బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పేలవ ప్రదర్శన అనంతరం టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ముప్పేట దాడిని ఎదుర్కొంటున్నాడు. కోహ్లి టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకోవాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. సొంత అభిమానులు సైతం కోహ్లిని ఎండగడుతున్నారు. తాజాగా ముగిసిన బీజీటీలో కోహ్లి దారుణంగా విఫలమయ్యాడు. తొమ్మిది ఇన్నింగ్స్‌ల్లో సెంచరీ సాయంతో 190 పరుగులు మాత్రమే చేశాడు.
బీజీటీ 2024-25 ద్వారా కోహ్లికి ఉన్న ఓ వీక్ పాయింట్ ప్రపంచం మొత్తానికి తెలిసింది. ఈ సిరీస్‌లో కోహ్లి ఆఫ్ స్టంప్ ఆవల పడ్డ బంతులను ఎదుర్కోలేక నానా అవస్థలు పడ్డాడు. తొమ్మిదింట ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో ఇలాంటి బంతులకే ఔటయ్యాడు. కోహ్లి ప్రస్తుత ఫామ్ నేపథ్యంలో రిటైర్మెంట్‌పై ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
కోహ్లి అతి త్వరలో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతాడని ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారాన్ని పీటీఐ నివేదిక కొట్టిపారేస్తుంది. కోహ్లికి ఇప్పట్లో రిటైర్ అయ్యే ఉద్దేశం లేదని సదరు నివేదిక పేర్కొంది. కోహ్లి తనకు తాను లాంగ్ టర్మ్ గోల్స్ సెట్ చేసుకున్నాడని తెలిపింది. కింగ్ 2027 వన్డే ప్రపంచకప్ వరకు ప్రణాళికలు సెట్ చేసుకున్నాడని పేర్కొంది.
ఇదిలా ఉంటే, కోహ్లి సహా రోహిత్ శర్మను త్వరలో ఇంగ్లండ్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌ల నుంచి తప్పిస్తారని తెలుస్తుంది. రో-కోను ఏ ప్రాతిపదికన ఇంగ్లండ్‌తో పరిమత సిరీస్‌లకు ఎంపిక చేయాలని సెలెక్టర్లు ప్రశిస్తున్నట్లు సమాచారం. రోహిత్, కోహ్లి దేశవాలీ క్రికెట్ ఆడి ఫామ్‌లోకి రావాలని బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఫామ్ నిరూపించుకున్నాకే వారు అంతర్జాతీయ క్రికెట్ ఆడాలని గవాస్కర్ పేర్కొన్నాడు.
విశ్లేషకుల అంచనా మేరకు, రోహిత్‌తో పోలిస్తే కోహ్లికి మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. రోహిత్‌కు అవకాశాలు రాకపోవడానికి అతని ఫామ్ లేమితో పాటు వయసు కూడా ప్రధాన అంశమే. వయసులో కోహ్లి రోహిత్ కంటే సంవత్సరం చిన్నవాడు. ఫామ్ ప్రకారం చూస్తే కోహ్లి రోహిత్ కంటే చాలా మెరుగ్గా ఉన్నాడు.
బీజీటీ.. అంతకుముందు జరిగిన మ్యాచ్‌ల్లో కోహ్లి సెంచరీలు చేశాడు. రోహిత్ పరిస్థితి అలా లేదు. అతను ఫార్మాట్లకతీతంగా దారుణంగా విఫలమయ్యాడు. ప్రస్తుత పరిస్థితులను సమీక్షిస్తే.. కోహ్లి కంటే ముందే రోహిత్ రిటైర్మెంట్ ప్రకటిస్తాడు. కోహ్లికి ఇప్పట్లో రిటైరయ్యే ఉద్దేశమే లేదన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది.
కాగా, బీజీటీలో భాగంగా సిడ్నీ వేదికగా జరిగిన చివరి టెస్ట్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. భారత్ నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ 4 వికెట్లు కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 185 పరుగులకు ఆలౌటైంది. రిషబ్ పంత్ (40) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆసీస్ బౌలర్లలో స్కాట్ బోలాండ్ అత్యధికంగా నాలుగు వికెట్లు తీశాడు.
అనంతరం ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 181 పరుగులకే చాపచుట్టేసింది. బ్యూ వెబ్‌స్టర్ (57) అర్ద సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లో సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలో మూడు వికెట్లు తీశారు. నాలుగు పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. 157 పరుగులకే ఆలౌటై దారుణంగా నిరాశపర్చింది.
రిషబ్ పంత్ (61) అర్ద సెంచరీ చేయకపోయుంటే భారత్ కనీసం మూడంకెల స్కోర్‌ను కూడా చేయలేకపోయేది. 162 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్ ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో ఉస్మాన్ ఖ్వాజా 41, ట్రవిస్ హెడ్ 34, బ్యూ వెబ్‌స్టర్ 39 పరుగులు చేశారు. ఈ గెలుపుతో ఆసీస్ ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 3-1 తేడాతో గెలుచుకుంది.
Comments
Please login to add a commentAdd a comment