‘సంఝౌతా’ నిలిపివేత | Pakistan stops Samjhauta Express at Wagah border | Sakshi
Sakshi News home page

‘సంఝౌతా’ నిలిపివేత

Published Fri, Aug 9 2019 3:23 AM | Last Updated on Fri, Aug 9 2019 4:54 AM

Pakistan stops Samjhauta Express at Wagah border - Sakshi

గురువారం భారత్‌లోని అట్టారీ వద్దకు చేరుకున్న సంఝౌతా రైలు

న్యూఢిల్లీ/వాషింగ్టన్‌/ఇస్లామాబాద్‌/దుబాయ్‌: పాక్‌లోని లాహోర్‌ నుంచి ఢిల్లీకి వస్తున్న సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ను పాక్‌ అధికారులు భద్రతను సాకుగా చూపుతూ వాఘా సరిహద్దు వద్దే నిలిపివేశారు. ఈ సమయంలో రైలులో 48 మంది పాకిస్తానీలు సహా 117 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న భారత బలగాలు, రైల్వే సిబ్బంది సాయంత్రం 5.15 గంటలకు అక్కడికి చేరుకున్నారు. రైలుకు భారత ఇంజిన్‌ను బిగించి భారత సరిహద్దు అట్టారి వద్దకు తీసుకొచ్చారు. పాక్‌ నిర్ణయంతో సరిహద్దుకు ఇరువైపులా ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. చివరికి సాయంత్రం 6.41 గంటల సమయంలో 10 మంది పాకిస్తానీలు సహా 103 మంది ప్రయాణికులతో రైలు అట్టారి నుంచి లాహోర్‌కు బయలుదేరింది. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత సంఝౌతా సర్వీసును నిలిపేస్తున్నట్లు పాక్‌ రైల్వే మంత్రి రషీద్‌ ప్రకటించారు. అయితే ఈ సర్వీసు కొనసాగుతుందని భారత అధికారులు స్పష్టత ఇచ్చారు.

ఇంకోసారి ఆలోచించుకోండి: భారత్‌
తమతో దౌత్య, వాణిజ్య సంబంధాలను తెగదెంపులు చేసుకోవడంపై పాకిస్తాన్‌ పునరాలోచించాలని భారత్‌ కోరింది. ఈ చర్యలతో ఇరుదేశాల మధ్య తీవ్రమైన ఉద్రిక్తత నెలకొన్నట్లు ప్రపంచదేశాలకు చూపించేందుకు పాక్‌ ప్రయత్నిస్తోందని ఆరోపించింది.

కాంగ్రెస్‌కు కరణ్‌సింగ్‌ షాక్‌..
ఆర్టికల్‌ 370 రద్దు విషయంలో కేంద్రం నిర్ణయాన్ని తాను గుడ్డిగా వ్యతిరేకించబోనని కాంగ్రెస్‌ నేత కరణ్‌ సింగ్‌ తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారశైలిని ఆయన తప్పుపట్టారు. ‘కేంద్రం తీసుకున్న నిర్ణయంలో పలు సానుకూల అంశాలున్నాయి. లదాఖ్‌ను కేంద్రపాలిత ప్రాంతం(యూటీ) చేయడాన్ని స్వాగతిస్తున్నాం’ అని తెలిపారు.

సంయమనం పాటించండి: అమెరికా
కశ్మీర్, ఇతర సమస్యలపై భారత్‌–పాకిస్తాన్‌ల మధ్య ప్రత్యక్ష చర్చలు ప్రారంభమవ్వాలని తాము కోరుకుంటున్నట్లు అమెరికా తెలిపింది. సమస్యను ఇరుదేశాల చర్చల ద్వారా పరిష్కరించుకుంటాయన్న నమ్మకం తమకుందని యూఏఈ విదేశాంగ మంత్రి అన్వర్‌ తెలిపారు.

ఎలాంటి సవాళ్లకైనా సిద్ధం: రాజ్‌నాథ్‌
ఆర్టికల్‌ 370 రద్దుకు సంబంధించి క్షేత్రస్థాయి పనులు గత ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమయ్యాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ తెలిపారు. ఎలాంటి భద్రతాపరమైన సవాళ్లు ఎదురైనా ఎదుర్కొనేందుకు సాయుధ బలగాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ‘భారత మిలటరీ బలంగా కశ్మీరీలను అణచివేయగలమని బీజేపీ భావిస్తోందా? కశ్మీర్‌లో ప్రజల పోరాటం త్వరలో ఊపందుకోనుంది. ఈ సందర్భంగా చెలరేగే హింసను ఆపే దమ్ము ప్రపంచదేశాలకు ఉందా?’ అని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ గురువారం ప్రశ్నించారు. భారతీయ సినిమాల ప్రదర్శనపై దేశవ్యాప్తంగా నిషేధం విధిస్తున్నట్లు పాకిస్తాన్‌ ప్రకటించింది. భారత విమానాలు తమ గగనతలం గుండా రాకపోకలు సాగించడంపై ఎలాంటి ఆంక్షలు విధించలేదని పాకిస్తాన్‌ పౌర విమానయాన శాఖ స్పష్టంచేసింది.

ఆజాద్‌ అడ్డగింత
కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కశ్మీర్‌ మాజీ సీఎం గులాం నబీ ఆజాద్‌ను అధికారులు శ్రీనగర్‌ విమానాశ్రయంలో గురువారం అడ్డుకున్నారు. స్థానిక కశ్మీర్‌ నేతలతో మాట్లాడేందుకు శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టులో దిగిన ఆయనను అధికారులు తిరిగి ఢిల్లీకి పంపారు. జాతీయ భద్రతా సలహాదారు దోవల్‌ కశ్మీర్‌లో పర్యటించడం, ఆ సందర్భంగా స్థానికులతో భోజనం చేయడంపై ఆజాద్‌ స్పందిస్తూ.. ‘డబ్బులిస్తే ఎవరైనా మనతోపాటు వస్తారు’ అని అన్నారు. అంతర్జాతీయ వేదికలపై పాక్‌ ఈ వ్యాఖ్యలను అనుకూలంగా చేసుకునే చాన్సుందని బీజేపీ మండిపడింది.

లాహోర్‌ నుంచి సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌లో భారత్‌కు రానున్న బంధువును పట్టుకుని రోదిస్తున్న ఓ మహిళ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement