
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్లో టీమిండియా విజయానంతరం దుబాయ్ క్రికెట్ స్టేడియంలో పలు ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. టీమిండియా ఆటగాళ్ల విజయోత్సవ సంబురాలతో పాటు పలు దృష్యాలు సోషల్‌మీడియాను విపరీతంగా ఆకర్శించాయి. ఇందులో ఒకటి విరాట్ కోహ్లి.. సహచరుడు మహ్మద్ షమీ తల్లికి పాదాభివందనం చేయడం. విజయోత్సవ సంబురాల్లో భాగంగా టీమిండియా ఆటగాళ్లంతా కుటుంబ సభ్యులతో కలిసి స్టేడియంలో కలియతిరుగుతుండగా.. కోహ్లికి షమీ తల్లి తారసపడింది.
Virat Kohli Touched Mohammad Shami’s Mother Feet And Clicked Pictures With Shami’s Family. pic.twitter.com/D08GRCfurN
— khalid Chougle (@ChougleKhalid) March 10, 2025
కోహ్లి వెంటనే షమీ తల్లి కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నాడు. అనంతరం షమీ కుటుంబ సభ్యులతో కలిసి ఫోటోలు దిగాడు. విరాట్ షమీ తల్లి పాదాలకు నమస్కరించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. ఇది చూసి జనాలు విరాట్‌ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. విరాట్‌కు పెద్దలంటే ఎంత గౌరవమోనని చర్చించుకుంటున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ విజయానంతరం దుబాయ్ స్టేడియంలో ఇలాంటి ఫ్యామిలీ మూమెంట్స్ చాలా కనిపించాయి. శుభ్‌మన్ గిల్ తండ్రితో రిషబ్ పంత్ చిందులేయడం.. శ్రేయస్ తల్లి అతన్ని ముద్దాడటం.. ఇలా చాలా ఆసక్తికర ఫ్యామిలీ మూమెంట్స్‌కు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ వేదికైంది.
Shubman Gill's father doing Bhangra with Rishabh Pant. 😂❤️pic.twitter.com/SdUu58044d
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 10, 2025
ఇదిలా ఉంటే, నిన్నటి ఫైనల్లో భారత్ న్యూజిలాండ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించి మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. భారత్ ఆటగాళ్లలో విరాట్, రోహిత్, జడేజా మినహా దాదాపుగా అందరికీ ఇదే తొలి ఐసీసీ టైటిల్ కావడం విశేషం. చాలాకాలంగా టీమిండియాలో కీలక సభ్యుడిగా ఉన్నా షమీకి సైతం ఐదే తొలి ఐసీసీ టైటిల్. 2013 జనవరిలో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన షమీ.. ఐసీసీ ఈవెంట్లలో టీమిండియా తరఫున ఎన్నో అత్యుత్తమ ప్రదర్శనలు చేసినా దీనికి ముందు ఒక్కసారి కూడా టైటిల్ విన్నింగ్ జట్టులో భాగం కాలేకపోయాడు.
గతేడాది భారత్ టీ20 వరల్డ్‌కప్ గెలిచినప్పటికీ.. ఆ ఐసీసీ టోర్నీకి షమీ దూరంగా ఉన్నాడు. వన్డే వరల్డ్‌కప్-2023 సందర్భంగా గాయపడిన షమీ.. తిరిగి ఛాంపియన్స్ ట్రోఫీ-2025తోనే (ఐసీసీ టోర్నీలు) రీఎంట్రీ ఇచ్చాడు. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో షమీ 5 మ్యాచ్‌ల్లో 25.88 సగటున, 5.68 ఎకానమీ రేటుతో 9 వికెట్లు తీసి భారత్ అజేయ యాత్రతో తనవంతు పాత్ర పోషించాడు. ఈ టోర్నీలో షమీ అత్యుత్తమ ప్రదర్శన బంగ్లాదేశ్‌పై వచ్చింది. ఆ మ్యాచ్‌లో షమీ ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. సెమీస్‌లో ఆస్ట్రేలియాపై కూడా షమీ సత్తా చాటాడు. ఆ మ్యాచ్‌లో షమీ మూడు వికెట్లు పడగొట్టాడు.
ఫైనల్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేయగా.. భారత్ 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్‌లో భారత స్పిన్నర్లు చెలరేగడంతో న్యూజిలాండ్ ఓ మోస్తరు స్కోర్‌కే పరిమితమైంది. న్యూజిలాండ్ తరఫున డారిల్ మిచెల్ (63), మైఖేల్ బ్రేస్‌వెల్ (53 నాటౌట్) రాణించారు. రచిన్ రవీంద్ర (37), ఆఖర్లో గ్లెన్ ఫిలిప్స్ (34) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. విల్ యంగ్ (15), కేన్ విలియమ్సన్ (11), టామ్ లాథమ్ (14),మిచెల్ సాంట్నర్ (8) తక్కువ స్కోర్లకు ఔటయ్యారు. భారత్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తలో 2.. షమీ, జడేజా చెరో వికెట్ పడగొట్టారు.
ఛేదనలో రోహిత్ (76) భారత్‌కు శుభారంభాన్ని అందించారు. శుభ్‌మన్ గిల్‌తో (31) కలిసి తొలి వికెట్‌కు 105 పరుగులు జోడించాడు. అయితే భారత్ 17 పరుగుల వ్యవధిలో గిల్, కోహ్లి (1), రోహిత్ వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో శ్రేయస్ అయ్యర్ (48), అక్షర్ పటేల్ (29) మంచి భాగస్వామ్యం నెలకొల్పి భారత్‌ను తిరిగి గేమ్‌లోకి తెచ్చారు. అయితే శ్రేయస్, అక్షర్ కూడా స్వల్ప వ్యవధిలో ఔట్ కావడంతో టీమిండియా మరోసారి కష్టాల్లో పడింది. అయితే కేఎల్ రాహుల్ (34 నాటౌట్).. హార్దిక్ పాండ్యా (18), రవీంద్ర జడేజాతో (18 నాటౌట్) కలిసి మ్యాచ్ విన్నింగ్ భాగస్వామ్యాలు నెలకొల్పి భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. న్యూజిలాండ్ బౌలర్లలో సాంట్నర్, బ్రేస్‌వెల్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. జేమీసన్, రచిన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment