బజార్‌హత్నూర్, న్యూస్‌లైన్ : తక్కువ వ్యయంతో సొంతింటి కలను సాకారం చేస్తోంది గృహ నిర్మాణ శాఖ. ఇంజినీర్ల సూచనల ప్రకారం నిర్మిస్తే మూడు గదులతో అందమైన ఇల్లు రూపుదిద్దుకుంటుంది. మండల కేంద్రమైన బజార్‌హత్నూర్‌లో నమూనా ఇంటిని గృహ నిర్మాణ శాఖ అధికారులు నిర్మించారు. రూ.2లక్షలలోపే వ్యయమైందని తెలిపారు. ఈ భవనంపై లబ్ధిదారులు ఆసక్తి చూపుతున్నారు. ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం కింద ఎస్సీలకు ఇంటి నిర్మాణానికి రూ.లక్ష, ఎస్టీలకు రూ.లక్షా 50వేలు, బీసీలకు రూ.70వేలు అందిస్తున్నట్లు గృహ నిర్మాణ శాఖ డీఈ బసవేశ్వర్ తెలిపారు.
నిర్మాణం ఇలా..
కట్ పిల్లర్స్‌పై బీమ్స్ వేసి పునాది నిర్మాణం చేపట్టారు. ఇందుకు 26 బస్తాల సిమెంటు ఉపయోగించారు. పునాదిపై సిమెంటు ఇటుకలతో గోడలు నిర్మించారు. 400 చదరపు అడుగుల ఇంటి నిర్మాణానికి 1300 సిమెంటు ఇటుకలు వినియోగించారు. వీటికి రూ.18వేలు ఖర్చు చేశారు. గోడల నిర్మాణానికి 30 బస్తాల సిమెంటు వాడారు. మొత్తం సిమెంటు ఇటుకలు కావడంతో ప్లాస్టరింగ్‌కు తక్కువ సిమెంటు అవసరమైంది. స్లాబ్ నిర్మాణంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. స్లాబ్ కోసం క్వింటాల్ 25కిలోల సలాక, 25బస్తాల సిమెంటు వాడారు. స్లాబ్ వేసేటప్పుడు ఇంటిపైకప్పు భాగంలో గూనలను ఉపయోగించారు. వీటిపై స్లాబ్ వేశారు. గూనలు వాడడం వల్ల సిమెంటు, కాంక్రిట్, సలాక, ఇసుక ఆదా అవుతుంది.
అంతేగాకుండా వేసవిలో చల్లగానూ ఉంటుంది. ఇంటి లోపల పైకి చూస్తే గూనలు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. పైకప్పు కోసం 480 గూనలు వాడారు. ఆరు కిటికీలు, రెండు వెంటిలేటర్లు, రెండు తలుపులు రూ.6వేలతో కొనుగోలు చేసి బిగించారు. నమూనా గృహానికి రూ.2లక్షలు వ్యయమైందని గృహా నిర్మాణ శాఖ అధికారులు తెలిపారు.
ఇలా కడితే సొంతింటి కల సాకారం
Published Sun, Dec 15 2013 3:30 AM | Last Updated on Sat, Aug 11 2018 8:06 PM
Advertisement
Advertisement