
Photo Courtesy: BCCI
ఐపీఎల్ 2025లో మ్యాచ్ ఫిక్సింగ్ అంశం కలకలం రేపుతుంది. ఏప్రిల్ 19న రాజస్తాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఫిక్స్ అయ్యిందని ఆరోపణలు వస్తున్నాయి. ఆ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఫిక్సింగ్‌కు పాల్పడిందని రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ (RCA) తాత్కాలిక కమిటీ కన్వీనర్ జైదీప్ బిహానీ ఆరోపించాడు. సులువుగా గెలవాల్సిన మ్యాచ్‌లో రాయల్స్ అనూహ్యంగా ఓటమిపాలైందని ఆయన అన్నాడు.
ఈ మ్యాచ్‌పై విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశాడు. ఈ సీజన్ ప్రారంభానికి ముందు నుంచి రాయల్స్ కదలికలపై అనుమానాలు ఉన్నాయని తెలిపాడు. అంతకుముందు రాజస్థాన్-ఢిల్లీ మ్యాచ్‌పై కూడా అనుమానాలు వ్యక్తం చేశాడు. ఆ మ్యాచ్‌లో కూడా రాయల్స్ గెలిచి ఉండాల్సిందని అన్నాడు. రాయల్స్ యాజమాన్యం రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్‌ను పూర్తి పక్కకు పెట్టడం మరిన్ని అనుమానాలకు తావిస్తుందని తెలిపాడు.
2013 సీజన్‌లో రాయల్స్ ఆటగాళ్లు స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడిన విషయాన్ని ప్రస్తావించారు. సహ యజమాని రాజ్ కుంద్రా బెట్టింగ్‌కు పాల్పడటంతో 2016, 2017 సీజన్లలో రాయల్స్‌పై నిషేధం విధించారన్న విషయాన్ని గుర్తు చేశాడు. అప్పట్లో రాయల్స్‌తో పాటు చెన్నై సూపర్ కింగ్స్‌పై రెండు సీజన్ల నిషేధం విధించారు.
జైదీప్ ఆరోపణలు ఎలా ఉన్నా, ఏప్రిల్ 19న జరిగిన రాజస్తాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్‌పై సగటు క్రికెట్ అభిమానికి కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. సులువగా గెలవాల్సిన ఆ మ్యాచ్‌లో రాయల్స్ ఓడిపోవడాన్ని చాలా మంది ఫ్యాన్స్ నమ్మలేకపోతున్నారు. ఆ మ్యాచ్‌లో రాయల్స్ గెలుపుకు చివరి ఓవర్‌లో కేవలం 9 పరుగులే అవసరమయ్యాయి. చేతిలో వికెట్లు కూడా ఉన్నాయి.
క్రీజ్‌లో విధ్వంసకర ఆటగాళ్లు ధృవ్ జురెల్, హెట్‌మైర్ ఉన్నారు. అయినా రాయల్స్ చివరి ఓవర్‌లో 6 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. తీవ్ర ఉత్కంఠ నడుమ చివరి ఓవర్‌ను ఆవేశ్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మూడో బంతికి డేంజరెస్ హెట్‌మైర్‌ను ఔట్ చేసి లక్నోకు గెలుపుపై ఆశలు రేకెత్తించాడు.
ఇక్కడ ఆవేశ్ ప్రతిభను ముమ్మాటికి ప్రశంసించాల్సిందే. 18వ ఓవర్‌లోనూ అతడు అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అప్పటికే క్రీజ్‌లో పాతుకుపోయిన యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్‌ను ఔట్ చేశాడు. జనాలు ఆవేశ్ టాలెంట్‌ను ప్రశంశిస్తూనే, ఎక్కడో ఏదో తేడా కొడుతుందని అనుకుంటున్నారు.