LSG VS GT: రికార్డులు సృష్టించిన గిల్‌-సాయి సుదర్శన్‌ జోడీ | Shubman Gill And Sai Sudharsan Became The First To Score A Hundred Opening Partnership In IPL 2025, Check Out Story Inside | Sakshi
Sakshi News home page

LSG VS GT: రికార్డులు సృష్టించిన గిల్‌-సాయి సుదర్శన్‌ జోడీ

Published Sat, Apr 12 2025 5:22 PM | Last Updated on Sat, Apr 12 2025 5:34 PM

Shubman Gill And Sai Sudharsan Became The First To Score A Hundred Opening Partnership In IPL 2025

Photo Courtesy: BCCI

ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ వరుస విజయాలతో దూసుకుపోతూ పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో ఉంది. ఆ జట్టు విజయాల్లో ఓపెనర్లు సాయి సుదర్శన్‌, శుభ్‌మన్‌ గిల్‌ పాత్ర చాలా కీలకం​. ఈ ఇద్దరు దాదాపుగా ప్రతి మ్యాచ్‌లో నిలకడైన ఆటతీరు ప్రదర్శిస్తూ జట్టు విజయానికి పటిష్టమైన పునాది వేస్తున్నారు.

ఈ సీజన్‌లో సాయి ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో నాలుగు హాఫ్‌ సెంచరీలు చేసి లీడింగ్‌ రన్‌ స్కోరర్‌గా కొనసాగుతుండగా.. గిల్‌ చివరి మూడు మ్యాచ్‌ల్లో రెండు హాఫ్‌ సెంచరీలు చేసి లీడింగ్‌ రన్‌ స్కోరర్ల జాబితాలో ఆరో స్థానంలో నిలిచాడు.

ఈ సీజన్‌లో అత్యుత్తమ ఓపెనింగ్‌ జోడీగా పేరు తెచ్చుకున్న సాయి-గిల్‌ ద్వయం.. ఇవాళ (ఏప్రిల్‌ 12) లక్నోతో జరుగుతున్న మ్యాచ్‌లో రెండు రికార్డులు నెలకొల్పింది. ఈ మ్యాచ్‌లో 120 పరుగులు జోడించిన సాయి-గిల్‌ జోడీ.. ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో తొలి వికెట్‌కు 100కు పైగా పరుగులు జోడించిన తొలి జోడీగా రికార్డు నెలకొల్పింది. అలాగే ఈ సీజన్‌లో ఏ వికెట్‌కైనా అత్యధిక పరుగులు జోడించిన జోడీగానూ రికార్డుల్లోకెక్కింది.

ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో అత్యధిక భాగస్వామ్యాలు
గిల్‌-సాయి సుదర్శన్‌- 120 (తొలి వికెట్‌కు)
పూరన్‌-మార్ష్‌- 116 (రెండో వికెట్‌కు)
స్టబ్స్‌-కేఎల్‌ రాహుల్‌- 111* (ఐదో వికెట్‌కు)
శాంసన్‌-జురెల్‌- 111 (నాలుగో వికెట్‌కు)
రహానే-నరైన్‌- 103 (రెండో వికెట్‌కు)

ఈ మ్యాచ్‌లో గిల్‌ 60, సాయి సుదర్శన్‌ 56 పరుగులు చేసి ఔటయ్యారు. వీరిద్దరు క్రీజ్‌లో ఉన్నంతవరకు గుజరాత్‌ జట్టు భారీ స్కోర్‌ దిశగా సాగింది. అయితే 2 పరుగుల వ్యవధిలో ఈ ఇద్దరు ఔట్‌ కావడంతో గుజరాత్‌ స్కోర్‌ ఒక్కసారిగా నెమ్మదించింది.

13వ ఓవర్‌ తొలి బంతికి సాయి ఔటయ్యే సమయానికి గుజరాత్‌ స్కోర్‌ 120 పరుగులుగా ఉండగా.. 17వ ఓవర్‌ ముగిసే సమయానికి ఆ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి కేవలం 147 పరుగులు మాత్రమే చేయగలిగింది. రూథర్‌ఫోర్డ్‌ (6), షారుక్‌ ఖాన్‌ (1) గుజరాత్‌కు గౌరవప్రదమైన స్కోర్‌ అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. 

గుజరాత్‌ ఇన్నింగ్స్‌లో బట్లర్‌ 16, సుందర్‌ 2 పరుగులకు ఔటయ్యారు. లక్నో బౌలర్లలో బిష్ణోయ్‌ 2, దిగ్వేశ్‌ రాఠీ, ఆవేశ్‌ ఖాన్‌ తలో వికెట్‌ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ టాస్‌ ఓడి లక్నో ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌ చేస్తుంది.

తుది జట్లు..
లక్నో: ఎయిడెన్ మార్క్రమ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(కెప్టెన్‌/వికెట్‌కీపర్‌), హిమ్మత్ సింగ్, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, శార్దూల్ ఠాకూర్, ఆకాష్ దీప్, దిగ్వేష్ సింగ్ రాఠీ, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్

గుజరాత్‌ టైటాన్స్‌: సాయి సుదర్శన్, శుభమన్ గిల్(కెప్టెన్‌), జోస్ బట్లర్(వికెట్‌కీపర్‌), వాషింగ్టన్ సుందర్, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, మహ్మద్ సిరాజ్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement