Samjhauta Express
-
ఆర్టికల్ 370 ఎఫెక్ట్ : సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌కు బ్రేక్
సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో ఢిల్లీ నుంచి పాకిస్తాన్‌లోని అటారి వరకూ నడిచే సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ను భారత్ రద్దు చేసింది. ఈ ఎక్స్‌ప్రెస్‌ను పాకిస్తాన్ ఈనెల 8న రద్దు చేసిన క్రమంలో భారత్ ఆదివారం ఈ నిర్ణయం తీసుకుంది. సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేస్తూ పాకిస్తాన్ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఢిల్లీ-అటారి మధ్య నడిచే ఈ రైలును రద్దు చేయాలని నిర్ణయించినట్టు ఉత్తర రైల్వే సీపీఆర్వో ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య రైలు సర్వీసుల రద్దు నేపథ్యంలో లాహోర్-ఢిల్లీ ఫ్రెండ్షిప్ బస్ సర్వీస్‌ను సైతం పాకిస్తాన్ నిలిపివేసింది. ఇరు దేశాల మధ్య సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేస్తున్నట్టు పాక్ రైల్వే మంత్రి రషీద్ అహ్మద్ ఇటీవల ప్రకటించగా లాహోర్-న్యూఢిల్లీ మధ్య దోస్తీ బస్ సర్వీస్‌ను ప్రభుత్వం రద్దు చేసిందని పాక్ కమ్యూనికేషన్ల మంత్రి మురాద్ సయీద్ వెల్లడించారు. ఆర్టికల్ 370 రద్దుకు నిరసనగా భారత్‌తో దౌత్య, వాణిజ్య సంబంధాలు తెగతెంపులు చేసుకున్నట్టు పాకిస్తాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ నిర్ణయంతో ఆ దేశమే దెబ్బతింటుందని తమ ప్రయోజనాలపై ఇది ఎలాంటి ప్రభావం చూపదని భారత్ స్పష్టం చేసింది. -
‘సంఝౌతా’ నిలిపివేత
న్యూఢిల్లీ/వాషింగ్టన్/ఇస్లామాబాద్/దుబాయ్: పాక్‌లోని లాహోర్ నుంచి ఢిల్లీకి వస్తున్న సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ను పాక్ అధికారులు భద్రతను సాకుగా చూపుతూ వాఘా సరిహద్దు వద్దే నిలిపివేశారు. ఈ సమయంలో రైలులో 48 మంది పాకిస్తానీలు సహా 117 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న భారత బలగాలు, రైల్వే సిబ్బంది సాయంత్రం 5.15 గంటలకు అక్కడికి చేరుకున్నారు. రైలుకు భారత ఇంజిన్‌ను బిగించి భారత సరిహద్దు అట్టారి వద్దకు తీసుకొచ్చారు. పాక్ నిర్ణయంతో సరిహద్దుకు ఇరువైపులా ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. చివరికి సాయంత్రం 6.41 గంటల సమయంలో 10 మంది పాకిస్తానీలు సహా 103 మంది ప్రయాణికులతో రైలు అట్టారి నుంచి లాహోర్‌కు బయలుదేరింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత సంఝౌతా సర్వీసును నిలిపేస్తున్నట్లు పాక్ రైల్వే మంత్రి రషీద్ ప్రకటించారు. అయితే ఈ సర్వీసు కొనసాగుతుందని భారత అధికారులు స్పష్టత ఇచ్చారు. ఇంకోసారి ఆలోచించుకోండి: భారత్ తమతో దౌత్య, వాణిజ్య సంబంధాలను తెగదెంపులు చేసుకోవడంపై పాకిస్తాన్ పునరాలోచించాలని భారత్ కోరింది. ఈ చర్యలతో ఇరుదేశాల మధ్య తీవ్రమైన ఉద్రిక్తత నెలకొన్నట్లు ప్రపంచదేశాలకు చూపించేందుకు పాక్ ప్రయత్నిస్తోందని ఆరోపించింది. కాంగ్రెస్‌కు కరణ్‌సింగ్ షాక్.. ఆర్టికల్ 370 రద్దు విషయంలో కేంద్రం నిర్ణయాన్ని తాను గుడ్డిగా వ్యతిరేకించబోనని కాంగ్రెస్ నేత కరణ్ సింగ్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ వ్యవహారశైలిని ఆయన తప్పుపట్టారు. ‘కేంద్రం తీసుకున్న నిర్ణయంలో పలు సానుకూల అంశాలున్నాయి. లదాఖ్‌ను కేంద్రపాలిత ప్రాంతం(యూటీ) చేయడాన్ని స్వాగతిస్తున్నాం’ అని తెలిపారు. సంయమనం పాటించండి: అమెరికా కశ్మీర్, ఇతర సమస్యలపై భారత్–పాకిస్తాన్ల మధ్య ప్రత్యక్ష చర్చలు ప్రారంభమవ్వాలని తాము కోరుకుంటున్నట్లు అమెరికా తెలిపింది. సమస్యను ఇరుదేశాల చర్చల ద్వారా పరిష్కరించుకుంటాయన్న నమ్మకం తమకుందని యూఏఈ విదేశాంగ మంత్రి అన్వర్ తెలిపారు. ఎలాంటి సవాళ్లకైనా సిద్ధం: రాజ్‌నాథ్ ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించి క్షేత్రస్థాయి పనులు గత ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమయ్యాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ తెలిపారు. ఎలాంటి భద్రతాపరమైన సవాళ్లు ఎదురైనా ఎదుర్కొనేందుకు సాయుధ బలగాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ‘భారత మిలటరీ బలంగా కశ్మీరీలను అణచివేయగలమని బీజేపీ భావిస్తోందా? కశ్మీర్లో ప్రజల పోరాటం త్వరలో ఊపందుకోనుంది. ఈ సందర్భంగా చెలరేగే హింసను ఆపే దమ్ము ప్రపంచదేశాలకు ఉందా?’ అని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గురువారం ప్రశ్నించారు. భారతీయ సినిమాల ప్రదర్శనపై దేశవ్యాప్తంగా నిషేధం విధిస్తున్నట్లు పాకిస్తాన్ ప్రకటించింది. భారత విమానాలు తమ గగనతలం గుండా రాకపోకలు సాగించడంపై ఎలాంటి ఆంక్షలు విధించలేదని పాకిస్తాన్ పౌర విమానయాన శాఖ స్పష్టంచేసింది. ఆజాద్ అడ్డగింత కాంగ్రెస్ సీనియర్ నేత, కశ్మీర్ మాజీ సీఎం గులాం నబీ ఆజాద్‌ను అధికారులు శ్రీనగర్ విమానాశ్రయంలో గురువారం అడ్డుకున్నారు. స్థానిక కశ్మీర్ నేతలతో మాట్లాడేందుకు శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో దిగిన ఆయనను అధికారులు తిరిగి ఢిల్లీకి పంపారు. జాతీయ భద్రతా సలహాదారు దోవల్ కశ్మీర్లో పర్యటించడం, ఆ సందర్భంగా స్థానికులతో భోజనం చేయడంపై ఆజాద్ స్పందిస్తూ.. ‘డబ్బులిస్తే ఎవరైనా మనతోపాటు వస్తారు’ అని అన్నారు. అంతర్జాతీయ వేదికలపై పాక్ ఈ వ్యాఖ్యలను అనుకూలంగా చేసుకునే చాన్సుందని బీజేపీ మండిపడింది. లాహోర్ నుంచి సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌లో భారత్‌కు రానున్న బంధువును పట్టుకుని రోదిస్తున్న ఓ మహిళ -
పాక్ మరో దుందుడుకు నిర్ణయం
జమ్మూ కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించే 370 అధికరణ రద్దు అనంతరం పాకిస్తాన్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే భారత్‌తో వాణిజ్య సంబంధాలను రద్దు చేసుకున్న పాకిస్తాన్ తాజాగా భారత్-పాకిస్తాన్ మధ్య రాకపోకలు సాగించే సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ను శాశ్వతంగా నిలిపివేసింది. దీంతో వాఘా సరిహద్దులోని అంతర్జాతీయ రైల్వేస్టేషన్లో చాలా మంది ప్రయాణికులు చిక్కుకు పోయారు. జమ్మూ కశ్మీర్ ప్రత్యేక హోదాను తొలగిస్తూ, ఆర్టికల్ 370ను రద్దుచేసిన భారత్ చర్యను నిరసిస్తూ పాకిస్తాన్ సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ను సస్పెండ్ చేసింది. సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ను శాశ్వతంగా నిలిపివేసినట్టు పాకిస్తాన్ రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్ వెల్లడించారు. ఇప్పటికే టిక్కెట్లు కొన్న వ్యక్తులు తమ డబ్బును లాహోర్ డిఎస్ కార్యాలయం నుంచి వాపస్ పొందవచ్చని పేర్కొన్నారు. భద్రతా కారణాల రీత్యా ఈ చర్య తీసుకున్నామని పాకిస్తాన్ చెబుతోంది. అలాగే పాకిస్తాన్ సినిమాహాళ్లలో భారతీయ చిత్రాల ప్రదర్శనను కూడా నిలిపివేస్తున్నట్టు పాకిస్తాన్ ప్రధాని స్పెషల్ అసిస్టెంట్ డాక్టర్ ఫిర్దౌస్ ఆశిక్ అవన్ ప్రకటించడం గమనార్హం. అయితే రైలును తిరిగి భారతకు పంపించాల్సిన బాధ్యత పొరుగు దేశం పాక్‌దేనని రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ అరవింద్ కుమార్ తెలిపారు. వీసా ఉన్న డ్రైవర్, ఇతర సిబ్బందిని పంపి రైలును తిరిగి ఇండియాకు తీసుకెళ్లాల్సిందిగా పాక్ తెలిపినట్టు చెప్పారు. కాగా 1976వ సంవత్సరంలో జరిగిన సిమ్లా ఒప్పందం ప్రకారం సంఝౌతా ఎక్స్‌ప్రెస్ భారత, పాకిస్తాన్ మధ్య రాకపోకలు సాగిస్తోంది. ఫ్రెండ్షిప్ ఎక్స్‌ప్రెస్‌గా పిలిచే ఈ రైలు ప్రతి బుధ, ఆదివారాల్లో ఢిల్లీ, అటారీ , పాకిస్తాన్ లోని లాహోర్ స్టేషన్ల మధ్య నడుస్తుంది. -
మళ్లీ పట్టాలెక్కిన సంఝౌతా ఎక్స్‌ప్రెస్
-
మళ్లీ పట్టాలెక్కిన సంఝౌతా
లాహోర్: భారత్–పాక్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో రద్దయిన సంఝౌతా ఎక్స్‌ప్రెస్ లాహోర్–ఢిల్లీ మధ్య మళ్లీ పరుగులు పెడుతోంది. సంఝౌతా సర్వీసును పునరుద్ధరించినట్లు పాక్ సోమవారం ప్రకటించింది. ఇటీవల ఇరు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం నేపథ్యంలో సంఝౌతా రైలు సర్వీసును ఫిబ్రవరి 28న పాక్ రద్దు చేసిన విషయం తెలిసిందే. సోమవారం దాదాపు 150 మంది ప్రయాణికులతో సంఝౌతా ఎక్స్‌ప్రెస్ లాహోర్‌లో బయలుదేరినట్లు పాక్ రేడియో ప్రకటించింది. ఈ రైలు లాహోర్ నుంచి ప్రతి సోమ, గురువారాల్లోనూ, ఢిల్లీ నుంచి ఆది, బుధవారాల్లోనూ బయలుదేరుతుంది. ఈ రైలు మన దేశంలో ఢిల్లీ నుంచి అటారీ వరకు, ఆ తర్వాత పాకిస్తాన్లో వాఘా నుంచి లాహోర్ వరకు నడుస్తుంది. సాధారణంగా ఈ రైలులో ఆక్యుపెన్సీ 70 శాతం ఉంటుండగా.. పుల్వామాలో ఫిబ్రవరి 14న జైషే మహ్మద్ ఉగ్రదాడి అనంతరం ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. 1976లో భారత్–పాక్ మధ్య కుదిరిన సిమ్లా ఒప్పందంలో భాగంగా సంఝౌతా ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసు ప్రారంభమైంది. సంఝౌతా అనే పదానికి హిందీలో ‘ఒప్పందం’అనే అర్థం. 1976లో జూలై 22న రెండు దేశాల మధ్య తొలి సర్వీసు నడిపారు. సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌లో 6 స్లీపర్ కోచ్‌లు, ఒక ఏసీ త్రీటైర్ కోచ్ ఉన్నాయి. -
సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌కు బ్రేకు
లాహోర్/న్యూఢిల్లీ: భారత్–పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య నడిచే సంఝౌతా ఎక్స్‌ప్రెస్ రైలు సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. తొలుత ఈ రైల్వే సేవలను నిలిపేస్తూ పాకిస్తాన్ నిర్ణయం తీసుకోగా, ఆ తర్వాత భారత్ కూడా సంఝౌతాను నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాకిస్తాన్ వెల్లడించగా, రైలులో ప్రయాణించే వారి సంఖ్య చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలో రద్దు చేస్తున్నట్లు భారత్ తెలిపింది. ఢిల్లీ నుంచి పాక్‌కు వెళ్లేందుకు భారత్ నుంచి వెళ్లే రైలులో 27 మంది ప్రయాణికులు గురువారమే సరిహద్దు వద్ద ఉన్న భారత్‌లోని అట్టారీ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. కానీ పాకిస్తాన్ నుంచి రావాల్సిన రైలును ఆ దేశ అధికారులు నిలిపేశారు. దీంతో 27 మంది ప్రయాణికులు అక్కడే చిక్కుకున్నారు. రెండు రైళ్ల సేవలు నిలిచిపోవడంతో అట్టారీ స్టేషన్ వద్ద ఇరు దేశాలకు చెందిన దాదాపు 40 మంది చిక్కుకుపోయారని సమాచారం. సిమ్లా ఒప్పందంతో.. 1971లో భారత్–పాకిస్తాన్ల మధ్య జరిగిన యుద్ధం తర్వాత సిమ్లా ఒప్పందంలో భాగంగా సంఝౌతా ఎక్స్‌ప్రెస్ రైలు సేవలు 1976 జూలై 22న ప్రారంభమయ్యాయి. పాక్‌లోని లాహోర్ నుంచి ప్రతి సోమవారం, గురువారం బయల్దేరుతుంది. ఢిల్లీ నుంచి ప్రతి బుధవారం, ఆదివారం బయల్దేరుతుంది. ఈ రెండు రైళ్లు కూడా అట్టారీ స్టేషన్ వరకు వెళ్తాయి. లాహోర్ స్టేషన్లో రోదిస్తున్న భారత ప్రయాణికురాలు -
సంఝౌతా ఎక్స్‌ప్రెస్ రద్దు : ఇండియన్ రైల్వేస్
న్యూఢిల్లీ : భారత్, పాక్ మధ్య నడిచే సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేస్తున్నట్లు భారత రైల్వేశాఖ ప్రకటించింది. మార్చి 4 నుంచి ఈ రైలును రద్దు చేస్తున్నట్లు ప్రకటనలో పేర్కొంది. పుల్వామా ఉగ్ర దాడి - మెరుపు దాడుల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో కూడా ఢిల్లీ - అతారీల మధ్య నడిచే సంఝౌతా ఎక్స్‌ప్రెస్ రైలును షెడ్యూల్ ప్రకారమే నడుపుతామని రైల్వే అధికారి ఒకరు నిన్న ప్రకటించారు. ఇలా ప్రకటించి 24 గంటల కూడా గడవకముందే ఆ రైలును రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇదిలా ఉండగా పాక్ సంఝౌతా సేవలను ఇప్పటికే నిలిపివేసింది. ఫలితంగా పాక్ నుంచి అటారికి రావాల్సిన ప్రయాణికులు లాహోర్ రైల్వేస్టేషన్లోనే ఆగిపోయారు. వాళ్లని వేరే మార్గాల ద్వారా అటారి సరిహద్దుకు తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సంఝౌతా ఎక్స్‌ప్రెస్ వారంలో రెండు రోజులు(బుధ, ఆదివారాలు) నడుస్తుంది. ఢిల్లీ నుంచి బయలుదేరి అటారీలో ప్రయాణికులను దించుతుంది. ఆ తరువాత ప్రయాణికులు వాఘాలో ఇదే పేరుతో నడిపే మరో రైలులోకి మారాల్సి ఉంటుంది. అయితే సంఝౌతా పేరు వెనక చిన్న హిస్టరీ ఉంది. 1971లో ఇండో - పాక్ మధ్య ప్రారంభమైన యుద్ధం సిమ్లా ఒప్పందతో ముగిసింది. ఈ ఒప్పందానికి చిహ్నంగా ఇరు దేశాల మధ్య1976 జూలై 22 నుంచి సంఝౌతా రైలు సర్వీస్ ప్రారంభమయ్యింది. సంఝౌతా అంటే ‘ఒప్పందం’ అని అర్థం. -
సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ను నిలిపేసిన పాక్
-
సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేసిన పాక్
సాక్షి, న్యూఢిల్లీ : భారత పైలట్ ఇంకా పాకిస్తాన్ కస్టడీలో ఉన్నందున ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. మరోవైపు భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేసినట్టు పాకిస్తాన్ వెల్లడించింది. లాహోర్ నుంచి అతారి వరకూ నడిచే సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ను తదుపరి నోటీసులు ఇచ్చేవరకూ నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. భధ్రతా ఆందోళనల నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని పాకిస్తాన్ రైల్వేల అదనపు జనరల్ మేనేజర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇక సరిహద్దుల్లో యుద్ధ మేఘాలతో ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా రెండో రోజూ గురువారం ఉన్నతస్ధాయి సమావేశాలు నిర్వహించనున్నారు. రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు త్రివిధ దళాధిపతులతో బుధవారం సంప్రదింపులు జరిపిన ప్రధాని నరేంద్ర మోదీ గురువారం సైతం కీలక భేటీలు జరపనున్నారు. కాగా సరిహద్దు వెంబడి జమ్మూ కశ్మీర్లో పలుచోట్ల పాకిస్తాన్ దళాలు కాల్పుల విరమణ ఒప్పందాలను ఉల్లంఘిస్తూ భారత శిబిరాలే లక్ష్యంగా పాక్ ముందుకు కదులతోంది. మరోవైపు జైషే చీఫ్ మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న భారత్ డిమాండ్‌కు అమెరికా, బ్రిటన్,ఫ్రాన్స్‌లు బాసటగా నిలిచాయి. -
రాకపోకలు మళ్లీ షురూ...!
లాహోర్: కొన్నిరోజులుగా లాహోర్-ఢిల్లీ మధ్య ఆగిపోయిన రాకపోకలు మళ్లీ ప్రారంభమయ్యాయి. హర్యానాలో జాట్లు నిర్వహించిన రిజర్వేషన్ల ఉద్యమంతో ఈ మార్గంలో రాకపోకల్ని కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. శాంతిభద్రతల దృష్ట్యా ఈ మార్గం మీదుగా ప్రయాణించే సంఝౌత రైలును, లాహోర్-ఢిల్లీ దోస్తీ బస్సును నిలిపివేశారు. జాట్ల నిరసనలు చల్లబడి శాంతియుత వాతావరణం నెలకొంటుండటంతో ఇరు దేశాల ప్రభుత్వాలు రాకపోకలు పునరుద్ధరించాలని నిర్ణయించాయి. వారంలో రెండు రోజులు(సోమ, గురువారాలు) సంఝౌత రైలు ఇండియా నుంచి బయల్దేరుతుంది. వారం కింద ఇండియా నుంచి వెళ్లిన ప్రయాణికుల వీసాల గడువును పాకిస్థాన్ ప్రభుత్వం పొడగించింది. భారత్ నుంచి పాక్ వెళ్లిన ప్రయాణికులు తిరిగి స్వదేశానికి ఎప్పుడు చేరుతామోనని బిక్కుబిక్కుమంటూ ఎదురుచూశారు. రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వారు తిరిగి రానున్నారు.