పాక్‌ మరో దుందుడుకు నిర్ణయం | Pakistan stops Samjhauta Express service passengers stranded at Attari border | Sakshi
Sakshi News home page

సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేసిన పాక్‌

Published Thu, Aug 8 2019 3:06 PM | Last Updated on Thu, Aug 8 2019 4:04 PM

Pakistan stops Samjhauta Express service passengers stranded at Attari border - Sakshi

జమ్మూ కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించే 370 అధికరణ రద్దు అనంతరం పాకిస్తాన్‌ మరో సంచలన నిర్ణయం తీసుకుంది.  ఇప్పటికే భారత్‌తో వాణిజ్య సంబంధాలను రద్దు చేసుకున్న పాకిస్తాన్ తాజాగా  భారత్-పాకిస్తాన్ మధ్య రాకపోకలు సాగించే సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ను  శాశ్వతంగా నిలిపివేసింది.  దీంతో వాఘా సరిహద్దులోని  అంతర్జాతీయ రైల్వేస్టేషన్‌లో చాలా మంది ప్రయాణికులు చిక్కుకు పోయారు.

జమ్మూ కశ్మీర్ ప్రత్యేక హోదాను తొలగిస్తూ, ఆర్టికల్ 370ను రద్దుచేసిన భారత్ చర్యను నిరసిస్తూ పాకిస్తాన్ సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ను సస్పెండ్ చేసింది. సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ను శాశ్వతంగా నిలిపివేసినట్టు పాకిస్తాన్ రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్ వెల్లడించారు. ఇప్పటికే టిక్కెట్లు కొన్న వ్యక్తులు తమ డబ్బును లాహోర్ డిఎస్ కార్యాలయం నుంచి వాపస్‌ పొందవచ్చని పేర్కొన్నారు. భద్రతా కారణాల రీత్యా ఈ చర్య తీసుకున్నామని పాకిస్తాన్‌  చెబుతోంది. అలాగే పాకిస్తాన్ సినిమాహాళ్లలో భారతీయ చిత్రాల ప్రదర్శనను కూడా నిలిపివేస్తున్నట్టు పాకిస్తాన్ ప్రధాని స్పెషల్ అసిస్టెంట్ డాక్టర్ ఫిర్దౌస్ ఆశిక్ అవన్ ప్రకటించడం గమనార్హం. 

అయితే రైలును తిరిగి భారతకు పంపించాల్సిన బాధ్యత పొరుగు దేశం పాక్‌దేనని  రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ అరవింద్ కుమార్ తెలిపారు. వీసా ఉన్న డ్రైవర్‌, ఇతర సిబ్బందిని పంపి రైలును తిరిగి ఇండియాకు తీసుకెళ్లాల్సిందిగా పాక్‌ తెలిపినట్టు చెప్పారు. 

కాగా 1976వ సంవత్సరంలో జరిగిన సిమ్లా ఒప్పందం ప్రకారం సంఝౌతా ఎక్స్‌ప్రెస్ భారత, పాకిస్తాన్ మధ్య రాకపోకలు సాగిస్తోంది. ఫ్రెండ్‌షిప్ ఎక్స్‌ప్రెస్‌గా పిలిచే ఈ రైలు ప్రతి బుధ, ఆదివారాల్లో ఢిల్లీ, అటారీ , పాకిస్తాన్ లోని లాహోర్ స్టేషన్ల మధ్య నడుస్తుంది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement