
ప్రతిపైసాకు లెక్క తేలుస్తాం
అశ్వారావుపేట/దమ్మపేట/ములకలపల్లి: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో అక్రమాలకు పాల్పడిన అధికారులు, అవినీతికి ప్రోత్సహించిన ప్రజాప్రతినిధులు ఎంతటి వారైనా విడిచిపెట్టేది లేదని, ఖర్చయిన ప్రతి పైసాకు లెక్క తేలుస్తామని సిట్ అధికారులు చెప్పారు. సీబీసీఐడీ డీఎస్పీ బాలుజాదవ్, సీఐ సదానిరంజన్, ఎస్సై మొగిలిల బృందం అశ్వారావుపేట నియోజకవర్గంలో ఇందిరమ్మ పథకంలో చోటుచేసుకున్న అక్రమాలపై శనివారం ప్రారంభించింది.
అశ్వారావుపేట హౌసింగ్ డీఈఈ కార్యాలయం లో రికార్డులను పరిశీలించారు. గ్రామాల సామర్థ్యం, ఆవాసాల జనాభా, నివాస గృ హాలు, మంజూరయిన ఇళ్లు, బిల్లుల వివరాలను ప్రాథమికంగా పరిశీలించారు. దమ్మపేట మండలం పట్వారీగూడెంలో అత్యధికంగా గృహాలు నిర్మితమైనట్లు రికార్డుల్లో ఉండటం పట్ల విస్మయాన్ని వ్యక్తం చేశారు. అప్పట్లో ఉపాధి హామీ పథకం ద్వారా పునా ది బిల్లులు చెల్లించడంతో ఆ శాఖ వివరాల తో పాటు హౌసింగ్ రికార్డులను సరిపోల్చే కార్యక్రమం రెండో దశలో చేపడతామన్నారు. తహశీల్దార్ మురళీకృష్ణ, ఎంపీడీవో ఎన్ రవి నుంచి వివరాలు సేకరించారు.
పట్వారీగూడెంలో..
దమ్మపేట మండలంలోని పట్వారీగూడెం పంచాయతీ సధాపల్లి ఎస్టీ కాలనీలో శనివారం హౌసింగ్ అక్రమాలపై విచారణ చేపట్టారు. గ్రామంలో ఇళ్లను అదే గ్రామానికి చెందిన ఒకరు కాంట్రాక్ట్ పద్ధతిలో నిర్మించాడని, అందుకు లబ్ధిదారుల నుంచి అదనంగా వసూళ్లకు పాల్పడ్డాడని, గ్రామం లో రేషన్‌కార్డులు లేనివారికి, అక్కడ నివాసంలేని వారికి ఇళ్లు మంజూరు చేసినట్లు వి చారణలో తేలింది. రెండు ఇళ్లు కలిపి ఒకే గృ హాంగా నిర్మించిన సంఘనలతో అధికారుల దృష్టికి వచ్చాయి. ఈ సందర్భంగా సీబీసీఐడీ డీఎస్పీ బాలుజాదవ్ గృహనిర్మాణ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పూసుగూడెంలో..
ములకలపల్లి మండలంలోని పూసుగూడెం, ఆ పంచాయతీ పరిధిలోని కొమ్ముగూడెంలో సీబీసీఐడీ అధికారులు విచారణ చేశారు. ఒక మహిళ పేరు మీద రెండు ఇళ్లు మంజూరు చేయడం, నిబంధనలకు విరుద్ధంగా అవివాహిత, ప్రత్యేకంగా రేషన్‌కార్డు లేని వారికి ఇళ్లు మంజూరు చేసినట్లు విచారణలో తేలింది. పూసుగూడెంలో ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. నిర్మాణం పూర్తై బిల్లులు రావడం లేదని ఈ సందర్భంగా లబ్ధిదారులు అధికారుల ఎదుట వాపోయారు.
బిల్లుల చెల్లింపు సమయంలో స్థానిక సిబ్బంది చేతివాటం ప్రదర్శించారని పిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణ అనంతరం త్వరలో మరోమారు పూసుగూడెంలో క్షేత్రస్థాయిలో విచారణ చేపడతామని చెప్పారు. అనంతరం తహశీల్దార్ రాజేశ్వరితో ఇళ్ల మంజూరుపై మాట్లాడారు. విచారణ అనంతరం సమగ్ర సమాచారం, జాబితాలను గ్రామాలవారీగా అందజేయాలని హౌసింగ్ అధికారులను ఆదేశించారు.