
గుజరాత్ జట్టుకు వరుసగా నాలుగో విజయం
58 పరుగులతో రాజస్తాన్ రాయల్స్ చిత్తు
సుదర్శన్ అర్ధసెంచరీ, రాణించిన బౌలర్లు
ఐపీఎల్‌లో మాజీ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ జోరు కొనసాగుతోంది. సీజన్ తొలి మ్యాచ్‌లో ఓటమి తర్వాతి నుంచి చెలరేగుతున్న జట్టు వరుసగా నాలుగో విజయంతో అగ్ర స్థానానికి దూసుకెళ్లింది. రాజస్తాన్ రాయల్స్‌తో పోరులో సాయి సుదర్శన్ అండ్ టీమ్ మెరుపు బ్యాటింగ్‌తో ముందుగా భారీ స్కోరు నమోదు చేసి... ఆ తర్వాత సొంత మైదానంలో దానిని విజయవంతంగా నిలబెట్టుకోగలిగింది. పేలవ బౌలింగ్ తర్వాత బ్యాటింగ్‌లోనూ బలహీనంగా కనిపించిన రాయల్స్ ఓటముల ‘హ్యాట్రిక్’ నమోదు చేసింది. ఛేదనలో హెట్‌మైర్, సామ్సన్ పోరాటం సరిపోక జట్టు చేతులెత్తేసింది.
అహ్మదాబాద్: శుబ్‌మన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ మరోసారి సమష్టి ప్రదర్శనతో ప్రత్యర్థిపై పైచేయి సాధించింది. బుధవారం జరిగిన ఐపీఎల్ 18వ సీజన్ మ్యాచ్‌లో అన్ని రంగాల్లో ఆధిక్యం కనబర్చిన టైటాన్స్ 58 పరుగుల తేడాతో రాజస్తాన్ రాయల్స్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది.
‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సాయి సుదర్శన్ (53 బంతుల్లో 82; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు బ్యాటింగ్‌తో చెలరేగగా... జోస్ బట్లర్ (25 బంతుల్లో 36; 5 ఫోర్లు), షారుఖ్ ఖాన్ (20 బంతుల్లో 36; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అండగా నిలిచారు. అనంతరం రాజస్తాన్ 19.2 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌటైంది. హెట్‌మైర్ (32 బంతుల్లో 52; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), సంజూ సామ్సన్ (28 బంతుల్లో 41; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించగా, ప్రసిధ్ కృష్ణకు 3 వికెట్లు దక్కాయి.
కీలక భాగస్వామ్యాలు...
ఆర్చర్ బౌలింగ్‌లో శుబ్‌మన్ గిల్ (2) ఆరంభంలోనే వెనుదిరిగినా... సుదర్శన్, బట్లర్ భాగస్వామ్యంలో జట్టు కోలుకుంది. వీరిద్దరు చక్కటి షాట్లతో స్కోరుబోర్డును నడిపించారు. తుషార్ దేశ్‌పాండే ఓవర్లో సుదర్శన్ 2 ఫోర్లు, సిక్స్ కొట్టడంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 56 పరుగులకు చేరింది. రెండో వికెట్‌కు 47 బంతుల్లో 80 పరుగులు జోడించిన తర్వాత బట్లర్ వెనుదిరిగాడు.
మరోవైపు సుదర్శన్ 32 బంతుల్లో హాఫ్ సెంచరీని అందుకున్నాడు.తీక్షణ ఓవర్లో వరుసగా 6, 4, 4 కొట్టి షారుఖ్ కూడా జోరు ప్రదర్శించాడు. అయితే తీక్షణ తర్వాతి ఓవర్లో అతను అవుట్ కావడంతో 62 పరుగుల (34 బంతుల్లో) మూడో వికెట్ భాగస్వామ్యం ముగిసింది. రూథర్‌ఫర్డ్ (7) విఫలం కాగా, దూకుడుగా ఆడే ప్రయత్నంలో సుదర్శన్ సెంచరీ అవకాశం చేజార్చుకున్నాడు.
చివర్లో తెవాటియా (12 బంతుల్లో 24 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), రషీద్ ఖాన్ (4 బంతుల్లో 12; 1 ఫోర్, 1 సిక్స్) ధాటిగా ఆడటంతో టైటాన్స్ భారీ స్కోరు నమోదు చేసింది. హైదరా బాద్‌తో జరిగిన గత మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో రాణించిన సుందర్‌ను గుజరాత్ ఈసారి ఆడించకపోగా... వ్యక్తిగత కారణాలతో హసరంగ మ్యాచ్‌కు దూరం కావడం రాజస్తాన్ బౌలింగ్‌ను బలహీనపర్చింది.
టపటపా...
ఛేదనలో ఏ దశలోనూ రాజస్తాన్ ఇన్నింగ్స్ గొప్పగా సాగలేదు. ఆరంభం నుంచి చివరి వరకు బ్యాటర్లలో తడబాటు కనిపించింది. గుజరాత్ బౌలర్లంతా సమష్టి ప్రదర్శనతో రాయల్స్‌ను కట్టడి చేశారు. రెండు పరుగుల వ్యవధిలో జైస్వాల్ (6), నితీశ్ రాణా (1) వెనుదిరగ్గా... సామ్సన్, రియాన్ పరాగ్ (14 బంతుల్లో 26; 1 ఫోర్, 3 సిక్స్‌లు) ఆదుకునే ప్రయత్నం చేశారు.
తాను ఆడిన తొలి 8 బంతుల్లోనే 3 సిక్స్‌లు కొట్టిన పరాగ్ ఎక్కువసేపు నిలవలేకపోగా, ధ్రువ్ జురేల్ (5) విఫలమయ్యాడు. 47 బంతుల్లో 102 పరుగులు చేయాల్సిన స్థితిలో సామ్సన్‌ను ప్రసిధ్ అవుట్ చేయడంతో రాయల్స్ ఆశలు గల్లంతయ్యాయి. చివర్లో హెట్‌మైర్ చేసిన ప్రయత్నం ఏమాత్రం సరిపోలేదు.

స్కోరు వివరాలు
గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాయి సుదర్శన్ (సి) సామ్సన్ (బి) దేశ్‌పాండే 82; గిల్ (బి) ఆర్చర్ 2; బట్లర్ (ఎల్బీ) (బి) తీక్షణ 36; షారుఖ్ (స్టంప్డ్) సామ్సన్ (బి) తీక్షణ 36; రూథర్‌ఫర్డ్ (సి) సామ్సన్ (బి) సందీప్ 7; తెవాటియా (నాటౌట్) 24; రషీద్ (సి) జైస్వాల్ (బి) దేశ్‌పాండే 12; అర్షద్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 217. వికెట్ల పతనం: 1–14, 2–94, 3–156, 4–163, 5–187, 6–201. బౌలింగ్: ఆర్చర్ 4–0–30–1, ఫారుఖీ 4–0–38–0, దేశ్‌పాండే 4–0–53–2, సందీప్ 4–0–41–1, తీక్షణ 4–0–54–2.
రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: యశస్వి జైస్వాల్ (సి) రషీద్ (బి) అర్షద్ 6; సామ్సన్ (సి) సాయికిషోర్ (బి) ప్రసిధ్ 41; నితీశ్ రాణా (సి) ఖెజ్రోలియా (బి) సిరాజ్ 1; పరాగ్ (సి) బట్లర్ (బి) ఖెజ్రోలియా 26; జురేల్ (సి) సుదర్శన్ (బి) రషీద్ 5; హెట్‌మైర్ (సి) సాయికిషోర్ (బి) ప్రసిధ్ 52; శుభమ్ దూబే (ఎల్బీ) (బి) రషీద్ 1; ఆర్చర్ (సి) గిల్ (బి) ప్రసిధ్ 4; తీక్షణ (సి) సుదర్శన్ (బి) సాయికిషోర్ 5; దేశ్‌పాండే (సి) రషీద్ (బి) సాయికిషోర్ 3; సందీప్ (నాటౌట్) 6; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (19.2 ఓవర్లలో ఆలౌట్) 159. వికెట్ల పతనం: 1–10, 2–12, 3–60, 4–68, 5–116, 6–119, 7–144, 8–145, 9–150, 10–159. బౌలింగ్: సిరాజ్ 4–0–30–1, అర్షద్ 2–0–19–1, ప్రసిధ్ కృష్ణ 4–0–24–3, ఖెజ్రోలియా 3–0–29–1, రషీద్ 4–0–37–2, సాయికిషోర్ 2.2–0–20–2.
ఐపీఎల్‌లో నేడు
బెంగళూరు X ఢిల్లీ
వేదిక: బెంగళూరు
రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం