లాహోర్: భారత్–పాక్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో రద్దయిన సంఝౌతా ఎక్స్‌ప్రెస్ లాహోర్–ఢిల్లీ మధ్య మళ్లీ పరుగులు పెడుతోంది. సంఝౌతా సర్వీసును పునరుద్ధరించినట్లు పాక్ సోమవారం ప్రకటించింది. ఇటీవల ఇరు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం నేపథ్యంలో సంఝౌతా రైలు సర్వీసును ఫిబ్రవరి 28న పాక్ రద్దు చేసిన విషయం తెలిసిందే. సోమవారం దాదాపు 150 మంది ప్రయాణికులతో సంఝౌతా ఎక్స్‌ప్రెస్ లాహోర్‌లో బయలుదేరినట్లు పాక్ రేడియో ప్రకటించింది. ఈ రైలు లాహోర్ నుంచి ప్రతి సోమ, గురువారాల్లోనూ, ఢిల్లీ నుంచి ఆది, బుధవారాల్లోనూ బయలుదేరుతుంది.
ఈ రైలు మన దేశంలో ఢిల్లీ నుంచి అటారీ వరకు, ఆ తర్వాత పాకిస్తాన్‌లో వాఘా నుంచి లాహోర్ వరకు నడుస్తుంది. సాధారణంగా ఈ రైలులో ఆక్యుపెన్సీ 70 శాతం ఉంటుండగా.. పుల్వామాలో ఫిబ్రవరి 14న జైషే మహ్మద్ ఉగ్రదాడి అనంతరం ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. 1976లో భారత్–పాక్ మధ్య కుదిరిన సిమ్లా ఒప్పందంలో భాగంగా సంఝౌతా ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసు ప్రారంభమైంది. సంఝౌతా అనే పదానికి హిందీలో ‘ఒప్పందం’అనే అర్థం. 1976లో జూలై 22న రెండు దేశాల మధ్య తొలి సర్వీసు నడిపారు. సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌లో 6 స్లీపర్ కోచ్‌లు, ఒక ఏసీ త్రీటైర్ కోచ్ ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment