పేదవారికి జీవనోపాధి కల్పించడంతో పాటు, ప్రభుత్వ భూములను కాపాడటం, పచ్చదనాన్ని పెంపొందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కనిపించని ఇందిరమ్మ పచ్చతోరణం పథకం ఆచూకీ లేకుండా పోయింది. జిల్లాలో రెండు, మూడు మండలాల్లో మినహా ఎక్కడా పథకం ఊసేలేదు
మార్కాపురం, న్యూస్‌లైన్: పేదవారికి జీవనోపాధి కల్పించడంతో పాటు, ప్రభుత్వ భూములను కాపాడటం, పచ్చదనాన్ని పెంపొందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కనిపించని ఇందిరమ్మ పచ్చతోరణం పథకం ఆచూకీ లేకుండా పోయింది. జిల్లాలో రెండు, మూడు మండలాల్లో మినహా ఎక్కడా పథకం ఊసేలేదు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ, ఇందిరాక్రాంతి పథం, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా ఈ పథకాన్ని అమలు చేయాలి. ప్రభుత్వ బంజరు భూములు, చెరువుగట్లు, కాలువల వెంబడి, పోరంబోకు భూముల్లో, ప్రభుత్వ పాఠశాలల దగ్గర మొక్కలు నాటి వాటిని సంరక్షించుకుని ఫలసాయం పొందేలా పథకాన్ని రూపకల్పన చేశారు. ప్రభుత్వ భూములు ఎక్కువగా ఉన్న చోట ఎకరాల విస్తీర్ణంలో, తక్కువ ఉన్న చోట కాలువ గట్లు, చెరువులు, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ రోడ్ల వెంబడి కిలోమీటర్ల ప్రకారం మొక్కలు నాటాలని నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు పథకం ఎంపికలో ప్రాధాన్యత ఇస్తారు. జిల్లాలోని 56 మండలాల్లో మొదటి దశలో 7,583 మంది లబ్ధిదారులకు 7,150 ఎకరాల్లో చెట్టు, పట్టా పేరుతో మొక్కలు పంపిణీ చేసి పట్టాలివ్వాలని లక్ష్యాలు నిర్దేశించుకున్నారు. జూలై 31 నాటికి లక్ష్యాన్ని పూర్తి చేయాల్సి ఉండగా, సమైక్యాంధ్ర ఉద్యమంలో జిల్లా అధికారులంతా సమ్మెలో ఉండటంతో పథకం ముందుకు సాగడం లేదు.
ఉలవపాడు, చినగంజాం మండలాల్లో మాత్రమే దీన్ని అమలు చేయగలిగారు. మార్కాపురం మండలంలో 129 కిలోమీటర్ల పొడవున 120 మంది లబ్ధిదారులకు, తర్లుపాడులో 70 మందికి 123 ఎకరాల్లో, కురిచేడు మండలంలో 265.95 ఎకరాల్లో 124 మంది లబ్ధిదారులకు, దొనకొండ మండలంలో 94 మందికి 107 ఎకరాల్లో, కొనకనమిట్ల మండలంలో 200 ఎకరాలకు 118 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి చెట్టు, పట్టా ఇవ్వాలని ఐకేపీ సిబ్బంది తహసీల్దార్లకు ప్రతిపాదనలు పంపారు. ఎంపిక చేసిన ప్రభుత్వ భూముల్లో లబ్ధిదారులు జామ, చింత, నేరేడు, మామిడి, ఉసిరి తదితర పదిరకాల పండ్ల మొక్కలు నాటుకోవాలి. ఒక్కో లబ్ధిదారునికి ఎకరా పొలంలో 150 నుంచి 200 మొక్కల వరకు నాటుకోవచ్చు. ఒక్కో మొక్క సంరక్షణకు నెలకు * 15 ప్రకారం అందజేస్తారు. మొక్కలు నాటేందుకు అవసరమయ్యే ఖర్చును ఉపాధి హామీ పథకం కింద లబ్ధిదారునికి చెల్లిస్తారు. జూలై 31 నాటికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం లబ్ధిదారులకు పట్టాలిచ్చి మొక్కలు నాటాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా సమైక్యాంధ్రకు మద్దతుగా రెవెన్యూ సిబ్బంది సమ్మెలో ఉండటంతో ఎంపిక చేసిన లబ్ధిదారులకు పట్టాలు ఇవ్వకపోవటంతో మొక్కలు నాటలేకపోయారు.
సమ్మెతో జాప్యం: సుధాకర్, డీపీఎం, డీఆర్‌డీఏ
జిల్లా వ్యాప్తంగా 7,150 ఎకరాల్లో పచ్చతోరణం పథకం కింద చెట్టు, పట్టా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించి 7,583 మంది లబ్ధిదారులను ఎంపిక చేశాం. వీరి జాబితాను మండలాల్లో ఉన్న ఐకేపీ సిబ్బంది ద్వారా పట్టాల పంపిణీ కోసం రెవెన్యూ కార్యాలయాలకు పంపాం. వివిధ శాఖల అధికారులు సమైక్యాంధ్రకు మద్దతుగా సమ్మెలో ఉండటంతో పథకం నెమ్మదిగా అమలవుతోంది. జిల్లాలో చినగంజాం, ఉలవపాడు మండలాల్లో కొంత మంది లబ్ధిదారులకు పట్టాలిచ్చారు. సమ్మెలో ఉన్న సిబ్బంది విధులకు హాజరైన వెంటనే పథకాన్ని అమలు చేస్తాం.