చిత్తశుద్ధి కనుమరుగు
చిత్తశుద్ధి కనుమరుగు
Published Wed, May 3 2017 12:17 AM | Last Updated on Sat, Aug 11 2018 8:06 PM
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ‘బహిరంగ మలవిసర్జన లేని జిల్లాగా పశ్చిమ గోదావరిని ప్రకటిస్తున్నా’నని ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు నిండు సభలో చెప్పారు. గత నెల 29న నల్లజర్ల మండలం పోతవరంలో నిర్వహిం చిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ జిల్లాలో మరుగుదొడ్డి లేని ఇల్లు ఒక్కటి కూడా లేదని.. ఇది జిల్లాకే కాదు రాష్ట్రానికీ గర్వకారణమని ఘనంగా చెప్పారు. వాస్తవంలోకి వెళితే.. జిల్లాలో మరుగుదొడ్లు లేని ఇళ్లు ఇంకా వేల సంఖ్యలోనే ఉన్నాయి. అధికారిక లెక్కల ప్రకారమే 7,877 మరుగుదొడ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. పనుల ప్రారంభానికే నోచుకోని మరుగుదొడ్లు 1,700 ఉన్నాయి. అవి అధికారులు చెబుతున్న గణాంకాలు మాత్రమే. క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలిస్తే.. ప్రతి మండలంలోనూ కనీసం 1,000 నుంచి 1,500 వరకూ మరుగుదొడ్లు లేని ఇళ్లు ఉన్నాయని అంచనా. అయితే, ప్రభుత్వం నుంచి ఒత్తిడి రావడంతో గణాంకాల్లో మాయచేసి అన్నిచోట్లా మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తయిపోయినట్టు చూపించాల్సి వచ్చిందని అధికారులు చెబుతున్నారు.
మంజూరైనవి 1.81లక్షల యూనిట్లు
జిల్లాలో వేలేరుపాడు, కుక్కునూరు మండలాలను మినహాయిస్తే.. 46 మండలాల్లో 1,81,179 మరుగుదొడ్లు మంజూరయ్యాయి. ఇందుకోసం రూ.262.53 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో 22,954 మరుగుదొడ్లు పూర్తి చేశారు. మొత్తం కలుపుకుని 1,71,602 నిర్మాణాలు పూర్తయ్యాయి. 7,877 యూనిట్లు నిర్మాణంలో ఉండగా.. 1,700 యూనిట్ల నిర్మా ణం ఇంకా మొదలు కాలేదు. ఒక్క చింతలపూడి మండలంలోనే 2,938 మరుగుదొడ్లు నిర్మాణంలో ఉండగా 67 అసలు ప్రారంభం కాలేదు. లింగపాలెం మండలంలో 1,605, గోపాలపురంలో 561, పోడూరులో 705, టి.నర్సాపురంలో 800 నిర్మాణాలు పూర్తికావాల్సి ఉంది. ఎక్కడైతే వందశాతం బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా ప్రకటించారో ఆ నల్లజర్ల మండలంలోనే ఇంకా 310 మరుగుదొడ్లు నిర్మాణంలో ఉండగా, 165 యూనిట్ల నిర్మాణం నేటికీ ప్రారంభం కాలేదు. ఏలూరు, భీమవరం, పాలకోడేరు మినహా ఏ మండలంలోనూ వంద శాతం లక్ష్యం చేరుకోలేదు. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ కింద 2019 మార్చికి వంద శాతం లక్ష్యాలను చేరుకోవాలని నిర్దేశించింది. జిల్లాలో మాత్రం 2017 మార్చికి పూర్తి కావా లని జిల్లా కలెక్టర్ లక్ష్యం నిర్దేశించి ఆ దిశగా యంత్రాంగాన్ని ముందుకు నడిపారు. తరచూ దీనిపై సమీక్షలు నిర్వహిస్తూ వచ్చారు. దీంతో ఎంపీడీవోలు జనవరి నుంచి మార్చి వరకూ నిర్మాణాలన్నీ పూర్తయినట్టు చూపించి కొన్ని పేర్లను జాబితాల నుంచి తొలగించారు. ఈ విధంగా మూడు నెలల్లో 25 శాతం వరకూ పేర్లను తొలగించి లక్ష్యం పూర్తయినట్టుగా చూపించారనే ఆరోపణలున్నాయి. అన్ని మండలాల్లో ప్రత్యేక బృందాలతో సర్వే చేయిస్తే మండలానికి వెయ్యి నుంచి రెండు వేల వరకూ మరుగుదొడ్లు లేని ఇళ్లు కనపడతాయని అధికారులే పరోక్షంగా అంగీకరిస్తున్నారు. ముఖ్య మంత్రి వద్ద మెప్పు కోసం తమపై ఒత్తిడి తీసుకురావడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని వారు చెబుతున్నారు.
స్కీం అయిపోయిందన్నారు
మాది గోపాలపురంలోని కుమ్మరకుంట గ్రామం. వ్యక్తిగత మరుగుదొడ్డి మంజూరు చేయాలని అధికారులను అడిగితే.. స్కీం అయిపోయిందని చెప్పారు. మళ్లీ పథకం వచ్చినప్పుడు కట్టుకుందురు గాని అంటున్నారు. మల విసర్జనకు ఆరబయటకు వెళ్లాలి వస్తోంది. మా కాలనీలో 30 ఇళ్లు ఉండగా.. 6 ఇళ్ల వారికి మరుగుదొడ్లు లేవు. అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేదు.
– షేక్ బీబీ, కుమ్మరకుంట, గోపాలపురం మండలం
గిరిజన తెగకు చెందిన ఇతని పేరు కూతాడి బూసియ్య. జిల్లా కేంద్రానికి
కూతవేటు దూరంలో గల దెందులూరులో నివాసం ఉంటున్నాడు. అంధురాలైన భార్య గంగమ్మతో కలిసి పూరి పాకలో తల దాచుకుంటున్నాడు. ఈ కుటుంబానికి ఇప్పటివరకూ వ్యక్తిగత మరుగుదొడ్డి మంజూరు కాలేదు. అధికారుల చుట్టూ కాళ్లరిగిలే తిరిగినా ప్రయోజనం లేకపోయింది. తాను, అంధురాలైన తన భార్య బహిర్భూమికి వెళ్లాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నాడు. అభివృద్ధి, సంక్షేమ పథకాల మంజూరులో గిరిజనులకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలన్న రాజ్యాంగ నిబంధనను సైతం ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ పరిస్థితి బూసియ్య కుటుంబానికే పరిమితం కాదు. ఇలాంటి నిరుపేదలెందరో వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు కాక బహిర్భూమిని ఆశ్రయించాల్సి వస్తోంది.
Advertisement