పథకాల అమలు ప్రభుత్వ విచక్షణాధికారమని వెల్లడి
అందులో జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పిన హైకోర్టు
ప్రతీ అంశానికి గ్రామసభ అనుమతి తప్పనిసరి కాదని స్పష్టీకరణ
అవినీతి జరిగితే కోర్టును ఆశ్రయించవచ్చని పిటిషనర్లకు సూచన
సాక్షి, హైదరాబాద్: గూడు లేని నిరుపేదల కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి లబి్ధదారుల ఎంపిక కోసం నియమించిన ఇందిరమ్మ కమిటీలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. విధాన నిర్ణయం ప్రకారం ప్రయోజనకరమైన పథకాలను అమలు చేయడానికి ప్రభుత్వానికి విచక్షణాధికారం ఉంటుందని చెప్పింది. అలాంటి అంశాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవని స్పష్టం చేసింది. ఇందిరమ్మ కమిటీలను సవాల్ చేస్తూ బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేందర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.
అయితే, ఏ ఉద్దేశం మేరకు పథకం ప్రారంభించారో.. దానికి విరుద్ధంగా అమలు జరిగితే కోర్టును ఆశ్రయించవచ్చని పిటిషనర్‌కు స్వేచ్ఛనిచి్చంది. ఇందిరమ్మ ఇంటి పథకం కింద తొలిదశలో 4,50,000 గృహాలను నిర్మించాలని, లబి్ధదారులకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేయాలని సంకల్పించింది. ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీ, మున్సిపల్ వార్డు స్థాయిలో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటుచేస్తూ గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి 2024, అక్టోబర్ 11న జీవో 33 జారీచేశారు. స్థానికులతో ఈ కమిటీలను కలెక్టర్ ఎంపిక చేస్తారు.
పంచాయతీల్లో సర్పంచ్ లేదా ప్రత్యేక అధికారి కమిటీ చైర్మన్‌గా ఇద్దరు స్వయం సహాయక సంఘాల మహిళలు, మరో ముగ్గురు (ఒక బీసీ, ఒక ఎస్సీ లేదా ఎస్టీ తప్పనిసరి) సభ్యులుగా ఉంటారు. మున్సిపల్ వార్డుల్లో కౌన్సిలర్ లేదా కార్పొరేటర్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఈ జీవోను సవాల్ చేస్తూ ఏలేటితోపాటు మరొకరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ నగేశ్ భీమపాక విచారణ చేపట్టి తీర్పు ఇటీవల వెలువరించారు.
పారదర్శకంగానే అమలు: ఏఏజీ
పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘ఎలాంటి అర్హతలు పేర్కొనకుండా సభ్యుల ఎంపిక చట్టవిరుద్ధం. ఇష్టం వచ్చిన వారిని, పార్టీలకు చెందిన కార్యకర్తలను సభ్యులుగా నియమించే ప్రమాదం ఉంటుంది. గ్రామ సభలు, వార్డు కమిటీల ప్రస్తావన లేకుండా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేయడం సరికాదు. ఈ కమిటీలను రద్దు చేయాలి’అని కోరారు.
ప్రభుత్వం తరఫున ఏఏజీ తేరా రజనీకాంత్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘రాష్ట్రంలో ఇళ్లు లేని వారి కోసం ఇందిరమ్మ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కమిటీలున్నా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్లు పర్యవేక్షణ చేస్తారు. ఆవాస్ ప్లస్ 2024 యాప్‌లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించాకే ఎంపిక జరుగుతుంది. అక్రమాలకు తావులేకుండా పారదర్శకంగా పథకం అమలు ప్రక్రియ సాగుతోంది. ఈ పిటిషన్లను కొట్టివేయాలి’అని చెప్పారు.
గ్రామసభ అనుమతి తప్పనిసరి కాదు..
‘పంచాయతీ రాజ్ చట్టంలోని సెక్షన్ 6(8) ప్రకారం లబ్దిదారుల ఎంపికకు గ్రామసభ అనుమతి తప్పనిసరి కాదు. ఈ కేసులో పంచాయతీలో కార్యదర్శి, మున్సిపల్ వార్డులో వార్డుస్థాయి అధికారి ప్రజాపాలన కింద వచ్చిన దరఖాస్తులపై సర్వే నిర్వహిస్తారు. యాప్‌లో కుటుంబంతోపాటు ఆదాయ వివరాలను నమోదు చేస్తారు. అర్హత ప్రమాణాల ప్రకారం లబ్దిదారులను నిర్ధారిస్తారు.
పథకాలను అమలు చేయడానికి ప్రభుత్వానికి స్వేచ్ఛ, విచక్షణ ఉంటుంది. యాప్, కమిటీలు, ఉన్నతాధికారుల పర్యవేక్షణ.. ఇలా పథకాన్ని పారదర్శకంగా అమలు చేసేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. నచి్చన వారిని కమిటీలు ఎంపిక చేసుకుంటాయని, పిటిషనర్లు భయపడటం అర్థంలేనిది’అని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment