిక చర్యలతో బదులు చెప్పాల్సిన అవసరముందంటూ భారత్ వైఖరిని సమర్థించింది.