సాక్షి, కొత్తగూడెం: ఇందిరమ్మ ఇళ్ల పథకం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. జిల్లాలో పలు ఇందిరమ్మ కాలనీలు ఏర్పాటు చేసినా.. వాటిలో వసతులు కల్పించడంలో విఫలమైంది. దీంతో లబ్ధిదారులకు ఇక్కట్లు తప్పడం లేదు. మంచినీరు, డ్రెయినేజీ సమస్యలు పరిష్కరించాలని వారు ఆందోళన చేస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు.
ఇందిరమ్మ పథకం మొదటి, రెండో దశల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం 25 కాలనీలను తీసుకుంది. ఇందులో ఖమ్మం డివిజన్‌లో 19, ఇల్లెందు డివిజన్‌లో 2, కొత్తగూడెం డివిజన్‌లో 4 ఉన్నాయి. అర్హులైన నిరుపేద లబ్ధిదారులకు ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు ఇల్లు నిర్మించి ఇవ్వడం ఈ పథకం ఉద్దేశం. అంతేకాకుండా ఆయా కాలనీల్లో మంచినీరు, విద్యుత్, సీసీ రోడ్లు, డ్రెయినేజీ వంటి సౌకర్యాలు కల్పించాలి. కానీ ఏళ్లు గడుస్తున్నా ఈ కాలనీల్లో పూర్తిస్థాయిలో వసతులు లేవు. కాలనీ ఏర్పాటులో ముందుగా విద్యుత్ సౌకర్యం కల్పించాల్సి ఉండగా, ఇళ్ల నిర్మాణం పూర్తయినా ఆ సౌకర్యం లేదు. దీంతో కాలనీల్లో అంధకారం నెలకొంది. కనీసం మంచినీటి వసతి కూడా లేకపోవడంతో ఈ ఇళ్లలో నివాసం ఉండేవారు సుదూర ప్రాంతాలకు వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నారు. లబ్ధిదారుల అవసరాల నిమిత్తం ఆయా కాలనీల్లో చేతి పంపులు కూడా వేయలేదు. కొన్నిచోట్ల విద్యుత్ స్తంభాలు వేసినా.. వైర్లు లాగడంలో ట్రాన్స్‌కో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇందిరమ్మ లబ్ధిదారులను ఇన్ని సమస్యలు పట్టిపీడిస్తున్నా.. పరిష్కరించాల్సిన అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు.
సాగుతున్న పనులు..
ఖమ్మం నగర సమీపంలో ఉన్న వెంకటగిరి ఇందిరమ్మ కాలనీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. 2008లో ఇక్కడ ఇళ్ల నిర్మాణం ప్రారంభించారు. ఇంటి స్థలం ఇవ్వడంతో లబ్ధిదారులు అప్పోసప్పో చేసి ఇళ్లు నిర్మించుకున్నా ఇప్పటి వరకు ఈ కాలనీల్లో పూర్తి స్థాయిలో కరెంట్, మంచినీటి వసతి లేదు. దీంతో కొంతమంది ఆ ఇళ్లను వదిలేసి ఖమ్మం నగర శివారు ప్రాంతంలో అద్దెకు ఉంటూ కూలికి వెళ్తున్నారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి వసతి అంటూ ఏళ్లుగా పనులను సాగదీస్తుండడం గమనార్హం. ఇప్పటికి ఐదేళ్లు పూర్తయినా ఈ కాలనీల్లో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. డ్రైనేజీలు లేక ఇళ్ల పరిసర ప్రాంతాలు మూరికి కూపాలుగా మారి దోమలు స్వైర విహారం చేస్తుండడంతో కాలనీవాసులకు విషజ్వరాలు ప్రబలుతున్నాయి. అయినా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, తమను పట్టించుకోవడం లేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసినా..
కాలనీల్లో వసతులు కల్పించాలని ప్రతి గ్రీవెన్స్‌డేలో మొరపెట్టుకుంటున్నా ఫలితం లేదని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. గ్రీవెన్స్‌డేలో ఎక్కువగా ఇందిమర్మ ఇళ్ల బిల్లులు చెల్లించడం లేదని, కాలనీల్లో సమస్యలు పరిష్కరించాలని వినతులు అందుతున్నాయి. ఈ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశిస్తున్నా ఫలితం కనిపించడం లేదు. దీంతో లబ్ధిదారులు మళ్లీ గ్రీవెన్స్‌బాట పడుతున్నారు. ఖమ్మం సమీపంలో ఉన్న కాలనీ పరిస్థితే ఇలా ఉంటే.. జిల్లాలోని మిగతా కాలనీల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పైగా మౌలిక వసతులు కల్పించాల్సిన ఆయా శాఖల ముఖ్య అధికారులు మాత్రం తమ పరిధిలో అన్ని పనులు సవ్యంగా సాగుతున్నాయని ఎవరికి వారు చెపుతున్నారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు స్పందించి అధికారులపై ఒత్తిడి తేకుంటే ఇక ఈ కాలనీలు లబ్ధిదారులు నివాసం ఉండడానికి వీలు లేకుండా శిథిలావస్థకు చేరుకునే ప్రమాదం ఉంది.
‘కాలనీ’ కష్టాలు
Published Wed, Oct 16 2013 6:38 AM | Last Updated on Sat, Aug 11 2018 8:06 PM
Advertisement