
Photo Courtesy: BCCI
ఐపీఎల్‌లో తన మూడో ఇన్నింగ్స్‌లోనే విధ్వంసకర శతకం (35 బంతుల్లో) బాది బేబీ బాస్‌గా గుర్తింపు తెచ్చుకున్న 14 ఏళ్ల రాజస్థాన్ రాయల్స్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీపై చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఓపెనర్ అభినవ్ ముకుంద్ సంచలన కామెంట్స్ చేశాడు.
రాయల్స్ సూర్యవంశీని వేలంలో కొనుగోలు చేయాల్సింది కాదని అభినవ్ అభిప్రాయపడ్డాడు. రాయల్స్ యాజమాన్యం సూర్యవంశీతో పాటు నితీశ్ రాణాపై అనవసర పెట్టుబడి పెట్టిందని అన్నాడు. తానైతే సూర్యవంశీని రూ. 1.1 కోట్లకు, నితీశ్ రాణాను రూ. 4.2 కోట్లకు కొనుగోలు చేసేవాడిని కాదని తెలిపాడు.
వైభవ్, నితీశ్‌పై పెట్టిన పెట్టుబడిని మంచి బౌలర్ల కోసం వినియోగించుకుని ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు. రాయల్స్ మేనేజ్‌మెంట్ బ్యాటర్ల మోజులో పడి బౌలింగ్ విభాగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని అన్నాడు. ఈ సీజన్‌లో ఆర్చర్ ఒక్కడే తీసుకున్న డబ్బుకు న్యాయం చేశాడని పేర్కొన్నాడు.
రాయల్స్ యాజమాన్యం ఎంపిక చేసుకున్న భారత్ బౌలర్లలో (తుషార్ దేశ్‌పాండే, యుద్ద్‌వీర్ సింగ్, ఆకాశ్ మధ్వాల్, కుమార్ కార్తికేయ) ఒక్కరు కూడా సత్తా చాటలేకపోయారని అన్నాడు. తుషార్ దేశ్‌పాండేపై రూ. 6.75 కోట్ల పెట్టుబడి పెట్టి అనవసరంగా డబ్బును వృధా చేసుకున్నారని అన్నాడు.
గత సీజన్‌లో తమ పంచన ఉన్న బౌల్ట్, చహల్, ఆవేశ్ ఖాన్, అశ్విన్‌ను వదిలేసి రాయల్స్ యాజమాన్యం మూల్యం చెల్లించుకుందని అభిప్రాయపడ్డాడు. మొత్తంగా మెగా వేలంలో రాయల్స్ ఎంపికలను తప్పుబట్టాడు.
కాగా, ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం ఇదివరకే సత్తా చాటిన ఆటగాళ్లను వేలానికి వదిలేసి పెద్ద తప్పిదం చేసింది. బ్యాటింగ్‌లో బట్లర్, బౌలింగ్‌లో చహల్, బౌల్ట్ ఆ జట్టుకు ఎన్నో అపురూప విజయాలు అందించారు. వీరిని కాదని రాయల్స్ యాజమాన్యం యువ ఆటగాళ్లపై పెట్టుబడి పెట్టి చేతులు కాల్చుకుంది.
ఎన్నో అంచనాలు పెట్టి కొనుగోలు చేసిన లంక స్పిన్ ద్వయం హసరంగ, తీక్షణ ఆశించిన ప్రభావం చూపలేకపోయారు. రిటైన్ చేసుకున్న వారిలో కెప్టెన్ శాంసన్ గాయంతో సైడ్ అయిపోగా.. జురెల్, హెట్‌మైర్ దారుణంగా విఫలమయ్యారు. నితీశ్ రాణా ఒక్క మంచి ఇన్నింగ్స్‌కే పరిమితమయ్యాడు. పరాగ్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పి అతడి కాస్తో కూస్తో ఫామ్‌ను చెడగొట్టుకున్నారు. సూర్యవంశీ ఫేట్‌ను నాలుగు మ్యాచ్‌లకే డిసైడ్ చేయలేని పరిస్థితి.
ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ కథ ముగిసింది. నిన్న (మే 1) ముంబై ఇండియన్స్ చేతిలో ఓటమితో ఆ జట్లు ప్లే ఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన రాయల్స్ ఏకంగా 8 పరాజయాలు మూటగట్టుకుంది. కేవలం మూడే విజయాలు సాధించింది. కొన్ని గెలవాల్సిన మ్యాచ్‌ల్లో అనూహ్యంగా ఓటమిపాలైంది. ఈ సీజన్‌లో రాయల్స్ మరో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. తమ తదుపరి మ్యాచ్‌ల్లో కేకేఆర్ (మే 4), సీఎస్‌కే (మే 12), పంజాబ్ (మే 16) జట్లను ఢీకొట్టనుంది.