ఎంత నగదు వాడుకుంటే అంతే వడ్డీ!
• దేశంలోనే తొలి క్రెడిట్ లైన్ యాప్ మనీటాప్
• రూ.25 వేల నుంచి రూ.5 లక్షల వరకు నగదు లభ్యత
• హైదరాబాద్‌లో సేవలు ప్రారంభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇప్పటివరకు వ్యాపార సముదాయాలకు మాత్రమే అందుబాటులో ఉన్న క్రెడిట్ లైన్ సేవలు ఇప్పుడు వ్యక్తిగత వినియోగదారులకూ చేరాయి. క్రెడిట్ లైన్ అంటే బ్యాంకులు ఎలాంటి వడ్డీలేకుండా రూ.5 లక్షల వరకూ నగదును అందిస్తాయి. అయితే బెంగళూరుకు చెందిన మనీటాప్ స్టార్టప్... ఆర్‌బీఎల్ బ్యాంకుతో ఒప్పందం చేసుకుని ఈ సేవలను వ్యక్తిగత వినియోగదారులకూ అందుబాటులోకితీసుకొచ్చింది. గురువారమిక్కడ మనీటాప్ సేవలను ప్రారంభించిన సందర్భంగా సంస్థ కో–ఫౌండర్ అనుజ్ కక్కర్ విలేకరులతో మాట్లాడారు. ముందుగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఉచితంగా మనీటాప్ యాప్‌ను డౌన్‌లోడ్‌చేసుకోవాలి.
సంబంధిత వివరాలు అందజేశాక... క్రెడిట్ హిస్టరీ ఆధారంగా బ్యాంక్ నుంచి అనుమతి రాగానే.. కస్టమర్ కనిష్టంగా రూ.3 వేల నుంచి రూ.5 లక్షల వరకు నగదును పొందే వీలుంటుంది. అయితే ఈపరిమితిలో ఎంత నగదును వాడుకుంటే దానికి మాత్రమే వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ వడ్డీ రేట్లు కూడా కనిష్టంగా నెలకు 1.25 శాతం ఉంటాయి. అసలును 2 నెలల నుంచి 3 ఏళ్ల లోపు నెలవారి వాయిదా (ఈఎంఐ)పద్ధతుల్లో చెల్లిస్తే సరిపోతుంది. గతేడాది అక్టోబర్‌లో సేవలను ప్రారంభించిన మనీటాప్.. ప్రస్తుతం బెంగళూరు, ఢిల్లీ, ముంబై, పుణె, బరోడా నగరాల్లో సుమారు 70 వేల మంది వినియోగించుకుంటున్నారు.