అక్కడ 'ధోనీ' సినిమాకు షాక్!
మధ్యతరగతి నుంచి అత్యున్నత శిఖరాలకు ఎదిగిన భారత క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన సినిమా 'ఎంఎస్ ధోనీ: ద అన్‌టోల్డ్ స్టోరీ'. ఉడీ ఉగ్రవాద దాడి నేపథ్యంలో దాయాది దేశాలు భారత్-పాకిస్థాన్ మధ్య తారస్థాయిలో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఈ సినిమాపై ఆ ప్రభావం పడింది. భారత్‌లోని పాకిస్థానీ నటులు వెంటనే దేశం విడిచివెళ్లిపోవాలని రాజ్ ఠాక్రే నేతృత్వంలోని ఎమ్మెన్నెస్ బెదిరిస్తున్న నేపథ్యంలో పాకిస్థాన్ ఏకంగా 'ధోనీ' సినిమాపై నిషేధం విధించింది.
'ధోనీ' సినిమాను పాకిస్థాన్‌లో విడుదల చేయవద్దని ఆ దేశం డిస్ట్రిబ్యూటర్లు నిర్ణయించారని 'మిడ్ డే' పత్రిక తెలిపింది. పాక్‌లో ఈ సినిమాను పంపిణీ చేయడానికి ఎవరూ ముందుకురాలేదని, దీంతో పాక్‌లో ఈ సినిమా విడుదల కాకపోవచ్చునని విశ్వసనీయవర్గాలను ఉటంకిస్తూ ఆ పత్రిక తెలిపింది. ఇరుదేశాల మధ్య నెలకొన్న మాటల యుద్ధం, ఉద్రిక్తతల నేపథ్యంలో సినిమాలపై ప్రభావం ఉంటుందని, భారత సినిమాలు పాక్‌లో విడుదల అయ్యే అవకాశం లేదని ఐఎంజీసీ గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ చైర్మన్ అహ్మద్ రషీద్ తెలిపారు. ఇక కశ్మీర్ సమస్య పరిష్కారమయ్యేవరకు భారత్ సినిమాలు పాక్‌లో విడుదల కాకుండా నిషేధించాలని లాహోర్ హైకోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలైంది.