‘పచ్చ’డేగల ‘గుట్ట’కాయ స్వాహా | tdp leaders doing land kabjas in tirupati | Sakshi
Sakshi News home page

‘పచ్చ’డేగల ‘గుట్ట’కాయ స్వాహా

Published Wed, Oct 1 2014 3:27 AM | Last Updated on Fri, Aug 10 2018 9:40 PM

‘పచ్చ’డేగల ‘గుట్ట’కాయ స్వాహా - Sakshi

‘పచ్చ’డేగల ‘గుట్ట’కాయ స్వాహా

కబ్జాకు కాదేదీ అనర్హమని టీడీపీ నేతలు చాటిచెబుతున్నారు. గుట్టలూ పుట్టలను కూడా వదలడం లేదు. తిరుపతి రూరల్ మండలం కుంట్రపాకంలోని ఎట్టేరి గుట్టను మాజీ మంత్రి గల్లా అరుణకుమారి అనుచరుడు ఎస్.సోమ్‌ప్రకాష్ కబ్జా చేశారు. ఎట్టేరి గుట్ట కబ్జాపై మంగళవారం ప్రశ్నించిన కుంట్రపాకం గ్రామస్తులపై గల్లా అనుచరులు దాడి చేశారు. రూ.65 కోట్ల విలువైన భూమిని టీడీపీ నేత కబ్జా చేసినా రెవెన్యూ అధికారులు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తుండటం గమనార్హం.
 

సాక్షి ప్రతినిధి, తిరుపతి/తిరుపతి రూరల్: ఆధ్యాత్మిక నగరం తిరుపతి పరిసర ప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ప్రభుత్వ భూములను కబ్జా చేసి.. కోట్లాది రూపాయలు కాజేసేందుకు టీడీపీ నేతలు పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో తిరుపతి రూరల్ మండలం కుంట్రపాకంలో సర్వే నెంబరు 612లో 119.45 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఎట్టేరి గుట్టపై మాజీ మంత్రి గల్లా అరుణకుమారి అనుచరుడు ఎన్.సోమ్‌ప్రకాష్ కళ్లు పడ్డాయి. ఆ గుట్ట భూమిని ఎలాగైలా కాజేసేందుకు వ్యూహం రచించారు.

ఎట్టేరి గుట్ట కింద భాగంలో ఉన్న 2.50 ఎకరాలకుపైగా ప్రైవేటు భూమిని కొనుగోలు చేశారు. ఆ తర్వాత ఎట్టేరి గుట్టలో ప్రహరీ గోడ నిర్మించి.. దానిపై దేవతా విగ్రహాలను ఏర్పాటుచేశారు. గుట్టపై అధునాతన సదుపాయాలతో అతిథిగృహాన్ని నిర్మించుకున్నారు. ఎట్టేరిగుట్టపై ఆశ్రమాన్ని ఏర్పాటు చేశాన నే భావనను కలిగించిన సోమ్‌ప్రకాష్.. ప్రహరీగేటుకు తాళంవేసి, భూమిని కబ్జా చేశారు. ఆ గుట్టపైకి ఎవరినీ అనుమతించడం లేదు. తరతరాలుగా కుంట్రపాకం గ్రామీణులు తమ పశువులను మేత కోసం ఆ గుట్టకు తీసుకెళ్లేవారు. ఇప్పుడు సోమ్‌ప్రకాష్ అనుమతించిక పోవడం గమనార్హం.

తుడా అలసత్వమే సాకుగా..
ఎట్టేరి గుట్టలో చెట్లను పెంచి.. పర్యావరణాన్ని కాపాడతామని ఆ భూమిని అప్పగించాలని తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ(తుడా) 2007లో ప్రభుత్వాన్ని కోరింది. తుడా ప్రతిపాదన మేరకు ఆ భూమిని అప్పగించేందుకు ప్రభుత్వం సమ్మతించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎట్టేరి గుట్టను సర్వే చేసిన రెవెన్యూ అధికారులు 612 సర్వే నెంబర్‌లో విస్తరించిన 131.45 ఎకరాల భూమిని మూడు సబ్ డివిజన్‌లుగా వర్గీకరించారు. ఇందులో సర్వే నెంబర్ 612/2లో 10.19 ఎకరాలు, సర్వే నెంబర్ 612/3లో 1.81 ఎకరాలో మొత్తం 12 ఎకరాల్లో కాటమరాజు గుడి, ధర్మాచరణ మండలి, ఎల్లమ్మ గుడి, విఘ్నేశ్వరస్వామి గుడి, ఆంజనేయస్వామి గుడి, రాతిస్తంభాల మండపం, ముస్లిం ఈద్గా, పూర్ణచంద్రరావు క్వారీ, వసుమతి సర్వేశ్వర గుడి, శ్రీకృష్ణ గీతా మందిరాన్ని గ్రామీణులు నిర్మించుకున్నట్లు రెవెన్యూ అధికారులు తేల్చారు. సర్వే నెంబరు 612/1లో ఖాళీగా ఉన్న 119.45 ఎకరాల భూమిని తుడాకు అప్పగించాలని డిసెంబర్ 13, 2007న అప్పటి కలెక్టర్ ఉత్తర్వులు జారీచేశారు. కానీ.. ఆ భూమిని అప్పగించాలని కోరిన తుడా ఇప్పటిదాకా ఆ భూమిని స్వాధీనం చేసుకోకపోవడం గమనార్హం. ఇదే అలుసుగా తీసుకుని మాజీ మంత్రి గల్లా అనుచరుడు ఆ భూమిని కబ్జా చేసేశారు.

అడ్డుకుంటున్నది ఏ శక్తో..?
ఎట్టేరి గుట్టను సోమ్‌ప్రకాష్ కబ్జా చేయడంపై సెప్టెంబరు 1న అప్పటి ఇన్‌చార్జ్ కలెక్టర్ శ్రీధర్‌కు కుంట్రపాకం గ్రామీణులు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై స్పందించిన ఇన్‌చార్జ్ కలెక్టర్.. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేసి, నివేదిక ఇవ్వాలని తిరుపతి రూరల్ తహశీల్దార్ యుగంధర్‌ను ఆదేశించారు. ఎట్టేరి గుట్టను సర్వే చేసిన తహశీల్దార్ యుగంధర్ సర్వే నెంబర్ 612లోని 131.45 ఎకరాల ప్రభుత్వ పోరంబోకు(గయాలు) భూమిలో దేవాలయాలు, దేవుడి విగ్రహాలతో గుట్టకు ఒక వైపు ప్రహరీ గోడ నిర్మించారని.. పూర్తి స్థాయి నివేదికను త్వరలోనే సమర్పిస్తానని సెప్టెంబర్ 19న కలెక్టర్ సిద్ధార్థ్ జైన్‌కు నివేదిక సమర్పించారు.

కానీ.. గుట్టపై అతిథిగృహం నిర్మించడం, ప్రహరీ గేటుకు తాళం వేయడం.. పశువులను సైతం గుట్టపైకి వెళ్లకుండా అడ్డగిస్తుండటం.. గుట్టపై యథేచ్ఛగా కొనసాగుతున్న నిర్మాణాలను గురించి నివేదికలో తహశీల్దార్ యుగంధర్ పేర్కొనకపోవడం అనుమానాలకు తావిస్తోంది. సమగ్ర విచారణ చేసి, నివేదిక ఇవ్వకుండా తహశీల్దార్ యుగంధర్‌ను ఏ శక్తి అడ్డుకుంటోందన్నది బహిరంగ రహస్యమే..! ఇదే అంశంపై తహశీల్దార్ యుగంధర్‌ను ‘సాక్షి’ సంప్రదించగా.. ‘బ్రహ్మోత్సవాల విధుల్లో ఉన్నా.. ఇప్పుడు ఆ అంశంపై స్పందించ లేను’ అంటూ సమాధానం దాటవేశారు.
 
దాడులకు తెగబడుతున్న వైనం..

ఎట్టేరి గుట్టను కబ్జా చేయడంపై మాజీ మంత్రి గల్లా అనుచరుడు సోమ్‌ప్రకాష్‌ను మంగళవారం కుంట్రపాకం గ్రామీణులు నిలదీశారు. ఇంతలోనే అక్కడికి చేరుకున్న కుంట్రపాకం మాజీ సర్పంచు, గల్లా అనుచరుడైన టీడీపీ నేత బ్రహ్మానందరెడ్డి అలియాస్ బుజ్జిరెడ్డి తన అనుయాయులతో కలిసి గ్రామీణులపై దాడి చేయడం గమనార్హం. ఎట్టేరి గుట్టను అభివృద్ధి చేస్తోంటే అడ్డుకోవడానికి మీరెవరంటూ గ్రామీణులను టీడీపీ నేతలు ప్రశ్నించడం కొసమెరుపు.
 
ఏడుకొండలపై వెంకన్నకు హక్కుందా?
-ఎస్.సోమ్‌ప్రకాష్, మాజీ మంత్రి గల్లా అనుచరుడు

 
ఎట్టేరి గుట్ట కబ్జాపై ఎస్.సోమ్‌ప్రకాష్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా.. ‘మొన్నటి దాకా ఏడు కొండలపై వెంకన్న స్వామికి ఏమైనా హక్కు ఉండేదా? వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించాక ఏడు కొండలను వెంకన్నకు రాసిచ్చారు. రాష్ట్రంలో పది లక్షలకుపైగా దేవాలయాలు ఉంటాయి. ఆ దేవాలయాలకు ఎవరూ భూములను కేటాయించలేదు. ఇప్పుడు ఎట్టేరి గుట్టపై సర్వేశ్వర ఆలయాన్ని నిర్మిస్తున్నా. గ్రామస్తులు ఆలయాలను నిర్మించుకున్నారు.. వారికి ఆర్థిక సహాయం మాత్రమే చేస్తున్నా. నేను పట్టించుకోపోతే మైనింగ్ పేరుతో ఈ గుట్టను కొల్లగొట్టేవారు’ అంటూ చెప్పుకొచ్చారు. ఎట్టేరి గుట్టపైకి మేత కోసం పశువులను ఎందుకు అనుమతించడం లేదని ప్రశ్నిస్తే సమాధానం దాటవేయడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement