‘పచ్చ’ మార్క్.. బది‘లీల’లు | tdp leaders have inner conflicts | Sakshi
Sakshi News home page

‘పచ్చ’ మార్క్.. బది‘లీల’లు

Published Wed, Nov 26 2014 1:39 AM | Last Updated on Wed, Apr 3 2019 5:55 PM

‘పచ్చ’ మార్క్.. బది‘లీల’లు - Sakshi

‘పచ్చ’ మార్క్.. బది‘లీల’లు

* టీడీపీలో ఆధిపత్య పోరుకు ఆజ్యం పోసిన ఉన్నతాధికారుల నియామకం
* డ్వామా పీడీ నియామకంలో చక్రం తిప్పిన మాజీ మంత్రి గల్లా అరుణకుమారి
* జెడ్పీ సీఈవోగా చంద్రమౌళిని నియమించడంపై మంత్రి బొజ్జల తీవ్ర అసహనం

 
సాక్షి ప్రతినిధి, తిరుపతి: జిల్లా ఉన్నతాధికారుల బదిలీల ప్రక్రియ అధికార టీడీపీలో ఆధిపత్య పోరుకు ఆజ్యం పోసింది. కీలకస్థానాల్లో ఆడించి నట్టల్లా ఆడే అధికారిని నియమించుకుంటే పాల నను గుప్పిట్లో పెట్టుకోవచ్చన్నది టీడీపీ ప్రజాప్రతినిధుల ఎత్తుగడ. తద్వారా అటు పార్టీపై.. ఇటు జిల్లాపై ఆధిపత్యం చెలాయించవచ్చన్నది వారి వ్యూహం. మొన్న డీఆర్వో నియామకం మంత్రి బొజ్జల, మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమల మధ్య నిప్పు రాజేస్తే.. ఇప్పుడు జెడ్పీ సీఈవో బదిలీ మంత్రి బొజ్జల, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి మధ్య విభేదాలకు ఆజ్యం పోస్తోంది. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. పరిపాలనను గుప్పిట్లో పెట్టుకునేందుకు అధికారుల బదిలీలకు శ్రీకారం చుట్టింది.

కలెక్టర్ నుంచి గ్రామ కార్యదర్శి వరకూ తమ మాట వినేవారినే నియమించుకోవడానికి టీడీపీ ప్రజాప్రతినిధులు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఇది ఆ పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరుకు దారితీసింది. జిల్లా రెవెన్యూ అధికారిగా విజయ్‌చందర్‌ను నియమించాలని మాజీ మంత్రి గాలి, ఎం.వెంకటేశ్వరరావును నియమించాలంటూ మంత్రి బొజ్జల పట్టుబట్టారు. ఈ ఇద్దరి మధ్య వివాదం కొనసాగుతుండగానే.. అత్యంత కీలకమైన జిల్లా నీటి యాజమాన్య సంస్థ(డ్వామా) పీడీగా రాజశేఖర్‌నాయుడిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ నియామకంపై మంత్రి బొజ్జల కన్నెర్ర చేశారు.

మాజీ మంత్రి గల్లా అరుణకుమారికి అత్యంత సన్నిహితుడిగా ముద్రపడిన రాజశేఖర్‌నాయుడిని డ్వామా పీడీగా నియమించడంపై కినుక వహించిన బొజ్జల.. జెడ్పీ సీఈవో, డీఆర్డీఏ పీడీ తదితర కీలక స్థానాల్లో తన మాట వినే అధికారులను నియమించుకోవడానికి వ్యూహం రచించారు. జెడ్పీ సీఈవోగా వేణుగోపాల్‌రెడ్డినే కొనసాగించాలని చైర్‌పర్సన్ గీర్వాణి చేసిన ప్రతిపాదనకు బొజ్జల అంగీకరించారు. ఈలోగా జెడ్పీ సీఈవోను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. వేణుగోపాల్‌రెడ్డి స్థానంలో గతంలో జిల్లాలో డీఆర్డీఏ పీడీగా పనిచేసిన చంద్రమౌళిని నియమించింది. ఈ నియామకం విషయంలోనూ మాజీ మంత్రి గల్లా హస్తం ఉన్నట్లు బొజ్జల వర్గీయులు చెబుతున్నారు. జెడ్పీ సీఈవోగా చంద్రమౌళి నియామకంపై కన్నెర్ర చేసిన బొజ్జల.. వేణుగోపాల్‌రెడ్డిని రిలీవ్ చేయొద్దంటూ కలెక్టర్‌ను ఆదేశించారు.

దాంతో చంద్రమౌళి జెడ్పీ సీఈవోగా బాధ్యతలు చేపట్టకుండా మోకాలడ్డినట్లయింది. డీఆర్డీఏ పీడీ రవిప్రకాష్‌రెడ్డికీ స్థానభ్రంశం కల్పించడానికి టీడీపీ ప్రజాప్రతినిధులు పావులు కదుపుతున్నారు. డ్వామా పీడీగా నియమితులైన రాజశేఖర్‌నాయుడు డీఆర్డీఏ పీడీ పోస్టును దక్కించుకునేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇప్పుడు డీఆర్డీఏ పీడీగా తన మాట వినే అధికారినే నియమించుకోవడానికి అటు ఎంపీ శివప్రసాద్.. ఇటు మాజీ మంత్రి గల్లా.. మరో వైపు మంత్రి బొజ్జల ప్రయత్నిస్తున్నారు. టీడీపీ ప్రజాప్రతినిధుల ఆధిపత్య పోరుకు ఉన్నతాధికారుల నియామకం వేదికగా మారడంతో పరిపాలన అస్తవ్యస్తంగా మారిపోయిందని అధికారవర్గాలు పేర్కొంటుండడం గమనార్హం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement