RR vs LSG
-
ఐపీఎల్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం.. రాజస్థాన్ రాయల్స్‌పై ఆరోపణలు
ఐపీఎల్ 2025లో మ్యాచ్ ఫిక్సింగ్ అంశం కలకలం రేపుతుంది. ఏప్రిల్ 19న రాజస్తాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఫిక్స్ అయ్యిందని ఆరోపణలు వస్తున్నాయి. ఆ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఫిక్సింగ్‌కు పాల్పడిందని రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ (RCA) తాత్కాలిక కమిటీ కన్వీనర్ జైదీప్ బిహానీ ఆరోపించాడు. సులువుగా గెలవాల్సిన మ్యాచ్‌లో రాయల్స్ అనూహ్యంగా ఓటమిపాలైందని ఆయన అన్నాడు.ఈ మ్యాచ్‌పై విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశాడు. ఈ సీజన్ ప్రారంభానికి ముందు నుంచి రాయల్స్ కదలికలపై అనుమానాలు ఉన్నాయని తెలిపాడు. అంతకుముందు రాజస్థాన్-ఢిల్లీ మ్యాచ్‌పై కూడా అనుమానాలు వ్యక్తం చేశాడు. ఆ మ్యాచ్‌లో కూడా రాయల్స్ గెలిచి ఉండాల్సిందని అన్నాడు. రాయల్స్ యాజమాన్యం రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్‌ను పూర్తి పక్కకు పెట్టడం మరిన్ని అనుమానాలకు తావిస్తుందని తెలిపాడు.2013 సీజన్లో రాయల్స్ ఆటగాళ్లు స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడిన విషయాన్ని ప్రస్తావించారు. సహ యజమాని రాజ్ కుంద్రా బెట్టింగ్‌కు పాల్పడటంతో 2016, 2017 సీజన్లలో రాయల్స్‌పై నిషేధం విధించారన్న విషయాన్ని గుర్తు చేశాడు. అప్పట్లో రాయల్స్‌తో పాటు చెన్నై సూపర్ కింగ్స్‌పై రెండు సీజన్ల నిషేధం విధించారు.జైదీప్ ఆరోపణలు ఎలా ఉన్నా, ఏప్రిల్ 19న జరిగిన రాజస్తాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్‌పై సగటు క్రికెట్ అభిమానికి కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. సులువగా గెలవాల్సిన ఆ మ్యాచ్‌లో రాయల్స్ ఓడిపోవడాన్ని చాలా మంది ఫ్యాన్స్ నమ్మలేకపోతున్నారు. ఆ మ్యాచ్‌లో రాయల్స్ గెలుపుకు చివరి ఓవర్లో కేవలం 9 పరుగులే అవసరమయ్యాయి. చేతిలో వికెట్లు కూడా ఉన్నాయి. క్రీజ్‌లో విధ్వంసకర ఆటగాళ్లు ధృవ్ జురెల్, హెట్‌మైర్ ఉన్నారు. అయినా రాయల్స్ చివరి ఓవర్లో 6 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. తీవ్ర ఉత్కంఠ నడుమ చివరి ఓవర్‌ను ఆవేశ్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మూడో బంతికి డేంజరెస్ హెట్మైర్ను ఔట్ చేసి లక్నోకు గెలుపుపై ఆశలు రేకెత్తించాడు. ఇక్కడ ఆవేశ్ ప్రతిభను ముమ్మాటికి ప్రశంసించాల్సిందే. 18వ ఓవర్లోనూ అతడు అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అప్పటికే క్రీజ్‌లో పాతుకుపోయిన యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్‌ను ఔట్ చేశాడు. జనాలు ఆవేశ్ టాలెంట్‌ను ప్రశంశిస్తూనే, ఎక్కడో ఏదో తేడా కొడుతుందని అనుకుంటున్నారు. -
మటన్, పిజ్జా అంటే ఇష్టం.. చిన్న పిల్లాడు.. కానీ పాపం..
క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం ఎక్కడ చూసినా వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) గురించే చర్చ. దేశవాళీ క్రికెట్లో అద్భుతాలు చేసిన ఈ పద్నాలుగేళ్ల కుర్రాడు.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)నూ తాజాగా అడుగుపెట్టాడు. ఐపీఎల్-2025లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ (RR vs LSG)తో శనివారం (ఏప్రిల్ 19) నాటి మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగాడు.తొలి బంతినే సిక్సర్‌గా మలిచాడుతద్వారా అత్యంత పిన్న వయసులో క్యాష్ రిచ్ లీగ్‌లో ఎంట్రీ ఇచ్చిన క్రికెటర్‌గా వైభవ్ సూర్యవంశీ చరిత్రకెక్కాడు. అంతేకాదు.. రాయల్స్ ఓపెనర్‌గా తాను ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్‌గా మలిచాడు ఈ చిచ్చరపిడుగు. లక్నో పేసర్ శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో బంతిని బలంగా బాది తన ఆగమనాన్ని ఘనంగా చాటిచెప్పాడు.ఈ మ్యాచ్‌లో మొత్తంగా 20 బంతులు ఎదుర్కొన్న వైభవ్.. మూడు సిక్సర్లు, రెండు ఫోర్ల సాయంతో 34 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఏమాత్రం భయం లేకుండా ప్రత్యర్థి జట్టు బౌలర్లను ఎదుర్కొన్న తీరు అమోఘమంటూ మాజీ క్రికెటర్లు వైభవ్ నైపుణ్యాలను కొనియాడుతున్నారు.మటన్, పిజ్జా అంటే ఇష్టం.. చిన్న పిల్లాడు.. కానీ పాపం.. ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ వ్యక్తిగత కోచ్ మనీశ్ ఓజా ఈ టీనేజర్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ‘‘తనకి చికెన్, మటన్ అంటే చాలా ఇష్టం. చిన్న పిల్లాడు కదా.. సహజంగానే పిజ్జా అంటే కూడా మక్కువ ఎక్కువే. కానీ ఇకపై అతడు వాటిని తినబోడు.ఇక్కడికి రాగానే మటన్‌తో పాటు పిజ్జా అతడి డైట్ చార్ట్ నుంచి ఎగిరిపోయింది. మేమైతే అతడికి తరచుగా మటన్ పెట్టేవాళ్లం. ఎంత పెట్టినా సరే అంతా తినేసేవాడు. అందుకే తను కాస్త బొద్దుగా కనిపిస్తాడు. అయితే, ఇప్పుడు తనకు ఇష్టమైన ఆహారాన్ని అతడు సంతోషంగానే వదులుకున్నాడు.యువీ- యువీ కలిస్తే అతడువైభవ్కు సుదీర్ఘమైన కెరీర్ ఉంది. అతడు ఈరోజు ఇన్నింగ్స్ ఆరంభించిన తీరు చూశారు కదా!.. భవిష్యత్ కాలంలో అతడు ఉన్నత శిఖరాలకు ఎదుగుతాడు. తను ఫియర్లెస్ బ్యాటర్.అతడికి బ్రియన్ లారా ఆరాధ్య క్రికెటర్. అయితే, లారా- యువరాజ్ సింగ్ కలిస్తే ఎలా ఉంటుందో.. వైభవ్ అలాంటి ఆటగాడు. యువీలా దూకుడుగా ఆడటం తన శైలి.‘బంతి సిక్సర్ కొట్టేందుకు ఆస్కారం ఇస్తే నేనెందుకు సింగిల్ తీయాలి?.. సిక్సే కొడతా’ అని వైభవ్ చెబుతూ ఉంటాడు. ప్రాక్టీస్ సెషన్లో మేము 4 ఓవర్లలో 40 పరుగులు.. ఆరు ఓవర్లలో 60 పరుగులు చేయాలని ఆటగాళ్ల మధ్య పోటీలు పెట్టేవాళ్లం.వైభవ్ అయితే.. ఇంకొన్ని బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ పూర్తి చేసేవాడు’’ అని టైమ్స్ ఆఫ్ ఇండియాతో మనీశ్ ఓజా చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే.. లక్నోతో ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో రాజస్తాన్ రెండు పరుగుల స్వల్ప తేడాతో ఓడిపోయింది. కాగా మెగా వేలం-2025లో రాజస్తాన్ 1.1 కోట్లకు బిహార్ కుర్రాడు వైభవ్‌ను కొనుగోలు చేసింది.చదవండి: ద్రవిడ్ హృదయం ముక్కలు.. గోయెంకా రియాక్షన్ వైరల్ 𝐌𝐀𝐊𝐈𝐍𝐆. 𝐀. 𝐒𝐓𝐀𝐓𝐄𝐌𝐄𝐍𝐓 🫡Welcome to #TATAIPL, Vaibhav Suryavanshi 🤝Updates ▶️ https://t.co/02MS6ICvQl#RRvLSG | @rajasthanroyals pic.twitter.com/MizhfSax4q— IndianPremierLeague (@IPL) April 19, 2025 -
నరాలు తెగే ఉత్కంఠ: ద్రవిడ్ హృదయం ముక్కలు.. గోయెంకా రియాక్షన్ వైరల్
ఐపీఎల్-2025 (IPL 2025)లో రాజస్తాన్ రాయల్స్ మరోసారి దురదృష్టకర రీతిలో ఓటమి పాలైంది. గత మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో సరిసమానంగా స్కోరు చేసినా సంజూ సేన సూపర్ ఓవర్లో బోల్తా పడిన విషయం తెలిసిందే. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లోనూ రెండు పరుగుల స్వల్ప తేడాతో ఓడిపోయింది.ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో ఆవేశ్ ఖాన్ (Avesh Khan) తన అద్భుత బౌలింగ్ నైపుణ్యాలతో లక్నోకు విజయం అందించాడు. ఫలితంగా రాజస్తాన్ మరోసారి ఓటమి భారంతో తలదించుకోవాల్సి వచ్చింది. జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో రాజస్తాన్- లక్నో (RR vs LSG) జట్ల మధ్య శనివారం రాత్రి మ్యాచ్ జరిగింది.180 పరుగులుసొంత మైదానంలో టాస్ ఓడిన రాజస్తాన్ తొలుత బౌలింగ్‌కు దిగింది. ఈ క్రమంలో బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 180 పరుగులు చేసింది. ఓపెనర్ ఐడెన్ మార్క్రమ్ (45 బంతుల్లో 66)తో పాటు ఆయుశ్ బదోని (34 బంతుల్లో 50), అబ్దుల్ సమద్ (10 బంతుల్లో 30 నాటౌట్) రాణించారు.రాజస్తాన్ బౌలర్లలో వనిందు హసరంగ రెండు, జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ, తుషార్ దేశ్‌పాండే ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఇక లక్నో విధించిన నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాజస్తాన్ తమ ఇన్నింగ్స్‌ను ఘనంగా ఆరంభించింది.దంచికొట్టిన ఓపెనర్లుఓపెనర్ యశస్వి జైస్వాల్ (52 బంతుల్లో 74) బ్యాట్ ఝులిపించగా.. అతడికి జోడీగా వచ్చిన అరంగేట్ర ఆటగాడు, 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కూడా దుమ్ములేపాడు. ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్‌గా మలిచి ఐపీఎల్లో తన ఆగమనాన్ని ఘనంగా చాటాడు. మొత్తంగా 20 బంతులు ఎదుర్కొని 34 పరుగులు చేసి నిష్క్రమించాడు.అయితే, ఓపెనర్లు శుభారంభం అందించినా రాజస్తాన్ అదే జోరునుకొనసాగించలేకపోయింది. నితీశ్ రాణా (8) విఫలం కాగా.. కెప్టెన్ రియాన్ పరాగ్ (26 బంతుల్లో 39) ఫర్వాలేదనిపించాడు. ఆఖరి ఓవర్లో రాజస్తాన్ విజయానికి కేవలం తొమ్మిది పరుగులే అవసరమయ్యాయి.ఆఖరి ఓవర్లో హైడ్రామాఈ క్రమంలో బంతితో రంగంలోకి దిగిన లక్నో పేసర్ ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో తొలి బంతికి ధ్రువ్ జురెల్ సింగిల్ తీశాడు. అనంతరం షిమ్రన్ హెట్మెయిర్ జురెల్‌తో కలిసి రెండు పరుగులు పూర్తి చేశాడు. ఫలితంగా రాజస్తాన్ విజయ సమీకరణం నాలుగు బంతుల్లో 6 గా మారింది.సరిగ్గా అప్పుడే ఆవేశ్ ఖాన్ తన నైపుణ్యాలకు మెరుగుపెట్టి మూడో బంతికి హెట్మెయిర్ (12)ను పెవిలియన్‌కు పంపాడు. ఆ మరుసటి బంతికి పరుగులేమీ ఇవ్వకుండా డాట్ చేశాడు. అనంతరం శుభమ్ దూబే రెండు పరుగులు తీయగా.. ఆఖరి బంతికి నాలుగు పరుగులు చేయాల్సిన పరిస్థితి. కానీ దూబే ఒక్క పరుగు మాత్రమే తీయగలిగాడు.ద్రవిడ్ హృదయం ముక్కలు.. గోయెంకా సంబరాలుఫలితంగా రాజస్తాన్ విజయానికి రెండు పరుగుల దూరంలో నిలిచిపోయింది. దీంతో లక్నో యజమాని సంజీవ్ గోయెంకా సంబరాలు అంబరాన్నంటాయి. చిన్నపిల్లాడిలా గంతులేస్తూ ఆయన స్టేడియంలో సందడి చేశారు. మరోవైపు.. రాజస్తాన్ రాయల్స్ శిబిరంలో ప్రతి ఒక్కరి ముఖాలు నిరాశతో వెలవెలబోయాయి.రాజస్తాన్ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అయితే ఎలాంటి స్పందనా లేకుండా.. అలాగే చూస్తూ ఉండిపోయాడు. బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ మాత్రం నెత్తికి చేతులు పెట్టుకుని నిరాశను వ్యక్తం చేశాడు. యశస్వి జైస్వాల్ కూడా బేలగా చూస్తూ అలా ఉండిపోయాడు.Heart-racing, nerve-wracking, and simply unforgettable! 🤯#LSG defy the odds and seal a 2-run victory over #RR after the most dramatic final moments 💪Scorecard ▶️ https://t.co/02MS6ICvQl#TATAIPL | #RRvLSG | @LucknowIPL pic.twitter.com/l0XsCGGuPg— IndianPremierLeague (@IPL) April 19, 2025ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో.. ‘‘ద్రవిడ్ హృదయాన్ని ఆవేశ్ ముక్కలు చేశాడు.. గోయెంకానేమో తొలిసారి చిన్నపిల్లాడిలా గంతులేస్తున్నారు.. ఇలాంటి దృశ్యాలు అరుదు’’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నాయి.చదవండి: IPL 2025: శుబ్‌మన్ గిల్‌కు భారీ షాక్!