సర్జికల్ స్ట్రైక్స్‌ను ప్రశ్నిస్తున్న నాయకులపై భారత నాయకులపై ఉడీ ఉగ్రదాడి బాధితులు తీవ్రంగా మండిపడుతున్నారు. అసలు సర్జికల్ దాడులు చేయాల్సింది కూడా ఉగ్రవాదుల మీద కాదని, ముందుగా ఇలాంటి నాయకుల మీద అని అంటున్నారు. సర్జికల్ దాడులు జరిగాయా లేదా.. సైన్యం సరిహద్దుల్లో ఎప్పుడూ జరిపే కాల్పులనే అలా చిత్రీకరించిందా అంటూ కొందరు నాయకులు అనుమానాలు వ్యక్తం చేయడంతో ఉడీ ఉగ్రదాడిలో తమవాళ్లను కోల్పోయిన కుటుంబాల సభ్యులు తీవ్ర ఆగ్రహావేశాలకు లోనవుతున్నారు. ఉడీ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన హవల్దార్ అశోక్ కుమార్ సింగ్ కుటుంబం కూడా ఈ నాయకుల మీద దాడులు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరుతోంది. 'సర్జికల్ దాడుల గురించి ప్రశ్నిస్తున్న నాయకులు ద్రోహులని అశోక్ కుమార్ సింగ్ భార్య సంగీతాదేవి అన్నారు.
ఉగ్రవాదులు దేశంలోకి చొరబడటానికి ఇలాంటి నాయకులే కారణమని, అసలు సర్జికల్ దాడులు నిజంగానే జరిగాయని వీళ్లు ఎందుకు అర్థం చేసుకోరని ఆమె ప్రశ్నించారు. మన దేశానికి చెందిన నాయకులే భారత సైన్యం నిబద్ధతను ప్రశ్నించడం తనను ఎంతగానో బాధించిందని ఆమె చెప్పారు. పాకిస్థాన్ ఎప్పుడూ ఉగ్రవాద దేశమేనని, వాళ్లు మన దాడులను ప్రశ్నించడం మమూలే గానీ మనవాళ్లు కూడా వాళ్లలాగే మాట్లాడటం షాక్ కలిగించిందన్నారు. ఒక అమర సైనికుడి కుటుంబం ఎంత బాధపడుతుందో వాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని తెలిపారు. ఇలాంటి నాయకులకు విషమిచ్చి చంపాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు కాంగ్రెస్ నాయకులు పి.చిదంబరం, సంజయ్ నిరుపమ్ కూడా సర్జికల్ దాడుల వీడియోలను బయట పెట్టాలని డిమాండ్ చేయడం, పాక్ పత్రికలలో వాళ్ల డిమాండ్లు పతాక శీర్షికలలో కనిపించడం తెలిసిందే.
ఆ నాయకులకు విషమివ్వండి: ఉడీ ఉగ్రదాడి బాధితులు
Published Sat, Oct 8 2016 11:07 AM | Last Updated on Sat, Aug 25 2018 3:57 PM
Advertisement
Advertisement