WC 2023: వన్డే వరల్డ్‌కప్ జట్టులో సూర్యకు చోటు ఖాయం! ఒక్క సిరీస్‌లో విఫలమైతే..
Suryakumar Yadav- ICC ODI World Cup 2023: టీమిండియా టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్‌కు మాజీ సెలక్టర్ సరన్‌దీప్ సింగ్ అండగా నిలిచాడు. సూర్య అద్భుతమైన ఆటగాడని.. వన్డే వరల్డ్‌కప్-2023 జట్టులో అతడు తప్పకుండా చోటు దక్కించుకుంటాడని విశ్వాసం వ్యక్తం చేశాడు. ఒక సిరీస్‌లో విఫలమైనంత మాత్రాన నిందించాల్సిన అవసరం లేదని.. తానైతే సూర్యకు వరుస అవకాశాలు ఇస్తానని పేర్కొన్నాడు. కాగా స్వదేశంలో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో సూర్యకుమార్ యాదవ్ పూర్తిగా నిరాశపరిచిన విషయం తెలిసిందే.
ఆడిన మూడు వన్డేల్లోనూ డకౌట్‌గా వెనుదిరిగాడు. తొలి రెండు వన్డేల్లో ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ దెబ్బకు గోల్డెన్ డకౌట్ అయిన సూర్య.. ఆఖరి మ్యాచ్‌లో అష్టన్ అగర్ బౌలింగ్‌లో ఒక్క బంతి ఎదుర్కొని సున్నాకే పెవిలియన్ చేరాడు. దీంతో సూర్య వన్డేలకు పనికిరాడంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో మాజీ సెలక్టర్ సరన్‌దీప్ సింగ్ సూర్యకు మద్దతుగా నిలిచాడు. న్యూస్18తో మాట్లాడుతూ ‘‘సూర్యకుమార్ యాదవ్ అత్యద్భుతమైన బ్యాటర్. కానీ పాపం ఆస్ట్రేలియాతో వరుసగా మూడు వన్డేల్లో పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు.
అయితే, తను తిరిగి పుంజుకుని సత్తా చాటగలడు. ఆ శక్తిసామర్థ్యాలు, నైపుణ్యాలు సూర్యలో ఉన్నాయి. నా అభిప్రాయం ప్రకారం వరల్డ్‌కప్ జట్టులో అతడికి తప్పకుండా చోటు ఉంటుంది. ఒక సెలక్టర్‌గా ఈ మాట చెబుతున్నా. ఎవరైనా బ్యాటర్‌పై మనకి నమ్మకం ఉండి.. అతడు విఫలమైతే వెంటనే పక్కనపెట్టాల్సిన అవసరం లేదు.
అతడికి అండగా ఉంటూ మరిన్ని అవకాశాలు ఇస్తే దీర్ఘకాలంలో మంచి ఫలితాలు వస్తాయి. నిజానికి గతేడాది కాలంగా సూర్య అద్భుతంగా రాణిస్తున్నాడు. తన బ్యాటింగ్‌కు వంక పెట్టాల్సిన పనిలేదు. దేశవాళీ క్రికెట్లోనూ టన్నుల కొద్దీ పరుగులు సాధించాడు. జట్టులో చోటు కోసం ఎంతగానో ఎదురుచూశాడు. నాకే గనుక అవకాశం ఉంటే సూర్యకు మరిన్ని ఛాన్స్‌లు ఇస్తాను’’ అని సరన్‌దీప్ సింగ్ పేర్కొన్నాడు.
చదవండి: BAN Vs IRE: చరిత్ర సృష్టించిన లిటన్ దాస్.. ఫాస్టెస్ట్ ఫిఫ్టీ.. 16 ఏళ్ల రికార్డు బద్దలు
David Warner: సన్‌రైజర్స్‌ది తెలివి తక్కువతనం.. అందుకే వార్నర్‌ను వదులుకుని! ఈసారి..