చంద్రగిరి, న్యూస్‌లైన్ : తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా చంద్రగిరి నియోజకవర్గంలోని తమ్ముళ్లకు మాజీ మంత్రి గల్లా అరుణకుమారి అనుచరుల చేతుల్లో దెబ్బలు తప్పడం లేదు. గతంలో అధికార కాంగ్రెస్‌లో ఉంటూ టీడీపీ నేతలపై కేసులు గొడవలతో నానా ఇబ్బంది పెట్టిన వ్యక్తులు ఇప్పుడు టీడీపీలో చేరి అదే దందా కొనసాగిస్తున్నారు. కరుడుగట్టిన టీడీపీ వాదులను గల్లా అనుచరులు టార్గెట్ చేస్తున్నారు. దీంతో తమ్ముళ్లలో నిర్వేదం మొదలైంది. వివరాలిలా..
టీడీపీ అధికారంలోకి రావడంతో చంద్రగిరి నియోజకవర్గంలో మొదటి నుంచీ తెలుగుదేశంలో ఉన్న నాయకులను గల్లా అనుచరులు టార్గెట్ చేశారు. ఇతర కారణాలు చూపించి వారి పైకి దాడికి దిగుతున్నారు. గత ఎన్నికల్లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే కారణం చూపి దాడి చేస్తున్నారు. బుధవారం సాయంత్రం చంద్రగిరి పోలీస్ స్టేషన్‌కు ఎదురుగా అందరూ చూస్తుండగానే గల్లా అనుచరులు టీడీపీలో జిల్లా స్థాయి నేతపై దాడికి పాల్పడ్డారు.
ఈ విషయాన్ని బాధితుడు మరో టీడీపీ నాయకుడికి ఫోన్‌లో తెలిపాడు. ఆ టీడీపీ నేత హుటాహుటిన అక్కడకు చేరుకుని దాడిని తీవ్రంగా ఖండించారు. ఎలా దాడి చేస్తారని ప్రశ్నించారు. ‘నువ్వెవడ్రా అడగటానికి’ అంటూ అతనిపై సైతం గల్లా అనుచరులు దాడికి దిగారు. దీంతో ఖంగుతిన్న తమ్ముళ్లు చేసేదిలేక అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో నిజమైన టీడీపీ కార్యకర్తల్లో అసంతృప్తి నెలకొంది.
రాజకీయ భవిష్యత్ లేక టీడీపీ పంచన చేరిన వ్యక్తులు తమపై ఎలా దాడి చేస్తారని లోలోన మధన పడుతున్నారు. దీనిపై తమ్ముళ్లల్లో ఆందోళన మెదలైంది. పార్టీ అధికారంలోకి వచ్చినా ఇన్నిరోజులు ఇబ్బందులు పడ్డ వారి నుంచే మళ్లీ దెబ్బలుతినే పరిస్థితి రావడంపై నిజమైన కార్యకర్తల్లో నిరాశ, నిర్వేదం మొదలయ్యాయి. ఈ విషయాన్ని పార్టీ అధినాయకుడి దృష్టికి తీసుకెళ్లేందుకు తమ్ముళ్లు సిద్ధమవుతున్నారు.
తెలుగు తమ్ముళ్లపై గల్లా అనుచరుల దాడి
Published Fri, May 23 2014 3:16 AM | Last Updated on Sat, Aug 11 2018 8:06 PM
Advertisement