Galla Arunakumari
-
ఎస్ఐపై గల్లా అనుచరుల దాడి
►నలుగురు యువకుల బరితెగింపు ►రాజీ కోసం తీవ్రంగా కృషిచేసిన సీఐ ►ఇన్స్పెక్టర్ తీరుపై రగిలిపోతున్న పోలీసులు తిరుచానూరు: తిరుచానూరు ఎస్ఐపై బుధవారం రాత్రి గల్లా అరుణకుమారి అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఎస్ఐ రామాంజనేయులు రాత్రి సింధూ జంక్షన్ వైపు వెళుతుండగా నలుగురు యువకులు ఓ ఆటో డ్రైవర్‌తో గొడవ పడుతుండ డాన్ని గమనించి వారిని వారించే యత్నం చేశారు. ఆ యువకులకు, ఎస్ఐకి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో ఎస్ఐ ఓ యువకుడిపై చేయి చేసుకోవడంతో ఆ నలుగురు కలసి ఎస్ఐపై దాడిచేసి పారిపోయారు. వారు టీడీపీకి చెందిన సునీల్, అతని అనుచరులని అక్కడున్నవారు తెలిపారు. ఎస్ఐ స్టేషన్‌కు వచ్చి సీఐకి ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడ్డ వారు అధికార పార్టీకి చెందినవారు కావడంతో ‘‘ఈ వ్యవహారం బయటకు పొక్కకుండా చూడాలి. నువ్వు కొత్తగా వచ్చావు. అధికార పార్టీ నాయకులను చూసీ చూడనట్టు వ్యవహరించాలి’’ అని సీఐ సలహా ఇచ్చారు. దీంతో ఎస్ఐ మనస్తాపానికి గురైనట్టు తెలిసింది. సాక్షాత్తూ ఎస్ఐపై దాడిచేస్తే కేసు నమోదు చేయకుండా రాజీ యత్నం చేయడంతో సీఐపై పోలీసులు రగిలిపోతున్నారు. ఎస్పీ అయినా స్పందించాలని కోరుతున్నారు. -
‘గల్లా’కు భూ నజరానా!
సాక్షి, హైదరాబాద్ : మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబానికి చెందిన మంగల్ ఇండస్ట్రీస్‌కు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత విలువైన, ప్రధానమైన ప్రాంతంలో ఉన్న భూమిని కారుచౌకగా ధారాదత్తం చేసింది. కడప-తిరుపతి రహదారిలోని కరకంబాడిలో దాదాపు రూ.43.38 కోట్ల విలువైన భూమిని రూ.4.88 కోట్లకే మంగల్ ఇండస్ట్రీస్‌కు కట్టబెట్టింది. ఈ మేరకు ఎకరా రూ.22.50 లక్షల ధరతో 21.69 ఎకరాలను మంగల్ ఇండస్ట్రీస్‌కు కేటాయించినట్లు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి జేసీ శర్మ గురువారం ఉత్తర్వులిచ్చారు. కరకంబాడి ప్రాంతం దాదాపుగా తిరుపతి నగరంలో కలసిపోయింది. రేణిగుంట విమానాశ్రయానికి, తిరుపతి, రేణిగుంట రైల్వేస్టేషన్లకు, తిరుపతి బస్టాండుకు, మంగళం బస్సు డిపోకు చాలా దగ్గరగా ఉండి బాగా అభివృద్ధి చెందుతున్న కరకంబాడి ప్రాంతంలో భూమి దొరకడమే కష్టం. ఇంత కీలకమైన ప్రాంతంలో కనిష్టంగా లెక్కేసుకున్నా బహిరంగ మార్కెట్లో ఎకరా విలువ రూ.2 కోట్లు నుంచి రూ.2.5 కోట్ల వరకూ ఉంటుందని అధికార వర్గాల అంచనా. అయితే ప్రభుత్వం మాత్రం మంగల్ ఇండస్ట్రీస్‌కు ఎకరా రూ.22.50 లక్షలకే కట్టబెట్టడం గమనార్హం. ఎన్నికల్లో చేసిన సాయానికి...: రాష్ట్రం విడిపోయేవరకూ కాంగ్రెస్‌లో కీలక శాఖల మంత్రిగా పనిచేసిన గల్లా అరుణకుమారి మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో తన కుమారుడు గల్లా జయదేవ్‌ను గుంటూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీకి దించడంద్వారా రాజకీయ అరంగేట్రం చేయించారు. ఆమెకు చంద్రగిరి అసెంబ్లీ టికెట్, కుమారుడికి గుంటూరు లోక్‌సభ టికెట్ ఖరారు చేసినందుకు ప్రతిగా ఎన్నికల ఖర్చులకోసం పార్టీకి ‘గల్లా’ ఇండస్ట్రీస్ గ్రూపు భారీగానే సొమ్ము ముట్టజెప్పిందని పార్టీ వర్గాలంటున్నాయి. ‘కీలకమైన ఎన్నికల్లో పార్టీకి సాయం చేసినందుకు నజరానాగా ఇప్పుడు విలువైన భూమిని కారుచౌకగా మంగల్ ఇండస్ట్రీస్‌కు కేటాయించాలని చంద్రబాబు సర్కారు నిర్ణయించింది. ఇందులో భాగంగానే కేవలం నెలన్నర రోజు ల్లోనే భూకేటాయింపుల ప్రక్రియను పూర్తిచేసి ఆగమేఘాలపై ఉత్తర్వులు జారీచేసింది’ అని టీడీపీ ముఖ్య నాయకుడొకరు వ్యాఖ్యానించడం గమనించాల్సిన అంశం. కేవలం 42 రోజుల్లో...: కేవలం 42 రోజుల్లోనే ఈ భూకేటాయింపుల ప్రక్రియ పూర్తవడాన్నిబట్టే ఫైలు ఎంత శరవేగంగా కదిలిందో అర్థమవుతోంది. ఈ ఏడాది సెప్టెంబర్ 21న చిత్తూరు జిల్లా కలెక్టర్ మంగల్ ఇండస్ట్రీస్‌కు భూ కేటాయింపులకోసం ఫైలు పంపించారు. అక్టోబర్ 6న ఆంధ్రప్రదేశ్ భూ యాజమాన్య సంస్థ(ఏపీఎల్‌ఎంఏ) దాన్ని ఆమోదించింది. అక్కడినుంచి ఆగమేఘాలపై రెవెన్యూ ముఖ్య కార్యదర్శి, రెవెన్యూ మంత్రి, సీఎం ఆమోదం పొందిన ఈ ఫైలు ఈ నెల 2న రాష్ట్ర మంత్రివర్గ ఎజెండాలో చేరిపోయింది. మంగల్ ఇండస్ట్రీస్‌కు భూ కేటాయింపునకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పుడు రెవెన్యూశాఖ జీవో ఇచ్చింది. ‘‘భూకేటాయింపులకోసం వందలాది ఫైళ్లు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉండిపోతుంటాయి. అయితే ఇది అధికారపక్షానికి చెందిన కీలక నేతకు సంబంధించింది కావడంతో రాకెట్ వేగంతో వెళ్లి కేవలం 42 రోజుల్లోనే కేబినెట్ ఆమోదం పొందింది’’ అని రెవెన్యూశాఖకు చెందిన కిందిస్థాయి అధికారి ఒకరు అన్నారు. మంత్రిగా ఉండగా సాధ్యం కాని పని.. గల్లా అరుణకుమారి గతంలో మంత్రిగా ఉన్న సమయంలోనే ఈ విలువైన భూమిపై కన్నేశారు. పారిశ్రామిక అవసరాలు సాకుగా చూపించి దీన్ని కైవసం చేసుకోవాలని అప్పట్లోనే ఆమె నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే జిల్లా కలెక్టర్ నుంచి 2009 అక్టోబర్ 22వ తేదీనే భూ కేటాయింపులకోసం ప్రతిపాదన తెప్పించుకున్నారు. అప్పట్లో సీఎంగా ఉన్న కె.రోశయ్య, తదుపరి సీఎంగా వచ్చిన ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ భూకేటాయింపునకు మౌఖికంగా అంగీకరించలేదు. దీంతో ఈ ప్రతిపాదన రెవెన్యూశాఖలో పక్కన పడిపోయింది. టీడీపీ అధికారంలోకి రా వడంతో మళ్లీ కలెక్టర్ నుంచి ఈ భూమికోసం ప్రతిపాదన తెప్పించుకున్న ‘గల్లా’.. సీఎంతో మాట్లాడి ఆగమేఘాలపై ఫైలు నడిపించి ఓకే చేయించారు. -
అధికార పార్టీ నాయకుల దౌర్జన్యం
♦ ఫ్లెక్సీల ఏర్పాటు పేరుతో పచ్చనేతల బరితెగింపు ♦ ఆటో డ్రైవర్లపై దాడి, స్టేషన్లో ఫిర్యాదు పాకాల : ఆటోస్టాండ్‌లో ఫ్లెక్సీ ఏర్పాటుకు అడ్డు చెప్పారన్న అక్కసుతో ఆటో డ్రైవర్లపై టీడీపీ ఛోటా నాయకులు దాడికి పాల్పడ్డారు. మాకే అడ్డు చెబుతారా అంటూ విచక్షణా రహితంగా డ్రైవర్లపై పిడిగుద్దులు కురిపించారు. అక్కడితో వదలకుండా ఆటోస్టాండ్‌ను జేసీబీతో ధ్వంసం చేశారు. నేరుగా పోలీస్టేషన్‌కు వెళ్లి బాధితులైన ఆటోడ్రైవర్లపైనే ఫిర్యాదు చేసిన సంఘటన పాకాలలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలు... పాకాల పట్టణం రైల్వే స్టేషన్ సమీపం, చిత్తూరు సర్కిల్లో శ్రీ వరసిద్ధి వినాయక ఆటోస్టాండ్‌లో వినాయక చవితి వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం మాజీ మంత్రి గల్లా అరుణకుమారి పాకాలకు వస్తున్నారు. దీంతో ఆమెకు స్వాగతం పలికేందుకు ఆటోస్టాండ్‌లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసేందుకు టీడీపీ నాయకులు బుధవారం సాయంత్రం ప్రయత్నించారు. అయితే ఇక్కడ వినాయక చవితికి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని, కొద్దిగా జరిపి ఫ్లెక్సీలు పెట్టుకోవాలని టీడీపీ నాయకులకు ఆటోడ్రైవర్లు వేడుకున్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ టీడీపీ నాయకులు ఆటోడ్రైవ ర్లు నాగూర్‌పై దాడికి దిగారు. బాధితులు తమపై దాడి చేసిన టీడీపీకి చెందిన నాగరాజ నాయుడు, కిషోర్,హర్ష, రమేష్,సాయి, రావిళ్ల మోహన్‌లపై పాకాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు కూడా బాధిత ఆటోడ్రైవర్లు నాగూర్, కపిల్ పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టారు. సానుభూతి పరులు కావడం వల్లే దాడులు... ఆటోస్టాండ్ నాయకులపై టీడీపీ నాయకులు దాడి చేశారన్న విషయం తెలుసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ నంగా బాబు రెడ్డి పోలీస్టేషన్‌కు చేరుకుని బాధితులకు అండగా నిలి చారు. తమ పార్టీకి ఆటోస్టాండ్ నాయకులు సానుభూతి పరులుగా మారడాన్ని జీర్ణించుకోలేక పోయిన టీడీపీ నాయకులు ఫ్లెక్సీల పేరుతో దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. 40 కుటుంబాలకు చెందిన పేదలు ఆటోలు నడుపుకుంటూ జీవనం సాగిస్తుంటే వారిపై దాడికి దిగడం దారుణం అన్నారు. ఇరు వర్గాలు ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పాకాల సీఐ చల్లని దొర తెలిపారు. -
లాబీయింగ్ చేస్తేనే టీడీపీలో పదవులు
గల్లా అరుణ సంచలన వ్యాఖ్య చిత్తూరు: కష్టపడి పనిచేయకుండా.. షో చూపించి హైదరాబాద్ స్థాయిలో లాబీయింగ్ చేసుకున్న వారికే తెలుగుదేశం పార్టీలో పదవులు దక్కుతున్నాయని మాజీ మంత్రి, టీడీపీ నాయకురాలు గల్లా అరుణకుమారి వ్యాఖ్యానించారు. కష్టపడి పనిచేసే కార్యకర్తలకు పదవులు దక్కడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరులో మంగళవారం జరిగిన టీడీపీ మినీ మహానాడులో ఆమె మాట్లాడుతూ.. పార్టీలో కార్యకర్తలకు తగిన గుర్తింపు ఇవ్వాలన్నారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి పనిచేసే కార్యకర్తలకు పదవులు ఇచ్చేలా చూడాలని మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని కోరారు. -
చిత్తూరు షుగర్స్‌పై సీఎం రమేష్ కన్ను?
లీజు కోసం కదులుతున్న పావులు పోటీ పడుతున్న మాజీ మంత్రి 15 నాటికి అధ్యయన కమిటీ రిపోర్ట్ ఆందోళనకు సిద్ధమవుతున్న కార్మికులు చిత్తూరు: చిత్తూరు షుగర్ ఫ్యాక్టరీని లీజు పేరుతో దక్కించుకునేందుకు ఎంపీ సీఎం రమేష్ పావులు కదుపుతున్నట్లు అధికార పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. మరోవైపు అదే పార్టీలో ఉన్న మాజీ మంత్రి గల్లా అరుణకుమారి సైతం పోటీపడుతున్నట్లు సంకేతాలున్నాయి. మొత్తంగా ఇద్దరు నేతలు చిత్తూరు చక్కెర కర్మాగారం కోసం పోటీ పడుతున్నట్లు సమాచారం. ఇరువురు నేతలు అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతల మద్దతు కోసం తమవంతు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అధ్యయన కమిటీ రిపోర్ట్ వచ్చిన తరువాతనే ఫ్యాక్టరీని అమ్మకానికి పెట్టాలా? లేక లీజుకు అప్పగించాలా ? అనే దానిపై నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి చెప్పినట్లు సమాచారం. ఎలాగైనా * 800 కోట్ల విలువైన ఫ్యాక్టరీని దక్కించుకొనేందుకు ఇటు ఎంపీ అటు మాజీ మంత్రి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. చారిత్రక చిత్తూరు షుగర్స్‌లో ఈ ఏడాది క్రషింగ్ నిలిపివేశారు. ఈ కర్మాగారం పరిధిలో 16 నెలలుగా 400 మంది కార్మికులకు ప్రభుత్వం జీతాలు చెల్లించకపోగా మూడేళ్లుగా చెరుకు రైతులకు సైతం కోట్లాది రూపాయల బకాయిలు చెల్లించాల్సి వుంది. బకాయిలు చెల్లించి చక్కెర కర్మాగారాన్ని నడిపిస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన చంద్రబాబు ఆ తరువాత మంగళం పాడారు. ఫ్యాక్టరీని తన అనుచరుల పరం చేసేందుకు బాబు ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటినుంచి చాపకింద నీరులా పావులు కదుపుతోంది. ఇందులో భాగం గా చక్కెర కర్మాగాల నిర్వహణపై అధ్యయన కమిటీ అంటూ ఐదుగురు ప్రైవేటు వ్యక్తులతో కమిటీ వేసింది. కమిటీ నివేదిక ఆధారంగా కర్మాగారాలపై నిర్ణయం తీసుకుంటామంటూ బాబు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెల 15 నాటికి అధ్యయన కమిటీ నివేదిక రానున్నట్లు సమాచారం. 2002లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు *18 కోట్లకు చక్కెర కర్మాగారాన్ని అమ్మకానికి పెట్టారు. అప్పట్లో రైతులు, కార్మికులు కోర్టుకు వెళ్లి ఫ్యాక్టరీని దక్కించుకున్నారు. ఇప్పుడు మళ్లీ అధికారం చేపట్టిన బాబు తన హయాంలోనే మరోసారి కర్మాగారాన్ని అమ్మకానికి పెడితే సొంతజిల్లా వాసుల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుందని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో లీజుకు అప్పగించడమే మేలని సీఎం నిర్ణయించినట్లు తెలుస్తోంది. చిత్తూరు కర్మాగారం పరిధిలో 84.5 ఎకరాల విలువైన స్థలం ఉంది. ప్రస్తుత ధరల ప్రకారం మొత్తం స్థలాన్ని అమ్మితే * 800 కోట్లు వచ్చే అవకాశం ఉంది. ఫ్యాక్టరీ స్క్రాప్ అమ్మితే రూ.10 కోట్లకు పైగా వస్తుంది. తొలుత లీజు పేరుపెట్టి ఆ తరువాత కర్మాగారాన్ని అమ్మకానికి పెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరో వైపు ఫ్యాక్టరీని లీజుకు లేదా అమ్మకానికి పెట్టే పక్షంలో ఆందోళనలు ఉధృతం చేయడంతో పాటు మరో మారు కోర్టుకు వెళ్తామని కర్మాగారం కార్మికులు, శాంతియుత ఉద్యమనేత వెంకటాచలంనాయుడు హెచ్చరిస్తున్నారు. -
టీడీపీ నేతల ఆధిపత్య పోరు!
తిరుపతి: చిత్తూరు జిల్లాలో ఇద్దరు టీడీపీ ప్రధాన నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. గాలి ముద్దు కృష్ణమనాయుడు ఆధిపత్యానికి చెక్ పెట్టాలని గల్లా అరుణకుమారి యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ పదవి ద్వారా మంత్రి పదవిని కైవసం చేసుకోవాలని గల్లా అరుణ యత్నాలు చేయడం గాలిని కలచి వేస్తోంది. ఇందుకు గాను చంద్రగిరిలో భారీ స్థాయిలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం తలపెట్టి .. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును ప్రసన్నం చేసుకోవచ్చని అరుణ భావిస్తున్నట్లు సమాచారం. అయితే గాలిని అణచివేసేందుకు కూడా ఇదే అదునుగా బాబు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. -
ముఖ్యమంత్రిని ఓడించిన ధీశాలి గల్లా
