IPL 2025: విధ్వంసంలో వైభవం | IPL 2025: Rajasthan Royals beat Gujarat Titans | Sakshi
Sakshi News home page

IPL 2025: విధ్వంసంలో వైభవం

Published Tue, Apr 29 2025 4:49 AM | Last Updated on Tue, Apr 29 2025 1:01 PM

IPL 2025: Rajasthan Royals beat Gujarat Titans

కళ్లు చెదిరే ఆటతో చరిత్రకెక్కిన వైభవ్‌ సూర్యవంశీ

ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ (17 బంతుల్లో), సెంచరీ  (35 బంతుల్లో) చేసిన భారత ప్లేయర్‌గా రికార్డు

210 పరుగుల లక్ష్యం 15.5 ఓవర్లలోనే ఉఫ్‌

8 వికెట్ల తేడాతో రాజస్తాన్‌ జయభేరి

సచిన్‌ వేగాన్ని ఆరాధించాం. సెహ్వాగ్‌ దూకుడును చూశాం. రో‘హిట్స్‌’ను ఆస్వాదించాం. కోహ్లి ‘షో’కు ముచ్చటపడ్డాం. వీళ్లందరూ ప్రొఫెషనల్‌ క్రికెటర్లు. కానీ వైభవ్‌ సూర్యవంశీ మాత్రం కాదు. 14 ఏళ్ల ఈ కుర్రాడు ఓ అనామకుడు. ఇంకా చెప్పాలంటే ఈ మ్యాచ్‌కు ముందు బహుశా చాలా మందికి అతనెవరో తెలియదు.  కానీ తెలుసుకుంటారు. నెట్టింట  గూగుల్‌లో సెర్చ్‌ చేస్తారు. ‘లైక్‌’లు కొట్టే షాట్లను ఫోన్‌ కెమెరాల్లో  బంధించారు. ‘షేర్‌’ చేసే సమయం ఇవ్వనంతగా సిక్స్‌ల ‘షో’ చూశారు. 35 బంతుల  సెంచరీకి ‘సబ్‌ స్క్రైబ్‌’  అయిపోయారు. ఐపీఎల్‌ కొత్త వైభవానికి పండగ  చేసుకున్నారు.  

జైపూర్‌:  ఐపీఎల్‌ 2008లో పుట్టింది. లీగ్‌ పుట్టిన మూడేళ్ల (2011లో) తర్వాత లోకం చూసిన బుడ్డొడిని పురుడు పోసిన కొద్దిమందే చూశారు! 14 ఏళ్లు తిరిగేసరికి ఇప్పుడా కుర్రాడిని మొత్తం క్రికెట్‌ ప్రపంచమే చూసి మురిసింది. అ బుడ్డొడు... ఇప్పటి కుర్రాడు... వైభవ్‌ సూర్యవంశీ. ఐపీఎల్‌లో అతనొక సంచలనం. బ్యాటింగ్‌ మెరుపులకే వైభోగం. క్రికెట్‌ ప్రేక్షకులకి కనుల పండగ అతని శతకం. బంతి సిక్స్‌లకే ఫిక్స్‌ అయినట్లు... అతని బ్యాట్‌ షాట్‌లకే అలవాటైనట్లు... అతని ‘షో’కు బంతులన్నీ దాసోహమైనట్లు అలవోకగా ఆడేశాడు.

వైభవ్‌ (38 బంతుల్లో 101; 7 ఫోర్లు, 11 సిక్స్‌లు) శతకానికి జైపూర్‌లో నిశిరాతిరి కూడా వెలుగులు విరజిమ్మింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీస్కోరు చేసింది. శుబ్‌మన్‌ గిల్‌ (50 బంతుల్లో 84; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు), జోస్‌ బట్లర్‌ (26 బంతుల్లో 50 నాటౌట్‌; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధసెంచరీలతో కదంతొక్కారు. అనంతరం రాజస్తాన్‌ రాయల్స్‌ 15.5 ఓవర్లలోనే కేవలం రెండే వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసి గెలిచింది. యశస్వీ జైస్వాల్‌ (40 బంతుల్లో 70 నాటౌట్‌; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) చెలరేగాడు. 

ఫిఫ్టీలో 48 పరుగులు... సిక్స్‌లు, ఫోర్లతోనే... 
పెద్ద లక్ష్యం... ఛేదించడం కష్టం... ఇలాంటి పరిస్థితుల మధ్య పరుగుల వేట మొదలుపెట్టిన యశస్వి జైస్వాల్, వైభవ్‌ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) పరుగుల ఉప్పెన చూపెట్టారు. ముఖ్యంగా 14 ఏళ్ల వైభవ్‌ ఆట అసాంతం హైలైట్స్‌నే తలపించింది. సూర్యవంశీ షాట్ల ఎంపిక, సిక్స్‌ల తుఫాన్‌ ఒక్క మైదానాన్నే కాదు... క్రికెట్‌ ప్రపంచాన్నే తనవైపు తిప్పుకుంది. జైస్వాల్‌ పరుగుతో మొదలైన తొలిఓవర్‌ వైభవ్‌ సిక్సర్‌తో ఊపందుకుంది. రెండో ఓవర్లో యశస్వి సిక్స్‌ బాదడంతో రెండు ఓవర్లలో 19 పరుగులు వచ్చాయి. కానీ ఆ తర్వాతే విధ్వంసరచన మొదలైంది. సిరాజ్‌ మూడో ఓవర్లో జైస్వాల్‌ 3 ఫోర్లు కొట్టాడు. 

3 ఓవర్లలో జట్టు స్కోరు 32. అప్పటికింకా వైభవ్‌ (9) పది పరుగులైనా చేయలేదు. ఇషాంత్‌ నాలుగో ఓవర్‌తో అతని షో మ్యాచ్‌ రూపాన్ని మార్చింది. 6, 6, 4, 0, 6, వైడ్, వైడ్, 4లతో ఏకంగా 28 పరుగులు పిండుకున్నాడు. తర్వాత ఐదో ఓవర్లో జైస్వాల్‌ బౌండరీ, సింగిల్‌ తీసివ్వగా, వైభవ్‌ 6, 0, 6, 4... ఈ బౌండరీతోనే 17 బంతుల్లోనే అతని ఫాస్టెస్ట్‌ అర్ధసెంచరీ అది కూడా ఐదో ఓవర్లోనే పూర్తయ్యింది. ఇందులో 3 బౌండరీలు, 6 సిక్స్‌లు అంటే 48 పరుగులు మెరుపులే! ఇలా ‘పవర్‌ ప్లే’నే పరుగెత్తుకున్న చందంగా, బౌండరీ లైన్‌–బంతి ముద్దు ముచ్చటలాడిన విధంగా అతని విధ్వంసం సాగింది.  

35 బంతుల్లో భారతీయ శతకం 
రాయల్స్‌ జట్టు 6 ఓవర్లలో 87/0 స్కోరు చేసింది. జైస్వాల్‌ కొట్టిన వరుస బౌండరీలతో ప్రసిధ్‌ కృష్ణ 8వ ఓవర్లో జట్టు స్కోరు వందను దాటింది. ఇంకా డజను ఓవర్లు మిగిలివుంటే చేయాల్సిన లక్ష్యం (102) సగం కంటే తక్కువగా కరిగింది. ఐపీఎల్‌ అరంగేట్రం చేసిన కరీమ్‌ జనత్‌ వేసిన పదో ఓవర్లో  అయితే వైభవ్‌ వీరబాదుడికి సిక్స్, ఫోర్‌ పోటీపడినట్లుగా అనిపించింది. 6, 4, 6, 4, 4, 6లతో 30 పరుగుల్ని రాబట్టాడు. 10 ఓవర్లలో 144/0 స్కోరు చేసింది. 

రషీద్‌ఖాన్‌ వేసిన మరుసటి ఓవర్లోనే మిడ్‌వికెట్‌ మీదుగా బాదిన సిక్స్‌తో వైభవ్‌ సెంచరీ 35 బంతుల్లోనే పూర్తయ్యింది. గేల్‌ (30 బంతుల్లో) తర్వాత ఐపీఎల్‌ చరిత్రలో రెండో వేగవంతమైన శతకం కాగా... భారత ఆటగాడు కొట్టిన తొలి ఫాస్టెస్ట్‌ సెంచరీగా పుటలకెక్కింది. 12వ ఓవర్లో వైభవ్‌ను బౌల్డ్‌ చేయడం ద్వారా ప్రసిధ్‌ కృష్ణ తొలివికెట్‌ను తీశాడు. 166 పరుగుల ఓపెనింగ్‌ వికెట్‌కు తెరపడింది. నితీశ్‌ (4) విఫలమైనా... మిగతా లాంఛనాన్ని జైస్వాల్, కెప్టెన్‌ రియాన్‌ పరాగ్‌ (15 బంతుల్లో 32 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా అంతే వేగంగా ముగించారు. 

స్కోరు వివరాలు 
గుజరాత్‌ టైటాన్స్‌ ఇన్నింగ్స్‌: సాయి సుదర్శన్‌ (సి) పరాగ్‌ (బి) తీక్షణ 39; గిల్‌ (సి) పరాగ్‌ (బి) తీక్షణ 84; బట్లర్‌ (నాటౌట్‌) 50; వాషింగ్టన్‌ సుందర్‌ (సి) హెట్‌మైర్‌ (బి) సందీప్‌ 13; తెవాటియా (ఎల్బీడబ్ల్యూ) (బి) ఆర్చర్‌ 9; షారుఖ్‌ ఖాన్‌ (నాటౌట్‌) 5; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 209. 
వికెట్ల పతనం: 1–93, 2–167, 3–193, 4–202. 
బౌలింగ్‌: ఆర్చర్‌ 4–0–49–1, తీక్షణ 4–0–35–2, యు«ద్‌వీర్‌ 3–0–38–0, సందీప్‌ శర్మ 4–0–33–1, పరాగ్‌ 1–0–14–0, హసరంగ 4–0–39–0.  

రాజస్తాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (నాటౌట్‌) 70; వైభవ్‌ (బి) ప్రసిధ్‌ కృష్ణ 101; నితీశ్‌ రాణా (ఎల్బీడబ్ల్యూ) (బి) రషీద్‌ ఖాన్‌ 4; పరాగ్‌ (నాటౌట్‌) 32; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (15.5 ఓవర్లలో 2 వికెట్లకు) 212. 
వికెట్ల పతనం: 1–166, 2–171. 
బౌలింగ్‌: సిరాజ్‌ 2–0–24–0, ఇషాంత్‌ 2–0–36–0, సుందర్‌ 1.5–0–34–0, ప్రసిధ్‌ కృష్ణ 4–0–47–1, రషీద్‌ 4–0–24–1, కరీమ్‌ 1–0–30–0, సాయి కిషోర్‌ 1–0–16–0.  

వైభవ్‌ సూర్యవంశీ రికార్డులు 
→ టి20 క్రికెట్‌ చరిత్రలో సెంచరీ చేసిన పిన్న వయసు్కడిగా వైభవ్‌ (14 ఏళ్ల 32 రోజులు) ప్రపంచ రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు భారత్‌కే చెందిన మహారాష్ట్ర ప్లేయర్‌ విజయ్‌ జోల్‌ (18 ఏళ్ల 118 రోజులు; ముంబైపై 2013లో) పేరిట ఉంది.  

→ ఐపీఎల్‌లో అర్ధ సెంచరీ, సెంచరీ చేసిన పిన్న వయస్కుడిగా వైభవ్‌ ఘనత వహించాడు. గతంలో అర్ధ సెంచరీ రికార్డు రియాన్‌ పరాగ్‌  (17 ఏళ్ల 175 రోజులు; 2019లో) పేరిట, సెంచరీ రికార్డు మనీశ్‌ పాండే (19 ఏళ్ల 253 రోజులు; 2009లో) పేరిట నమోదయ్యాయి. 

→ ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్‌ సెంచరీ చేసిన భారతీయ ప్లేయర్‌గానూ వైభవ్‌ గుర్తింపు పొందాడు. యూసుఫ్‌ పఠాన్‌ (37 బంతుల్లో ముంబై ఇండియన్స్‌పై 2010లో) పేరిట ఉన్న రికార్డును వైభవ్‌ బద్దలు కొట్టాడు. క్రిస్‌ గేల్‌ (30 బంతుల్లో 2013లో పుణే వారియర్స్‌పై) తర్వాత ఐపీఎల్‌లో రెండో ఫాస్టెస్ట్‌ సెంచరీ చేసిన ప్లేయర్‌ వైభవే కావడం విశేషం.

చాలా ఆనందంగా ఉంది. ఐపీఎల్‌లో ఆడిన మూడో ఇన్నింగ్స్‌లోనే సెంచరీ చేయడం సంతోషం. మూడు, నాలుగు నెలల నుంచి పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కింది. నేను బౌలర్లు ఎవరనే విషయాన్ని పెద్దగా పట్టించుకోను. కేవలం బంతి మీదే దృష్టి పెడతా. యశస్వి జైస్వాల్‌తో కలిసి బ్యాటింగ్‌ చేయడం సౌకర్యవంతంగా ఉంటుంది. అవసరమైనప్పుడు సలహాలు ఇవ్వడంతో పాటు ఆత్మవిశ్వాసం నింపుతాడు. దీంతో బ్యాటింగ్‌ చేయడం సులువవుతుంది. ఐపీఎల్‌లో సెంచరీ చేయాలన్నది నా కల. క్రీజులో అడుగు పెట్టాక భయపడను. అసలు వేరే ఏ అంశాలను పట్టించుకోను. కేవలం నా ఆటపైనే దృష్టి పెడతా.   
– వైభవ్‌ సూర్యవంశీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement