' సుమారు రెండేళ్ల కిందట కట్టుకున్న కొత్త ఇంటి ఎదుట దీనంగా నిల్చున్న ఈమె పేరు కోల పద్మ. నర్సింహులపేట మండలంలోని పెద్దముప్పారం గ్రామం. పద్మకు భర్త వీరయ్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. భార్యాభర్తలు వ్యవసాయ కూలీ పనులు చూసుకుంటారు. గుడిసెలో నివాసం ఉంటున్న వీరికి మూడేళ్ల కిందట ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని అధికారులు కాగితం పంపారు. గుడిసె పక్కనే ఉన్న ఖాళీ జాగాను కొనుక్కొని మూడేళ్ల కిందటే ఇంటి పనులు మొదలు పెట్టారు. పునాది, స్లాబ్, గోడలు.. ఇలా అధికారులు చెప్పినప్పుడల్లా ఫొటోలు దిగి బిల్లు కోసం ఇచ్చారు. ఇలా ఇచ్చి ఏడాదిన్నర దాటింది. అప్పటి నుంచి ఇందిరమ్మ బిల్లు కోసం తిరుగుతూనే ఉన్నారు. పైసలొస్తాయంటూ అధికారులు చెప్పడంతో అందినకాడల్లా అప్పులు తెచ్చారు. మొత్తానికి ఏడాది కిందట ఇల్లు పూర్తయింది. సుమారు రూ.1.80లక్షలు ఖర్చు చేశారు. ఇందిరమ్మ పథకం కింద రూ.65వేలు ఇస్తున్నామని ఇటీవలే అధికారులు చెప్పడంతో కొంత సంబరపడ్డారు. కానీ ఇప్పటికే బస్సు కిరాయిలు పెట్టుకుని కార్యాలయాల చుట్టూ తిరిగారు. అయినా బిల్లు మాత్రం రాలేదు.
‘‘ముగ్గురు ఆడపిల్లలు.. సొంతిల్లు ఉండాలని ధైర్యం చేసినం. సర్కారు కూడా ఇల్లు మంజూరు చేసింది. వేన్నీళ్లకు చన్నీళ్లు అన్నట్టు ఇల్లు కట్టుకున్నం. బిల్లు కోసం ఏడాది నుంచి ఇందిరమ్మ అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నం. కూలీ పనులు చేస్తేనే పూట గడుస్తది. ఇప్పుడు చేస్తున్న పనిని ఇడిసిపెట్టి ఇంటి బిల్లు కోసం తిరుగుతున్నం. చివరకు కుటుంబ పోషణ, పిల్లల చదువుల కోసం చేసిన అప్పు పెరిగిపోయింది. ఇక చేసేది లేక కట్టుకున్న ఇంటిని అమ్ముకుందామనుకుంటానం.’’
- దంపతులు పద్మ, వీరయ్య
వరంగల్, న్యూస్‌లైన్ : ఇందిరమ్మ ఇల్లు కట్టుకున్నా బిల్లులు మాత్రం రావడం లేదు. రెండు నెలలుగా బిల్లులు మళ్లీ పెండింగ్‌లో పడ్డాయి. బీబీఎల్, ఆర్‌ఎల్ వరకు 1.01 లక్షల ఇళ్లు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో కొ న్ని నిర్మాణాలు మూడేళ్ల కిందటే ప్రారంభించగా.. మరికొన్ని ఇటీవలే మొదలుపెట్టారు. సంబంధిత అ దికారులకు తీరిక లేకపోవడంతోనే వాటికి బిల్లులు రావడం లేదు. ఫలితంగా జిల్లాలో రూ.5కోట్ల వరకు ఇందిరమ్మ లబ్ధిదారులకు బిల్లులు బాకీ పడ్డాయి.
అధికారులకు టైం లేదట
పనులు మొదలుపెట్టిన ఇళ్లను బీబీఎల్ వరకు ఈఈలు స్వయంగా పరిశీలించాలి. వారే తొలి బిల్లును విడుదల చేయాలి. కానీ.. ఎక్కువ గ్రామా లు ఉండటంతో వీటి గురించి పట్టించుకోవడం లేదు. ఈఈలకు ఇన్‌చార్జి మండలాలు ఉండటంతో వాటిని తిరిగి పరిశీలించే సమయం లేదంటూ చేతులెత్తేస్తున్నారు. దీంతో ఇళ్ల బిల్లులు అందక లబ్ధిదారులు అవస్థ పడుతున్నారు. వరంగల్ ఈఈ రమేష్ రూరల్, అర్బన్, నర్సంపేట డివిజన్లకు ఈఈగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జనగామ ఈఈ రాజశేఖర్‌కు జనగామ, మహబూబాబాద్, ములుగు డీఈ వసంతరావుకు అక్కడే ఈఈగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రతీ డివిజన్‌కు ఈఈలు లేకపోవడం, క్షేత్రస్థాయిలో మండలాల నుంచి అధికారులు సకాలంలో జాబితా పంపించకపోవడంతో బిల్లులకు ఆలస్యమవుతోంది.
బిల్లులేవీ..?
సుమారు 21వేల ఇళ్లకు బిల్లులు సిద్ధం చేసిన అధికారులు వాటిని ప్రభుత్వానికి పంపించారు. కానీ అక్కడి నుంచి బ్యాంకులకు నగదు బదిలీ చేయకపోవడంతో లబ్ధిదారులు నిత్యం ఎదురుచూస్తున్నారు. ఒకవేళ బ్యాంకు ఖాతాల్లో జమ చేశారా.. అనే ఆశతో వాటి చుట్టూ తిరుగుతున్నారు. కానీ ప్రభుత్వం సీమాంధ్ర ఉద్యమంతో లింకు పెట్టడం, దీంతో గృహ నిర్మాణ విభాగంలో ఫైల్ కదలడం లేదంటూ బిల్లులను నిలిపివేశారు. జిల్లాలో సుమారు లక్ష మంది లబ్ధిదారులకు రూ.5కోట్ల వరకు బిల్లులు రావాల్సి ఉంది.
కొసమెరుపు
కాగా, అర్హులైన లబ్ధిదారులకు బిల్లులివ్వని అధికారుల విషయం ఇక్కడే బయటపడుతోంది. ఏడాది కాలంగా బిల్లులు రావడం లేదని మొత్తుకుంటున్న కోల పద్మ స్వగ్రామంలోనే రూ.30లక్షల అవినీతి వెలుగుచూసింది. నర్సింహులపేట మండలం పెద్దముప్పారంలో ఇళ్లు నిర్మించకుండానే కొందరు బిల్లులు తీసుకున్నారని, స్థానిక నాయకులు బిల్లులు స్వాహా చేశారని, దీనిపై సర్వే చేయడంతోపాటు కేసు నమోదు చేసి, నిధులు రికవరీ చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇల్లు నిర్మించుకున్న పద్మకు మాత్రం రూపాయి విడుదల కాలేదు. అన్ని నిబంధనలున్నా బిల్లులు రాని లబ్ధిదారులు ఇప్పుడు లక్షల్లో ఉన్నారు.
ఇందిరమ్మా.. బిల్లేదమ్మా?
Published Sun, Oct 6 2013 6:38 AM | Last Updated on Sat, Aug 11 2018 8:06 PM
Advertisement
Advertisement