తిరుపతి రూరల్: సభ్యత్వ నమోదు చేయడంలో టీడీపీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఓడించిన ధీశాలి గల్లా అరుణకుమారి అని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కొనియాడారు. సోమవారం తిరుపతి రూరల్ మండలం వేదాంతపురంలో చంద్రగిరి సభ్యత్వ నమోదు సంబరాలు జరిగాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోనే గర్వించే నాయకురాలు గల్లా అరుణకుమారి అన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో సభ్యత్వ నమోదు సంబరాలు చూస్తుంటే సంక్రాంతి ముందుగానే వచ్చినట్లుందన్నారు. ఓడిన చోటే మళ్లీ విజయాన్ని వెతికేందుకు కృషి చేస్తున్న కెరటమని గల్లా అరుణకుమారిని చిత్తూరు ఎంపీ శివప్రసాద్ అభినందించారు. పార్టీ కోసం పనిచేస్తే వచ్చే తృప్తి ఆత్మసంతృప్తే వేరని, అందుకనే జిల్లాలోనే అత్యధిక సభ్యత్వాలు చేయాలనే సంకల్పంతో నడిచామని మాజీ మంత్రి, చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి గల్లా అరుణకుమారి చెప్పారు. సభ్యత్వ నమోదులో రాష్ట్రంలో ద్వితీయ స్థానం, జిల్లాలో ప్రథమస్థానం సాధించడంతో భారీ కేక్‌ను కట్ చేశారు. అంతకుముందు వేదాంత పురం సర్కిల్ నుంచి సభా వేదిక వరకు మంత్రి బొజ్జల, ఎంపీ శివప్రసాద్, ఎమ్మెల్యేలు ఆదిత్య, సత్యప్రభ, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి కార్యకర్తలతో కలసి ర్యాలీగా వచ్చారు. ర్యాలీ మధ్యలో కళాకారులతో కలసి చెక్కభజనలు చేశారు. టీడీపీ అడహక్ కమిటీ జిల్లా కన్వీనర్ శ్రీనివాసులు, నియోజకవర్గ సభ్యత్వ పరిశీలకురాలు పుష్పావతి, జెడ్పీటీసీ కుర్రకాల్వ సుభాషిణి, బీసీ పైనాన్స్ కార్పొరేషన్ రాష్ట్ర డెరైక్టర్ బడి సుధాయాదవ్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నరసింహయాదవ్, నాయకులు పాల్గొన్నారు. -
ఆధార్‌కు కాదు.. టీడీపీకి డెప్యుటేషన్
పంతులయ్య అధికార దుర్వినియోగం టీడీపీ సభ్యత్వ నమోదులో పంతులయ్య కృషిని పొగిడిన గల్లా అరుణకుమారి తిరుపతి రూరల్: పాఠాలు చెప్పాల్సిన పంతులయ్య పార్టీ భజన చేస్తున్నారా? బడి పిల్లల ఆధార్ నమోదు చేయటంలో బిజీగా ఉండాల్సిన ఆయన సైకిల్ ఎక్కి చక్కర్లు కొడుతున్నారా? ప్రతి నెలా ప్రభుత్వం నుంచి వేలకు వేలు జీతం తీసుకుంటూ సేవలు మేడమ్ వద్ద వెలగపెడుతున్నారా? ఈ ప్రశ్నలకు అవుననే మాజీ మంత్రి గల్లా అరుణకుమారి బహిరంగ వ్యాఖ్యలు చెబుతున్నాయి. టీడీపీ సభ్యత్వ నమోదులో తన పీఏ బాలకృష్ణారెడ్డి సేవలు అమోఘమని, అతనితోపాటు టీడీపీ నాయకుల తోడ్పాటుతోనే జిల్లాలోనే అత్యధికంగా టీడీపీ సభ్యత్వ నమోదు చేసినట్టు సాక్షాత్తు మీడియా, పాత్రికే యులు, రాష్ట్ర మంత్రి, ఎంపీల సాక్షిగా గల్లా అరుణకుమారి స్కూల్‌టీచర్ బాలకృష్ణారెడ్డిపై పొగడ్తల వర్షం కురిపించారు. ఈయన విద్యాశాఖలో ఆధార్ ఎన్రోల్మెంట్ అధికారిగా డెప్యుటేషన్‌పై పనిచేస్తున్నారు. సోమవా రం సాయంత్రం తిరుపతి రూరల్ మం డలం వేదాంతపురంలో చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ సభ్యత్వ నమోదు సంబరాల ముగింపు కార్యక్రమం జరిగిం ది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలో 65,200 సభ్యత్వాలు నమోదు చేయడంలో కృషి చేసిన వారికి గల్లా పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా తన పీఏ బాలకృష్ణారెడ్డి, తన వద్ద పనిచేసే మురళి, తన ఇంట్లో పనివాళ్ల సహకారం మరువలేనిదన్నారు. గల్లా మాటలతో వేదికపై ఉన్న ప్రజాప్రతినిధులు సైతం ఆశ్చర్యానికి లోనయ్యారు. ప్రభుత్వ విధుల్లో ఉన్న ఉద్యోగి పార్టీ సభ్యత్వ నమోదులో కీలకంగా ఎలా మారాడంటూ చర్చించుకున్నారు. గల్లా పొగడ్తల సమయంలో సదరు బాలకృష్ణారెడ్డి వేదిక సమీపంలోనే ఉండడం గమనార్హం. మేడమ్ మాటలు తన ఉద్యోగానికి ఎక్కడ ఎసరు పెడతాయోనని ఆయన ఆప్తుల వద్ద వాపోయినట్టు సమాచారం. గల్లా అరుణకుమారి మంత్రిగా ఉన్నప్పుడు పూతలపట్టు జెడ్పీ హైస్కూల్లో సైన్స్ టీచర్‌గా ఉన్న బాలకృష్ణారెడ్డి ఆమె వద్ద పీఏగా పనిచేశారు. పదవిపోయినా, ఎన్నికల్లో ఓడిపోయి ఎలాంటి అధికార హోదా లేకపోయినా ఆమె వద్దే ఇంకా సదరు పంతులయ్య సేవలందిస్తున్నట్టు విద్యాశాఖలో ఆరోపణలు ఉన్నా యి. బాలకృష్ణారెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ప్రస్తుత చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి గతంలో గవర్నర్‌కు సైతం ఫిర్యాదు చేశారు. ఆధార్ నమోదు కోసం నియమించాం జిల్లాలో స్కూల్ పిల్లల ఆధార్ నమోదు కోసం పూతలపట్టు హైస్కూల్ టీచర్‌గా ఉన్న బాలకృష్ణారెడ్డిని డెప్యుటేషన్‌పై నియమించాం. ఆ మేరకు గత డీఈవో ప్రతాప్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. డీవైఈవో కార్యాలయానికే ఆయన వచ్చి హాజరుపట్టీలో సంతకం పెట్టాల్సి ఉంది. ఓ పార్టీ సభ్యత్వ నమోదులో పాల్గొన్నట్టు ఆధారాలు ఉంటే పరిశీలిస్తాం. -వాసుదేవ నాయుడు, డీవైఈవో చిత్తూరు -
గల్లా vs గాలి
ఎమ్మెల్సీ పదవి కోసం మాజీ మంత్రులు గల్లా, గాలి ఎత్తులు గల్లా అరుణకు వ్యూహాత్మకంగా మంత్రి బొజ్జల మద్దతు మండిపడుతున్న ముద్దుకృష్ణమ తిరుపతి: మాజీ మంత్రులు గల్లా అరుణకుమారి, గాలి ముద్దుకృష్ణమనాయుడుల మధ్య శాసనమండలి ఎన్నికలు చిచ్చు రేపాయి. ఎమ్మెల్సీ పదవిని దక్కించుకోవడం కోసం ఇరువురూ ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. బల సమీకరణకు దిగుతున్నారు. మంత్రి బొజ్జల వ్యూహాత్మకంగా గల్లా అరుణకుమారికి దన్నుగా నిలుస్తున్నారు. తనను ఒంటరి చేసే దిశగా ఆమె పావులు కదుపుతుండడంపై గాలి ముద్దుకృష్ణమనాయుడు మండిపడుతున్నారు. టీడీపీ ఆవి ర్భావం నుంచి ఆ పార్టీలో ఉన్న మాజీ మంత్రి ముద్దుకృష్ణమ 1999లో టీడీపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. పదేళ్ల తర్వాత 2009లో మళ్లీ టీడీపీలో చేరారు. సార్వత్రిక ఎన్నికల్లో నగరి నియోజకవర్గం నుంచి పోటీచేసిన గాలి వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆర్కే రోజా చేతిలో ఓడిపోయారు. ఎన్నికల్లో విజయం సా ధించి ఉంటే గాలికి చంద్రబాబు మంత్రివర్గంలో స్థానం దక్కేదనే అభిప్రాయం ఆ పార్టీ శ్రేణుల్లో ఉంది. పార్టీని స్థాపించినప్పటి నుంచి టీడీపీకి చేసిన సేవలను గుర్తించి.. తనకు ఎమ్మెల్సీ పదవితోపాటూ మంత్రివర్గంలో చోటు కల్పించాలని సీఎం చంద్రబాబుపై ఏడు నెలలుగా ఆయన ఒత్తిడి తెస్తున్నారు. రాజకీయ అరంగేట్రం నుంచి టీడీపీతో ప్రధానంగా చంద్రబాబుతో రాజకీయంగా విభేదిస్తూ వచ్చిన మాజీ మంత్రి గల్లా అరుణకుమారి.. సార్వత్రిక ఎన్నికలకు ముందు అనూహ్యంగా సైకిలెక్కారు. కుమారుడు గల్లా జయదేవ్‌తో కలిసి టీడీపీలో చేరా రు. గుంటూరు లోక్‌సభ స్థానం నుంచి గల్లా జయదేవ్.. చంద్రగిరి అసెంబ్లీ స్థా నం గల్లా అరుణకుమారిలకు టీడీపీ టికెట్లు దక్కాయి. గల్లా జయదేవ్ గుం టూరు లోక్‌సభ స్థానం నుంచి విజయం సాధిస్తే.. అరుణకుమారి చంద్రగిరిలో వైఎస్సార్సీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చేతిలో ఘోరంగా ఓడిపోయారు. టీడీపీ తీర్థం పుచ్చుకున్నప్పటి నుంచి చంద్రబాబు కోటరీలో జయదేవ్ కీల కంగా వ్యవహరిస్తున్నారు. సార్వత్రిక ఎ న్నికల్లో టీడీపీకి భారీ ఎత్తున ఇం‘ధనం’ సమకూర్చడం వల్లే జయదేవ్‌కు చంద్రబాబు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారనే అభిప్రాయం ఆపార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. ఎన్నికల్లో పార్టీకి చేసిన సేవలకుగానూ తన తల్లికి ఎమ్మెల్సీ పదవితోపాటూ మంత్రివర్గంలో చోటు కల్పించాలని చంద్రబాబుపై జయదేవ్ ఒత్తిడి తెస్తున్నారు. ఎమ్మెల్సీ పదవిని దక్కించుకోవాలన్న లక్ష్యంతో చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ సభ్యత్వాలను అధికంగా చేయించేందుకు అరుణకుమారి అధికారవర్గాలను పావులుగా వినియోగించుకున్నారనే విమర్శలు వ్యక్తమైన విషయం విదితమే. జిల్లాలో అధికశాతం మంది టీడీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ల మద్దతు సంపాదించి.. చంద్రబాబువద్ద బల నిరూపణకు ఆమె పావు లు కదుపుతున్నారు. ఇటీవల డీఆర్వో నియామకం విషయంలో మంత్రి బొజ్జ ల గోపాలకృష్ణారెడ్డి, మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమ మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. సీఎం చంద్రబాబు జో క్యంతో వెనక్కి బొజ్జల వెనక్కి తగ్గడంతో గాలి సూచించిన అధికారినే డీఆర్వోగా నియమించారు. ఈ క్రమంలోనే మంత్రి బొజ్జల వ్యూహత్మకంగా గల్లాకు దన్నుగా నిలుస్తున్నారు. వారం క్రితం తిరుపతిలో గల్లా ఇంటికి వెళ్లిన బొజ్జల.. ఎమ్మెల్సీ పదవి విషయం బాసటగా నిలుస్తానని హమీ ఇచ్చినట్లు టీడీపీ వర్గాలు వెల్లడిం చాయి. ఇది గాలికి ఆగ్రహాన్ని తెప్పిం చింది. మరో వైపు ఆయనను ఒంటరిని చేసి.. ఎమ్మెల్సీ పదవిని చేజిక్కించుకునే దిశగా గల్లా పావులు కదుపుతోండటం తో టీడీపీలో బల సమీకరణలు ఎప్పటికప్పుడు మారుతున్నాయి. ఆదినుంచి పా ర్టీకి వెన్నుదన్నుగా నిలుస్తోన్న తనను కా దని గల్లాకు ఎమ్మెల్సీ పదవి ఇస్తే అధిష్ఠా నంతో అమీతుమీ తేల్చుకోవడానికి సై తం సిద్ధమని గాలి తన అనుయాయుల వద్ద స్పష్టీకరిస్తుండడం గమనార్హం. -
‘పచ్చ’ మార్క్.. బది‘లీల’లు
* టీడీపీలో ఆధిపత్య పోరుకు ఆజ్యం పోసిన ఉన్నతాధికారుల నియామకం * డ్వామా పీడీ నియామకంలో చక్రం తిప్పిన మాజీ మంత్రి గల్లా అరుణకుమారి * జెడ్పీ సీఈవోగా చంద్రమౌళిని నియమించడంపై మంత్రి బొజ్జల తీవ్ర అసహనం సాక్షి ప్రతినిధి, తిరుపతి: జిల్లా ఉన్నతాధికారుల బదిలీల ప్రక్రియ అధికార టీడీపీలో ఆధిపత్య పోరుకు ఆజ్యం పోసింది. కీలకస్థానాల్లో ఆడించి నట్టల్లా ఆడే అధికారిని నియమించుకుంటే పాల నను గుప్పిట్లో పెట్టుకోవచ్చన్నది టీడీపీ ప్రజాప్రతినిధుల ఎత్తుగడ. తద్వారా అటు పార్టీపై.. ఇటు జిల్లాపై ఆధిపత్యం చెలాయించవచ్చన్నది వారి వ్యూహం. మొన్న డీఆర్వో నియామకం మంత్రి బొజ్జల, మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమల మధ్య నిప్పు రాజేస్తే.. ఇప్పుడు జెడ్పీ సీఈవో బదిలీ మంత్రి బొజ్జల, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి మధ్య విభేదాలకు ఆజ్యం పోస్తోంది. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. పరిపాలనను గుప్పిట్లో పెట్టుకునేందుకు అధికారుల బదిలీలకు శ్రీకారం చుట్టింది. కలెక్టర్ నుంచి గ్రామ కార్యదర్శి వరకూ తమ మాట వినేవారినే నియమించుకోవడానికి టీడీపీ ప్రజాప్రతినిధులు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఇది ఆ పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరుకు దారితీసింది. జిల్లా రెవెన్యూ అధికారిగా విజయ్‌చందర్‌ను నియమించాలని మాజీ మంత్రి గాలి, ఎం.వెంకటేశ్వరరావును నియమించాలంటూ మంత్రి బొజ్జల పట్టుబట్టారు. ఈ ఇద్దరి మధ్య వివాదం కొనసాగుతుండగానే.. అత్యంత కీలకమైన జిల్లా నీటి యాజమాన్య సంస్థ(డ్వామా) పీడీగా రాజశేఖర్‌నాయుడిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ నియామకంపై మంత్రి బొజ్జల కన్నెర్ర చేశారు. మాజీ మంత్రి గల్లా అరుణకుమారికి అత్యంత సన్నిహితుడిగా ముద్రపడిన రాజశేఖర్‌నాయుడిని డ్వామా పీడీగా నియమించడంపై కినుక వహించిన బొజ్జల.. జెడ్పీ సీఈవో, డీఆర్డీఏ పీడీ తదితర కీలక స్థానాల్లో తన మాట వినే అధికారులను నియమించుకోవడానికి వ్యూహం రచించారు. జెడ్పీ సీఈవోగా వేణుగోపాల్రెడ్డినే కొనసాగించాలని చైర్పర్సన్ గీర్వాణి చేసిన ప్రతిపాదనకు బొజ్జల అంగీకరించారు. ఈలోగా జెడ్పీ సీఈవోను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. వేణుగోపాల్‌రెడ్డి స్థానంలో గతంలో జిల్లాలో డీఆర్డీఏ పీడీగా పనిచేసిన చంద్రమౌళిని నియమించింది. ఈ నియామకం విషయంలోనూ మాజీ మంత్రి గల్లా హస్తం ఉన్నట్లు బొజ్జల వర్గీయులు చెబుతున్నారు. జెడ్పీ సీఈవోగా చంద్రమౌళి నియామకంపై కన్నెర్ర చేసిన బొజ్జల.. వేణుగోపాల్‌రెడ్డిని రిలీవ్ చేయొద్దంటూ కలెక్టర్‌ను ఆదేశించారు. దాంతో చంద్రమౌళి జెడ్పీ సీఈవోగా బాధ్యతలు చేపట్టకుండా మోకాలడ్డినట్లయింది. డీఆర్డీఏ పీడీ రవిప్రకాష్రెడ్డికీ స్థానభ్రంశం కల్పించడానికి టీడీపీ ప్రజాప్రతినిధులు పావులు కదుపుతున్నారు. డ్వామా పీడీగా నియమితులైన రాజశేఖర్‌నాయుడు డీఆర్డీఏ పీడీ పోస్టును దక్కించుకునేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇప్పుడు డీఆర్డీఏ పీడీగా తన మాట వినే అధికారినే నియమించుకోవడానికి అటు ఎంపీ శివప్రసాద్.. ఇటు మాజీ మంత్రి గల్లా.. మరో వైపు మంత్రి బొజ్జల ప్రయత్నిస్తున్నారు. టీడీపీ ప్రజాప్రతినిధుల ఆధిపత్య పోరుకు ఉన్నతాధికారుల నియామకం వేదికగా మారడంతో పరిపాలన అస్తవ్యస్తంగా మారిపోయిందని అధికారవర్గాలు పేర్కొంటుండడం గమనార్హం. -
‘పచ్చ’డేగల ‘గుట్ట’కాయ స్వాహా
కబ్జాకు కాదేదీ అనర్హమని టీడీపీ నేతలు చాటిచెబుతున్నారు. గుట్టలూ పుట్టలను కూడా వదలడం లేదు. తిరుపతి రూరల్ మండలం కుంట్రపాకంలోని ఎట్టేరి గుట్టను మాజీ మంత్రి గల్లా అరుణకుమారి అనుచరుడు ఎస్.సోమ్‌ప్రకాష్ కబ్జా చేశారు. ఎట్టేరి గుట్ట కబ్జాపై మంగళవారం ప్రశ్నించిన కుంట్రపాకం గ్రామస్తులపై గల్లా అనుచరులు దాడి చేశారు. రూ.65 కోట్ల విలువైన భూమిని టీడీపీ నేత కబ్జా చేసినా రెవెన్యూ అధికారులు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తుండటం గమనార్హం. సాక్షి ప్రతినిధి, తిరుపతి/తిరుపతి రూరల్: ఆధ్యాత్మిక నగరం తిరుపతి పరిసర ప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ప్రభుత్వ భూములను కబ్జా చేసి.. కోట్లాది రూపాయలు కాజేసేందుకు టీడీపీ నేతలు పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో తిరుపతి రూరల్ మండలం కుంట్రపాకంలో సర్వే నెంబరు 612లో 119.45 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఎట్టేరి గుట్టపై మాజీ మంత్రి గల్లా అరుణకుమారి అనుచరుడు ఎన్.సోమ్‌ప్రకాష్ కళ్లు పడ్డాయి. ఆ గుట్ట భూమిని ఎలాగైలా కాజేసేందుకు వ్యూహం రచించారు. ఎట్టేరి గుట్ట కింద భాగంలో ఉన్న 2.50 ఎకరాలకుపైగా ప్రైవేటు భూమిని కొనుగోలు చేశారు. ఆ తర్వాత ఎట్టేరి గుట్టలో ప్రహరీ గోడ నిర్మించి.. దానిపై దేవతా విగ్రహాలను ఏర్పాటుచేశారు. గుట్టపై అధునాతన సదుపాయాలతో అతిథిగృహాన్ని నిర్మించుకున్నారు. ఎట్టేరిగుట్టపై ఆశ్రమాన్ని ఏర్పాటు చేశాన నే భావనను కలిగించిన సోమ్‌ప్రకాష్.. ప్రహరీగేటుకు తాళంవేసి, భూమిని కబ్జా చేశారు. ఆ గుట్టపైకి ఎవరినీ అనుమతించడం లేదు. తరతరాలుగా కుంట్రపాకం గ్రామీణులు తమ పశువులను మేత కోసం ఆ గుట్టకు తీసుకెళ్లేవారు. ఇప్పుడు సోమ్‌ప్రకాష్ అనుమతించిక పోవడం గమనార్హం. తుడా అలసత్వమే సాకుగా.. ఎట్టేరి గుట్టలో చెట్లను పెంచి.. పర్యావరణాన్ని కాపాడతామని ఆ భూమిని అప్పగించాలని తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ(తుడా) 2007లో ప్రభుత్వాన్ని కోరింది. తుడా ప్రతిపాదన మేరకు ఆ భూమిని అప్పగించేందుకు ప్రభుత్వం సమ్మతించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎట్టేరి గుట్టను సర్వే చేసిన రెవెన్యూ అధికారులు 612 సర్వే నెంబర్లో విస్తరించిన 131.45 ఎకరాల భూమిని మూడు సబ్ డివిజన్లుగా వర్గీకరించారు. ఇందులో సర్వే నెంబర్ 612/2లో 10.19 ఎకరాలు, సర్వే నెంబర్ 612/3లో 1.81 ఎకరాలో మొత్తం 12 ఎకరాల్లో కాటమరాజు గుడి, ధర్మాచరణ మండలి, ఎల్లమ్మ గుడి, విఘ్నేశ్వరస్వామి గుడి, ఆంజనేయస్వామి గుడి, రాతిస్తంభాల మండపం, ముస్లిం ఈద్గా, పూర్ణచంద్రరావు క్వారీ, వసుమతి సర్వేశ్వర గుడి, శ్రీకృష్ణ గీతా మందిరాన్ని గ్రామీణులు నిర్మించుకున్నట్లు రెవెన్యూ అధికారులు తేల్చారు. సర్వే నెంబరు 612/1లో ఖాళీగా ఉన్న 119.45 ఎకరాల భూమిని తుడాకు అప్పగించాలని డిసెంబర్ 13, 2007న అప్పటి కలెక్టర్ ఉత్తర్వులు జారీచేశారు. కానీ.. ఆ భూమిని అప్పగించాలని కోరిన తుడా ఇప్పటిదాకా ఆ భూమిని స్వాధీనం చేసుకోకపోవడం గమనార్హం. ఇదే అలుసుగా తీసుకుని మాజీ మంత్రి గల్లా అనుచరుడు ఆ భూమిని కబ్జా చేసేశారు. అడ్డుకుంటున్నది ఏ శక్తో..? ఎట్టేరి గుట్టను సోమ్‌ప్రకాష్ కబ్జా చేయడంపై సెప్టెంబరు 1న అప్పటి ఇన్చార్జ్ కలెక్టర్ శ్రీధర్‌కు కుంట్రపాకం గ్రామీణులు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై స్పందించిన ఇన్చార్జ్ కలెక్టర్.. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేసి, నివేదిక ఇవ్వాలని తిరుపతి రూరల్ తహశీల్దార్ యుగంధర్‌ను ఆదేశించారు. ఎట్టేరి గుట్టను సర్వే చేసిన తహశీల్దార్ యుగంధర్ సర్వే నెంబర్ 612లోని 131.45 ఎకరాల ప్రభుత్వ పోరంబోకు(గయాలు) భూమిలో దేవాలయాలు, దేవుడి విగ్రహాలతో గుట్టకు ఒక వైపు ప్రహరీ గోడ నిర్మించారని.. పూర్తి స్థాయి నివేదికను త్వరలోనే సమర్పిస్తానని సెప్టెంబర్ 19న కలెక్టర్ సిద్ధార్థ్ జైన్‌కు నివేదిక సమర్పించారు. కానీ.. గుట్టపై అతిథిగృహం నిర్మించడం, ప్రహరీ గేటుకు తాళం వేయడం.. పశువులను సైతం గుట్టపైకి వెళ్లకుండా అడ్డగిస్తుండటం.. గుట్టపై యథేచ్ఛగా కొనసాగుతున్న నిర్మాణాలను గురించి నివేదికలో తహశీల్దార్ యుగంధర్ పేర్కొనకపోవడం అనుమానాలకు తావిస్తోంది. సమగ్ర విచారణ చేసి, నివేదిక ఇవ్వకుండా తహశీల్దార్ యుగంధర్‌ను ఏ శక్తి అడ్డుకుంటోందన్నది బహిరంగ రహస్యమే..! ఇదే అంశంపై తహశీల్దార్ యుగంధర్‌ను ‘సాక్షి’ సంప్రదించగా.. ‘బ్రహ్మోత్సవాల విధుల్లో ఉన్నా.. ఇప్పుడు ఆ అంశంపై స్పందించ లేను’ అంటూ సమాధానం దాటవేశారు. దాడులకు తెగబడుతున్న వైనం.. ఎట్టేరి గుట్టను కబ్జా చేయడంపై మాజీ మంత్రి గల్లా అనుచరుడు సోమ్‌ప్రకాష్‌ను మంగళవారం కుంట్రపాకం గ్రామీణులు నిలదీశారు. ఇంతలోనే అక్కడికి చేరుకున్న కుంట్రపాకం మాజీ సర్పంచు, గల్లా అనుచరుడైన టీడీపీ నేత బ్రహ్మానందరెడ్డి అలియాస్ బుజ్జిరెడ్డి తన అనుయాయులతో కలిసి గ్రామీణులపై దాడి చేయడం గమనార్హం. ఎట్టేరి గుట్టను అభివృద్ధి చేస్తోంటే అడ్డుకోవడానికి మీరెవరంటూ గ్రామీణులను టీడీపీ నేతలు ప్రశ్నించడం కొసమెరుపు. ఏడుకొండలపై వెంకన్నకు హక్కుందా? -ఎస్.సోమ్‌ప్రకాష్, మాజీ మంత్రి గల్లా అనుచరుడు ఎట్టేరి గుట్ట కబ్జాపై ఎస్.సోమ్‌ప్రకాష్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా.. ‘మొన్నటి దాకా ఏడు కొండలపై వెంకన్న స్వామికి ఏమైనా హక్కు ఉండేదా? వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించాక ఏడు కొండలను వెంకన్నకు రాసిచ్చారు. రాష్ట్రంలో పది లక్షలకుపైగా దేవాలయాలు ఉంటాయి. ఆ దేవాలయాలకు ఎవరూ భూములను కేటాయించలేదు. ఇప్పుడు ఎట్టేరి గుట్టపై సర్వేశ్వర ఆలయాన్ని నిర్మిస్తున్నా. గ్రామస్తులు ఆలయాలను నిర్మించుకున్నారు.. వారికి ఆర్థిక సహాయం మాత్రమే చేస్తున్నా. నేను పట్టించుకోపోతే మైనింగ్ పేరుతో ఈ గుట్టను కొల్లగొట్టేవారు’ అంటూ చెప్పుకొచ్చారు. ఎట్టేరి గుట్టపైకి మేత కోసం పశువులను ఎందుకు అనుమతించడం లేదని ప్రశ్నిస్తే సమాధానం దాటవేయడం గమనార్హం. -
తమ్ముళ్ల అపచారం... సరిదిద్దిన ఈవో
అర్ధనగ్నంగా సారె తీసుకెళ్లిన తెలుగు తమ్ముళ్లు సంప్రదాయూన్ని నిలబెట్టిన ఈవో ఆలయ నియమాలతో సారె సమర్పించిన ఎమ్మెల్యే తిరుపతి రూరల్: పాకాల మండలం ఊట్లవారిపల్లెగుట్టలో కొలువైన శ్రీసుబ్రమణ్యస్వామి ఆలయంలో ఆదివారం అపచారం చోటుచేసుకుంది. సంప్రదాయాలకు, కాణిపాక శ్రీవరసిద్ధి వినాయక స్వామి సారె పవిత్రతకు భంగం వాటిల్లే విధంగా మాజీ మంత్రి గల్లా అరుణకుమారి అనుచరులు వ్యవహరించారు. సంప్రదాయూనికి విరుద్ధంగా ఎమ్మెల్యే వచ్చేలోగా సారె సమర్పించాలనే దురాలోచనతో పంచెలు ఊడిపోయి అర్ధనగ్నంగా పరుగులు తీశారు. వీరి వాలకం చూసి భక్తులు అసహ్యించుకున్నారు. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి ఆలయం నుంచి ప్రతి ఏడాదీ పట్టు వస్త్రాలు, సారె తీసుకురావడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ఆదివారం కాణిపాక శ్రీవరసిద్ధి వినాయకస్వామి ఆలయం నుంచి ఊట్లవారిపల్లె కొండపై కొలువైన శ్రీసుబ్రమణ్యస్వామి ఆలయానికి అధికారులు సారెను తీసుకొచ్చారు. ఈ సారెను చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేసి అధికారులతో కలిసి తీసుకెళ్లాల్సి ఉంది. అయితే మాజీ మంత్రి గల్లా అరుణకుమారి అనుచరులు, కొంత మంది టీడీపీ నేతలు సారెను తీసుకొచ్చిన కాణిపాకం ఆలయ అధికారుల వాహనాలపై దాడిచేశారు. ఈవో వచ్చేవరకు సారె ఇవ్వకపోవడంతో తమ్ముళ్లు ఆగ్రహానికి గురయ్యారు. అధికారులపై దౌర్జన్యం చేశారు. ఆపై అధికారుల నుంచి సారె లాక్కుని కొండపైకి పరుగులు తీశారు. ఈ క్రమంలో సంప్రదాయ దుస్తుల్లో ఉన్న తమ్ముళ్ల పంచెలు ఊడిపోయాయి. అర్ధనగ్నంగా ఉన్నా లెక్కచేయకుండా సారెను తీసుకెళ్లి ఆలయం ముందు పెట్టి అక్కడి నుంచి వచ్చేశారు. అరుణమ్మ హుందాగా వ్యవహరించాలి రాజకీయాలు చేసేందుకు చాలా వేదికలున్నాయి. ప్రజల్లో బలముంటే అక్కడ తేల్చుకోవాలేతప్ప దైవ కైంకర్యాల్లో తలదూర్చడం మంచిది కాదు. ముప్పయ్యేళ్ల రాజకీయ అనుభవం, డెబ్బయ్యేళ్ల వయసున్న అరుణకుమారి చిన్నపిల్లలా వ్యవహరించడం పద్ధతికాదు. ఇకనైనా ఆమె ఇలాంటి పనులు మానుకోవాలి. భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా తన అనుచరులను రెచ్చగొట్టడం మంచిది కాదు. - చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సాంప్రదాయూన్ని పాటించిన ఈవో అనంతరం ఆలయూనికి చేరుకున్న ఈవో సీతారామిరెడ్డి గుట్టపై ఉన్న ఆలయం ముందు పెట్టిన సారెను కిందకు తీసుకువచ్చారు. ఆలయూనికి విచ్చేసిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి దంపతులకు మేళతాళాల నడుమ వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ నిబంధనల మేరకు చెవిరెడ్డి దంపతులు గుట్ట కింద ఉన్న వినాయకుడి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతర సారెను తీసుకుని వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ గుట్టపైకి చేరుకున్నారు. ఆలయ ప్రదక్షిణ అనంతరం ఈవో సీతారామిరెడ్డి, స్థానిక తహశీల్దార్, రెవెన్యూ, పంచాయతీ అధికారుల సమక్షంలో సారెను స్వామివారికి సంప్రదాయబద్దంగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి దంపతులు సమర్పించారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తాం: ఈవో సీతారామిరెడ్డి ఆలయం వద్ద సాంప్రదాయానికి, నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. భక్తుల మనోభావాలు దెబ్బతినే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించం. ఆదివారం జరిగిన సంఘటనపై ఉన్నతాధికారుల సూచనల మేరకు పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. -
తెలుగు తమ్ముళ్లపై గల్లా అనుచరుల దాడి
చంద్రగిరి, న్యూస్‌లైన్ : తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా చంద్రగిరి నియోజకవర్గంలోని తమ్ముళ్లకు మాజీ మంత్రి గల్లా అరుణకుమారి అనుచరుల చేతుల్లో దెబ్బలు తప్పడం లేదు. గతంలో అధికార కాంగ్రెస్‌లో ఉంటూ టీడీపీ నేతలపై కేసులు గొడవలతో నానా ఇబ్బంది పెట్టిన వ్యక్తులు ఇప్పుడు టీడీపీలో చేరి అదే దందా కొనసాగిస్తున్నారు. కరుడుగట్టిన టీడీపీ వాదులను గల్లా అనుచరులు టార్గెట్ చేస్తున్నారు. దీంతో తమ్ముళ్లలో నిర్వేదం మొదలైంది. వివరాలిలా.. టీడీపీ అధికారంలోకి రావడంతో చంద్రగిరి నియోజకవర్గంలో మొదటి నుంచీ తెలుగుదేశంలో ఉన్న నాయకులను గల్లా అనుచరులు టార్గెట్ చేశారు. ఇతర కారణాలు చూపించి వారి పైకి దాడికి దిగుతున్నారు. గత ఎన్నికల్లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే కారణం చూపి దాడి చేస్తున్నారు. బుధవారం సాయంత్రం చంద్రగిరి పోలీస్ స్టేషన్‌కు ఎదురుగా అందరూ చూస్తుండగానే గల్లా అనుచరులు టీడీపీలో జిల్లా స్థాయి నేతపై దాడికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని బాధితుడు మరో టీడీపీ నాయకుడికి ఫోన్లో తెలిపాడు. ఆ టీడీపీ నేత హుటాహుటిన అక్కడకు చేరుకుని దాడిని తీవ్రంగా ఖండించారు. ఎలా దాడి చేస్తారని ప్రశ్నించారు. ‘నువ్వెవడ్రా అడగటానికి’ అంటూ అతనిపై సైతం గల్లా అనుచరులు దాడికి దిగారు. దీంతో ఖంగుతిన్న తమ్ముళ్లు చేసేదిలేక అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో నిజమైన టీడీపీ కార్యకర్తల్లో అసంతృప్తి నెలకొంది. రాజకీయ భవిష్యత్ లేక టీడీపీ పంచన చేరిన వ్యక్తులు తమపై ఎలా దాడి చేస్తారని లోలోన మధన పడుతున్నారు. దీనిపై తమ్ముళ్లల్లో ఆందోళన మెదలైంది. పార్టీ అధికారంలోకి వచ్చినా ఇన్నిరోజులు ఇబ్బందులు పడ్డ వారి నుంచే మళ్లీ దెబ్బలుతినే పరిస్థితి రావడంపై నిజమైన కార్యకర్తల్లో నిరాశ, నిర్వేదం మొదలయ్యాయి. ఈ విషయాన్ని పార్టీ అధినాయకుడి దృష్టికి తీసుకెళ్లేందుకు తమ్ముళ్లు సిద్ధమవుతున్నారు.