ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(World Test Championship- డబ్ల్యూటీసీ)లో తొలిసారి ఫైనల్‌కు చేరింది సౌతాఫ్రికా. సొంతగడ్డపై పాకిస్తాన్‌తో తొలి టెస్టులో గెలుపొంది మెగా టైటిల్ పోరుకు అర్హత సాధించిన ప్రొటిస్ జట్టు.. రెండో టెస్టులోనూ విజయం సాధించి పర్యాటక జట్టును 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది. కాగా టెస్టుల్లో సౌతాఫ్రికాకు ఇది వరుసగా ఏడో గెలుపు కావడం విశేషం.
కెప్టెన్ తెంబా బవుమా(Temba Bavuma) బ్యాటర్‌గా, సారథిగా రాణిస్తూ ఇలా జట్టును విజయపథంలో నడిపించి.. తొలిసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేర్చాడు. ఈ నేపథ్యంలో అతడపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్(Graeme Smith ) బవుమా నాయకత్వ లక్షణాలను కొనియాడాడు.
బవుమా అలాంటి వాడు కాదు
‘‘సౌతాఫ్రికా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరడం మా అందరికీ గర్వకారణం. కెప్టెన్‌గా బవుమాకు కూడా ఇది ఉద్వేగ సమయం. గత రెండు, మూడేళ్లుగా అతడు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొన్నాడు. అయితే, గతేడాది అతడి బ్యాటింగ్ సగటు 50గా నమోదైంది.
నాయకుడిగా జట్టును ముందుండి నడిపిస్తూ ఈస్థాయికి చేర్చాడు. మైదానంలో ఆటగాళ్లపై అరుస్తూ.. పిచ్చిగా ప్రవర్తించే వ్యక్తిత్వం బవుమాకు లేదు. అతడు అసలు అలాంటి దుందుడుకు స్వభావం గల వ్యక్తి కానేకాదు. నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుపోతాడు. ఆటతోనే అందరికీ సమాధానం చెప్తాడు.
టెస్టుల్లో వరుసగా జట్టుకు ఏడు విజయాలు అందించిన కెప్టెన్. అంతకంటే అద్భుతమైన విషయం మరొకటి ఉండదు. ఇప్పుడు ఏకంగా డబ్ల్యూటీసీ ఫైనల్లో జట్టును నిలిపాడు. మేమంతా అతడికి అండగా ఉంటాం’’ అని గ్రేమ్ స్మిత్ పేర్కొన్నాడు.
గెలుపు మాదేనని భావిస్తున్నా
ఇక ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడే అంశంపై స్పందిస్తూ.. ‘‘ఇలాంటి ప్రతిష్టాత్మక టెస్టు మ్యాచ్‌లో విజేత ఎవరన్నది అంచనా వేయడం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. డబ్ల్యూటీసీ ఫైనల్ తటస్థ వేదికైన లార్డ్స్ మైదానంలో జరుగుతుంది. కాబట్టి ఏ జట్టుకూ హోం అడ్వాంటేజీ ఉండదు.
ఆస్ట్రేలియా మీడియాను చూస్తుంటే మాత్రం.. లార్డ్స్‌లో కంగారూలను ఓడించి మేము కచ్చితంగా ట్రోఫీ గెలవాలనే సంకల్పం మరింత బలపడింది. ఫైనల్లో ఆసీస్‌ను ఓడిస్తే ఆ మజానే వేరు’’ అని గ్రేమ్ స్మిత్ హిందుస్తాన్ టైమ్స్‌తో వ్యాఖ్యానించాడు. కాగా ఆస్ట్రేలియాపై చారిత్రాత్మక టెస్టు సిరీస్ విజయం సాధించిన ప్రొటిస్ కెప్టెన్‌గా గ్రేమ్ స్మిత్‌కు అరుదైన ఘనత ఉంది.
ఆసీస్‌పై స్మిత్‌కు ఘనమైన రికార్డు
స్మిత్ సారథ్యంలో 2006లో తొలుత ఆసీస్‌ను వన్డేలో ఓడించిన సౌతాఫ్రికా.. ఆ తర్వాత మూడేళ్ల అనంతరం అంటే 2009లో కంగారూ గడ్డపై పాంటింగ్ బృందాన్ని టెస్టుల్లో చిత్తు చేసింది. 2-1 తేడాతో ఆస్ట్రేలియాను ఓడించి మొట్టమొదటి సారి టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకుంది. నాడు తన మణికట్టుకు దెబ్బతాకినా.. గ్రేమ్ స్మిత్ బ్యాటింగ్ చేసిన తీరు.. సౌతాఫ్రికా ఆటగాళ్ల పట్టుదలకు అద్దంగా నిలిచింది.
ఇక ఇప్పుడు పదహారేళ్ల తర్వాత గ్రేమ్ స్మిత్‌లాగే ఆస్ట్రేలియాను ఓడించే సువర్ణావకాశం ముంగిట బవుమా నిలిచాడు. కాగా సారథిగా బవుమా గత 14 టెస్టుల్లో సౌతాఫ్రికాకు 10 విజయాలు అందించాడు. ఇక ఇప్పటి వరకు మొత్తంగా 63 టెస్టులు ఆడిన బవుమా నాలుగు శతకాల సాయంతో 3606 పరుగులు సాధించాడు.
ఇదిలా ఉంటే.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో టీమిండియాపై 3-1తో గెలిచిన ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు దూసుకువచ్చింది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో సౌతాఫ్రికాతో తలపడనుంది. ఇరుజట్ల మధ్య ఇంగ్లండ్ వేదికగా జూన్ 11-15 వరకు ఈ మెగా టెస్టు మ్యాచ్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.
చదవండి: BCCI: గంభీర్‌పై వేటు?.. రోహిత్, కోహ్లిలు మాత్రం అప్పటిదాకా..!
Comments
Please login to add a commentAdd a comment