
Photo Courtesy: BCCI
ఐపీఎల్-2025లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 9) గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో రాయల్స్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ నిప్పులు చెరిగే వేగంతో బౌలింగ్ చేస్తున్నాడు. మూడో ఓవర్‌లో గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను (2) క్లీన్ బౌల్డ్ చేసిన ఆర్చర్.. ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లో ఓ బంతిని బుల్లెట్ వేగంతో సంధించాడు.
ఈ బంతి స్పీడ్ గన్‌పై గంటకు 152.3 కిమీ వేగంగా రికార్డైంది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో ఇది రెండో వేగవంతమైన బంతి. ఈ సీజన్ ఫాస్టెస్ట్ డెలివరీని పంజాబ్ పేసర్ లోకీ ఫెర్గూసన్ వేశాడు. ఫెర్గూసన్ నిన్న లక్నోతో జరిగిన మ్యాచ్‌లో గంటకు 153.2 కిమీ వేగంతో ఓ బంతిని సంధించాడు.
ఈ సీజన్ ప్రారంభం నుంచి ఆర్చర్ బుల్లెట్ వేగంతో బంతులు వేస్తున్నాడు. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ 150 కిమీకుపైగా స్పీడ్‌తో బంతులు వేశాడు. పంజాబ్ మ్యాచ్‌లో ఆర్చర్ ఓ బంతిని 151.3 కిమీ వేగంతో వేశాడు. ఇది ప్రస్తుత సీజన్‌లో నాలుగో ఫాస్టెస్ట్ బంతిగా రికార్డైంది. గుజరాత్‌తో మ్యాచ్‌లో ఆర్చర్ శుభ్‌మన్ గిల్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన బంతికి కూడా దాదాపుగా 150 కిమీ వేగంతో (147.7) వచ్చింది.
ఈ సీజన్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమైనా ఆర్చర్ సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్ నుంచి గాడిలో పడ్డాడు. ఆ మ్యాచ్‌లో ఆర్చర్ 3 ఓవర్లలో ఓ మెయిడిన్ సహా 13 పరుగులు మాత్రమే ఇచ్చి ఓ వికెట్ పడగొట్టాడు. ఆ మ్యాచ్‌లో రాయల్స్ గెలుపులో ఆర్చర్ కీలకపాత్ర పోషించాడు.
పంజాబ్‌తో జరిగిన గత మ్యాచ్‌లో ఆర్చర్ శివాలెత్తిపోయాడు. ఆ మ్యాచ్‌లో అతను 4 ఓవర్లలో 25 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు తీశాడు. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా పొందాడు. ప్రస్తుతం గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లోనూ ఆర్చర్ చెలరేగిపోతున్నాడు. ఈ మ్యాచ్‌లో ఇప్పటివరకు 3 ఓవర్లు వేసిన అతను కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చి గిల్ వికెట్ తీశాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ ఆదిలోనే శుభ్‌మన్ గిల్ (2) వికెట్ కోల్పోయినప్పటికీ.. ఆతర్వాత కుదురుకుంది. సాయి సుదర్శన్, బట్లర్ ఇన్నింగ్స్‌ను నిర్మించారు. అయితే 10 ఓవర్ చివరి బంతికి తీక్షణ అద్బుతమైన బంతితో బట్లర్‌ను (36) ఎల్బీడబ్ల్యూ చేశాడు. సాయి సుదర్శన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని (59) ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. అతనికి జతగా షారుక్ ఖాన్ (18) క్రీజ్‌లో ఉన్నాడు. 13 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 124/2గా ఉంది.