
కుటుంబంతో అభినందన్, అహ్మదాబాద్‌లో పైలట్ వర్ధమాన్ సురక్షితంగా తిరిగి రావాలంటూ విద్యార్థుల ప్రార్థన
విక్రమ్ అభినందన్ మహారాష్ట్రలో ఖడక్‌వాస్లాలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీఏ)లో 16 ఏళ్లు సేవలు అందించారు. మన దేశంలోని అత్యంత నైపుణ్యం కలిగిన పైలట్లలో ఆయన కూడా ఒకరు. అభినందన్ వయసు 36ఏళ్లు. సొంత రాష్ట్రం తమిళనాడు. తిరువణ్ణామలై జిల్లాకు చెందిన వారు. విద్యాభ్యాసం అంతా ఢిల్లీలోనే సాగింది. సుఖోయ్–30 యుద్ధ విమానాలను అత్యంత చాకచక్యంగా నడపగలరు. ఆ తర్వాత మిగ్–21 విమానం నడిపే బాధ్యతలు ఆయనకి అప్పగించారు. సూర్యకిరణ్ విన్యాసాలు చేయడంలో ఈయన దిట్ట.
అభినందన్ తండ్రి కూడా మాజీ ఎయిర్‌మార్షల్. ఆయన పేరు సింహకుట్టి వర్ధమాన్. గ్వాలియర్ ఎయిర్‌బేస్‌లో చీఫ్ ఆపరేషన్ ఆఫీసర్‌గా సేవలందించారు. 1999 కార్గిల్ యుద్ధంలో సమయంలో కీలక పాత్ర పోషించారు. ఈస్ట్రన్ ఎయిర్ కమాండ్ చీఫ్‌గా పని చేసి ఆయన పదవీ విరమణ చేశారు. అభినందన్ సోదరుడు కూడా వాయుసేనలో పనిచేశారు. అభినందన్ భార్య తన్వి మార్వా కూడా ఐఏఎఫ్‌లో అధికారిగా పని చేసి రిటైర్ అయ్యారు. వీరికి ఇద్దరు పిల్లలు.
ఇలా కుటుంబం మొత్తం దేశ సేవకే తమ జీవితాలను అంకితం చేయడం విశేషం. అభినందన్‌ను విడుదల చేయడానికి పాక్ అంగీకరించడంతో ఆయన తండ్రి వర్ధమాన్ ఆనందానికి హద్దుల్లేవు. నిజమైన సైనికుడంటూ కుమారుడిపై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. దేశం అంతా తన కుమారుడి విడుదలకు ప్రార్థించిన భారతీయులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రముఖ దర్శకుడు మణిరత్నం కార్గిల్ యుద్ధం నేపథ్యంలోనే తీసిన సినిమా చెలియా (తమిళంలో కాట్రూ వెలియడాయ్)లో సహజంగా సన్నివేశాలను చిత్రీకరించేందుకు అభినందన్ తండ్రి సింహకుట్టి వర్ధమాన్‌ను సంప్రదించారు. ఆ చిత్రంలోనూ ఐఏఎఫ్ విమానాన్ని పాక్ ఆర్మీ కూల్చేస్తుంది. పైలట్‌ను అదుపులోనికి తీసుకొని చిత్రహింసలు పెడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment