
Photo Courtesy: BCCI
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 9) గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడుతున్నాయి. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. అయితే రాయల్స్ అంచనాలకు తగ్గట్టుగా గుజరాత్‌ను కంట్రోల్ చేయలేకపోయింది. సాయి సుదర్శన్ (53 బంతుల్లో 82; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 217 పరుగుల భారీ చేసింది.
ఆదిలోనే శుభ్‌మన్ గిల్ (2) వికెట్ కోల్పోయినప్పటికీ.. సాయి సుదర్శన్, జోస్ బట్లర్ (25 బంతుల్లో 36; 5 ఫోర్లు) గుజరాత్ ఇన్నింగ్స్‌ను నిర్మించారు. బట్లర్ ఔటైన అనంతరం సాయి సుదర్శన్‌తో షారుక్ ఖాన్ (20 బంతుల్లో 36; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) జత కట్టాడు. బట్లర్, షారుక్ ఖాన్‌లతో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పిన సాయి జట్టు భారీ స్కోర్ చేయడానికి దోహదపడ్డాడు.
షారుక్ ఖాన్ ఔటయ్యాక క్రీజ్‌లోకి వచ్చిన రూథర్‌ఫోర్డ్ (3 బంతుల్లో 7; సిక్స్) తొలి బంతికే సిక్సర్ బాది మంచి టచ్‌లో ఉన్నట్లు కనిపించాడు. అయితే సందీప్ శర్మ అద్భుతమైన బంతితో రూథర్‌ఫోర్డ్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఇన్నింగ్స్ చివరల్లో రాహుల్ తెవాతియా (12 బంతుల్లో 24 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), రషీద్ ఖాన్ (4 బంతుల్లో 12; ఫోర్, సిక్స్) తమ సహజ శైలిలో విరుచుకుపడటంతో గుజరాత్ 200 పరుగుల మార్కును దాటింది. రాయల్స్ బౌలర్లలో తుషార్ దేశ్‌పాండే, తీక్షణ తలో రెండు వికెట్లు తీయగా.. ఆర్చర్, సందీప్ శర్మ చెరో వికెట్ తీశారు.
అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన రాయల్స్ 11 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. జైస్వాల్‌ను (6) అర్షద్ ఖాన్, నితీశ్ రాణాను (1) సిరాజ్ ఔట్ చేశారు. 4.2 ఓవర్ల తర్వాత రాయల్స్ స్కోర్ 41/2గా ఉంది. సంజూ శాంసన్ (16), రియాన్ పరాగ్ (14) ధాటిగా ఆడుతూ క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో రాయల్స్ గెలవాలంటే మరో 94 బంతుల్లో 177 పరుగులు చేయాలి.
A NO LOOK SHOT FROM RASHID KHAN.
- Yashasvi Jaiswal takes a stunner of it. 😲pic.twitter.com/Jb9u6AtOPa— Mufaddal Vohra (@mufaddal_vohra) April 9, 2025
జైస్వాల్ స్టన్నింగ్ క్యాచ్
ఈ మ్యాచ్‌లో రాయల్స్ ఆటగాడు యశస్వి జైస్వాల్ కళ్లు చెదిరే క్యాచ్ పట్టాడు. ఇన్నింగ్స్ 19వ ఓవర్ ఆఖరి బంతికి రషీద్ ఖాన్ కొట్టిన నో లుక్ షాట్‌ను (తుషార్ దేశ్‌పాండే బౌలింగ్‌లో) జైస్వాల్ నమ్మశక్యం కాని రీతిలో క్యాచ్‌గా మలిచాడు. అప్పటికి రషీద్ ఖాన్ అదే ఓవర్‌లో వరుసగా సిక్సర్, బౌండరీ బాది మాంచి జోష్‌లో ఉన్నాడు. జైస్వాల్ ఈ క్యాచ్ పట్టకపోయుంటే రషీద్ మరింత చెలరేగిపోయేవాడు. జైస్వాల్ పట్టిన ఈ క్యాచ్ సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది.