chandra mouli
-
అపోహలు వద్దు.. త్వరలో తిరిగి వస్తా
శాంతిపురం : తన ఆరోగ్య పరిస్థితిపై అనవసరమైన అపోహలు, వదంతులను పట్టించుకోవద్దని వైఎస్సార్సీపీ కుప్పం ఎమ్మెల్యే అభ్యర్థి చంద్రమౌళి ప్రజలు, పార్టీ శ్రేణులకు తెలిపారు. హైదరాబాదులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఈ మేరకు తెలుగు, తమిళ భాషల్లో రెండు వీడియోలను సోమవారం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీడియోలోని చంద్రమౌళి మాటలు యథాతధంగా..‘కుప్పం ప్రజలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోదర సోదరీమణులు, మిత్రులు అందరికీ నమస్కారాలు. రెండు రోజుల క్రితం జగన్మోహనరెడ్డిగారు నన్ను పరామర్శించటానికి ఆస్పత్రికి వచ్చిన సమయంలో పడుకుని ఉన్నాను. అదే ఫొటోలు మీడియాలో వచ్చాయి. వాటిని చూసి చాలా మంది నా ఆరోగ్యం క్షీణించిందని అపోహకు గురయ్యారని తెలిసింది. దీనిపై వస్తున్న అనేక కామెంట్లకు సరైన జవాబు ఇవ్వాలని అనుకుంటున్నాను. జగన్ గారు రావటానికి ముందే వైద్యచికిత్సలో భాగంగా ఓ ప్రక్రియకు వెళ్లిరావటంతో పడుకునే తనతో మాట్లాడాల్సి వచ్చింది. అంతే తప్ప, మరో ఇబ్బంది లేదు. ఆస్పత్రిలో నేను బాగా కోలుకుంటున్నాను. చికిత్స దృష్ట్యా దాదాపు నెల రోజులకు పైగా మీకు దూరంగా ఉంటున్నాను. త్వరలో సంపూర్ణ ఆరోగ్యంతో మీ మధ్యకు వచ్చి అందరితో కలిసి కుప్పంలో పని చేస్తాను’. -
చంద్రమౌళి విడుదలకు రంగం సిద్ధం
భీమదేవరపల్లి: మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్పూర్ జైలులో జీవితఖైదు అనుభవిస్తున్న మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు ఉగ్గె చంద్రమౌళి అలియాస్ మదన్‌లాల్ శిక్షను రద్దు చేస్తూ బాల్గఢ్ కోర్టు రెండ్రోజుల క్రితం తీర్పు ఇచ్చింది. దీంతో చంద్రమౌళి విడుదలకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆయన 14 ఏళ్లుగా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర జైళ్లలో శిక్ష అనుభవి స్తున్నారు. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం మాణిక్యాపూర్కి చెందిన ఉగ్గె కనకయ్య–సూరమ్మ దంపతుల పెద్ద కుమారుడు చంద్రమౌళి ఏడో తరగతి వరకు స్వగ్రామంలో చదివి పైచదువులకు హుజురాబాద్‌కు వెళ్లాడు. పదో తరగతి చదువుతున్న రోజుల్లోనే పీపుల్స్‌వార్ గ్రూప్ నక్సలైట్ ఉద్యమానికి ఆకర్షితుడై సానుభూతిపరుడిగా పనిచేశారు. విప్లవోద్యమానికి ఆకర్షితుడై 1981లో అడవిబాట పట్టాడు. దళ సభ్యుడిగా పనిచేస్తూ అనతికాలంలోనే హుస్నాబాద్, హుజురాబాద్ సీవోగా పనిచేశారు. రాష్ట్ర,కేంద్ర కమిటీల సభ్యుడిగా నియమితులయ్యారు. 2005 ఆగస్టు 6న మహారాష్ట్రలోని నాగపూర్‌లో అరెస్టు అయ్యాడు. చంద్రమౌళిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రాలలో సుమారు 40 కేసులు ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లోని అప్పటి రవాణశాఖ మంత్రి హత్య చేసిన కేసులో ప్రధాన నిందితునిగా చంద్రమౌళిని పేర్కొంటూ 2015 ఆగస్టు 14న జీవిత ఖైదు విధిస్తూ బాలగఢ్ కోర్టు తీర్పు ఇచ్చింది. -
నటుడు చంద్రమౌళి కన్నుమూత
సీనియర్ నటుడు, డబ్బింగ్ కళాకారుడు చంద్రమౌళి గురువారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. చిత్తూరు జిల్లా కుమ్మరి కండ్రిగలో జన్మించారు చంద్రమౌళి. ప్రముఖ నటుడు మోహన్‌బాబు తండ్రి నారాయణస్వామి వద్ద చంద్రమౌళి, ఆయన అన్నయ్య 5వ తరగతి వరకూ చదువుకున్నారు. మేనమామ ప్రేరణతో 20 ఏళ్లకే నాటకాలంటే ఆయనకు మక్కువ ఏర్పడింది. దాంతో 1971లో మద్రాసు వెళ్లిన ఆయనకు ‘అంతా మన మంచికే’ చిత్రంలో వేషం దొరికింది. అప్పటి నుంచి సుమారు 200 సినిమాల్లో నటించారాయన. 45 ఏళ్లకు పైబడిన తన సినీ ప్రస్థానంలో నటుడిగా విభిన్న పాత్రలు పోషిస్తూనే, డబ్బింగ్ కళాకారుడిగానూ పేరు తెచ్చుకున్నారు.పలు టీవీ సీరియల్స్‌లోనూ నటించారు. సినిమాల్లో ఆయన చిన్న చిన్న పాత్రల్లో నటించినా తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితమే. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజులతో పాటు నేటి అగ్ర నటులందరి సినిమాల్లోనూ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు పాత్రలు పోషించి, తనదైన గుర్తింపు తెచ్చుకున్నారాయన. ఎన్ని సినిమాలు చేసినా పేద, మధ్య తరగతి పాత్రల్లో నటించిన ఆయనకు ఒక్కసారి కూడా తెరపై కోటీశ్వరుడిగా చూసుకునే అవకాశం దక్కలేదట. అయితే.. అందుకు ఏ మాత్రం బాధగా లేదని పలు సందర్భాల్లో చెప్పారాయన. చంద్రమౌళికి ఇద్దరు కుమారులున్నారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ, టీవీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. -
చంద్రమౌళి ఎవరు?
రాజమౌళి అంటే ఇప్పుడు ప్రపంచం మొత్తం తెలుసు. కానీ, తమిళ సినిమాల్లో హూ ఈజ్ మిస్టర్ చంద్రమౌళి? స్క్రీన్‌పై అతని కథ ఏంటి? అంటే.. ఇప్పుడే చెబితే కిక్ ఏముంటుంది? సినిమాకు ఇప్పుడేగా కొబ్బరికాయ కొట్టాం. గుమ్మడికాయ కొట్టి, దిష్టి తీసి థియేటర్లో బొమ్మ వేసేంత వరకూ ఆగండి అంటున్నారు రెజీనా. అయినా చంద్రమౌళితో రెజీనాకు రిలేషన్ ఏంటి? అనేగా మీ డౌట్. అక్కడికే వస్తున్నాం. తిరుకృష్ణమూర్తి దర్శకత్వంలో తండ్రి కార్తీక్, తనయుడు గౌతమ్ కార్తీక్, రెజీనా ముఖ్య పాత్రల్లో చేస్తున్న సినిమా ప్రారంభోత్సవం ఇటీవల చెన్నైలో జరిగింది. ఈ సినిమాకు ‘మిస్టర్ చంద్రమౌళి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారని కోలీవుడ్ ఖబర్. -
ఎంపీటీసీపై కత్తితో దాడి చేసిన తమ్ముడు
కుటుంబ కలహాల నేపథ్యంలో వరుసకు అన్నయ్య అయిన ఎంపీటీసీ పై తమ్ముడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఎంపీటీసీని ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలులో బుధవారం చోటుచేసుకుంది. స్థానిక ఎంపీటీసీ చంద్రమౌళి(35)పై వరుసకు తమ్ముడైన సత్యనారాయణ కత్తితో దాడి చేశాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. వీరి మధ్య గత కొన్ని రోజులుగా ఆస్తి విషయంలో గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
టెక్కలిలో వివాహిత ఆత్మహత్య
టెక్కలి: శ్రీకాకుళం జిల్లాలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. టెక్కలి పట్టణానికి చెందిన చంద్రమౌళి, నాగమణి దంపతులకు రెండేళ్ల క్రితం వివాహమైంది. వారికి 9 నెలల బాబు ఉన్నాడు. చంద్రమౌళి స్థానికంగా ఓ ప్రైవేట్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం సాయంత్రం అతడు విధులకు వెళ్లిన సమయంలో నాగమణి ఇంట్లో ఉరేసుకుంది. భర్త తిరిగి ఇంటికి వచ్చే సరికి ఆమె ఉరికి వేలాడుతోంది. కిందికి దింపి చూడగా ఆమె అప్పటికే చనిపోయింది. చంద్రమౌళి సమాచారం మేరకు నాగమణి కుటుంబసభ్యులు అక్కడికి చేరుకున్నారు. కట్నం కోసం చంద్రమౌళి పెట్టే మానసిక వేధింపులు భరించలేకే నాగమణి ఆత్మహత్యకు పాల్పడిందని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
‘పచ్చ’ మార్క్.. బది‘లీల’లు
* టీడీపీలో ఆధిపత్య పోరుకు ఆజ్యం పోసిన ఉన్నతాధికారుల నియామకం * డ్వామా పీడీ నియామకంలో చక్రం తిప్పిన మాజీ మంత్రి గల్లా అరుణకుమారి * జెడ్పీ సీఈవోగా చంద్రమౌళిని నియమించడంపై మంత్రి బొజ్జల తీవ్ర అసహనం సాక్షి ప్రతినిధి, తిరుపతి: జిల్లా ఉన్నతాధికారుల బదిలీల ప్రక్రియ అధికార టీడీపీలో ఆధిపత్య పోరుకు ఆజ్యం పోసింది. కీలకస్థానాల్లో ఆడించి నట్టల్లా ఆడే అధికారిని నియమించుకుంటే పాల నను గుప్పిట్లో పెట్టుకోవచ్చన్నది టీడీపీ ప్రజాప్రతినిధుల ఎత్తుగడ. తద్వారా అటు పార్టీపై.. ఇటు జిల్లాపై ఆధిపత్యం చెలాయించవచ్చన్నది వారి వ్యూహం. మొన్న డీఆర్వో నియామకం మంత్రి బొజ్జల, మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమల మధ్య నిప్పు రాజేస్తే.. ఇప్పుడు జెడ్పీ సీఈవో బదిలీ మంత్రి బొజ్జల, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి మధ్య విభేదాలకు ఆజ్యం పోస్తోంది. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. పరిపాలనను గుప్పిట్లో పెట్టుకునేందుకు అధికారుల బదిలీలకు శ్రీకారం చుట్టింది. కలెక్టర్ నుంచి గ్రామ కార్యదర్శి వరకూ తమ మాట వినేవారినే నియమించుకోవడానికి టీడీపీ ప్రజాప్రతినిధులు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఇది ఆ పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరుకు దారితీసింది. జిల్లా రెవెన్యూ అధికారిగా విజయ్‌చందర్‌ను నియమించాలని మాజీ మంత్రి గాలి, ఎం.వెంకటేశ్వరరావును నియమించాలంటూ మంత్రి బొజ్జల పట్టుబట్టారు. ఈ ఇద్దరి మధ్య వివాదం కొనసాగుతుండగానే.. అత్యంత కీలకమైన జిల్లా నీటి యాజమాన్య సంస్థ(డ్వామా) పీడీగా రాజశేఖర్‌నాయుడిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ నియామకంపై మంత్రి బొజ్జల కన్నెర్ర చేశారు. మాజీ మంత్రి గల్లా అరుణకుమారికి అత్యంత సన్నిహితుడిగా ముద్రపడిన రాజశేఖర్‌నాయుడిని డ్వామా పీడీగా నియమించడంపై కినుక వహించిన బొజ్జల.. జెడ్పీ సీఈవో, డీఆర్డీఏ పీడీ తదితర కీలక స్థానాల్లో తన మాట వినే అధికారులను నియమించుకోవడానికి వ్యూహం రచించారు. జెడ్పీ సీఈవోగా వేణుగోపాల్రెడ్డినే కొనసాగించాలని చైర్పర్సన్ గీర్వాణి చేసిన ప్రతిపాదనకు బొజ్జల అంగీకరించారు. ఈలోగా జెడ్పీ సీఈవోను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. వేణుగోపాల్‌రెడ్డి స్థానంలో గతంలో జిల్లాలో డీఆర్డీఏ పీడీగా పనిచేసిన చంద్రమౌళిని నియమించింది. ఈ నియామకం విషయంలోనూ మాజీ మంత్రి గల్లా హస్తం ఉన్నట్లు బొజ్జల వర్గీయులు చెబుతున్నారు. జెడ్పీ సీఈవోగా చంద్రమౌళి నియామకంపై కన్నెర్ర చేసిన బొజ్జల.. వేణుగోపాల్‌రెడ్డిని రిలీవ్ చేయొద్దంటూ కలెక్టర్‌ను ఆదేశించారు. దాంతో చంద్రమౌళి జెడ్పీ సీఈవోగా బాధ్యతలు చేపట్టకుండా మోకాలడ్డినట్లయింది. డీఆర్డీఏ పీడీ రవిప్రకాష్రెడ్డికీ స్థానభ్రంశం కల్పించడానికి టీడీపీ ప్రజాప్రతినిధులు పావులు కదుపుతున్నారు. డ్వామా పీడీగా నియమితులైన రాజశేఖర్‌నాయుడు డీఆర్డీఏ పీడీ పోస్టును దక్కించుకునేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇప్పుడు డీఆర్డీఏ పీడీగా తన మాట వినే అధికారినే నియమించుకోవడానికి అటు ఎంపీ శివప్రసాద్.. ఇటు మాజీ మంత్రి గల్లా.. మరో వైపు మంత్రి బొజ్జల ప్రయత్నిస్తున్నారు. టీడీపీ ప్రజాప్రతినిధుల ఆధిపత్య పోరుకు ఉన్నతాధికారుల నియామకం వేదికగా మారడంతో పరిపాలన అస్తవ్యస్తంగా మారిపోయిందని అధికారవర్గాలు పేర్కొంటుండడం గమనార్హం. -
YSRCP అభ్యర్ధి చంద్రమౌళి నామినేషన్ మహొత్సవం
-
కలగానే నజరానా
ఏకగ్రీవ పంచాయతీలకు అందని ప్రోత్సాహకం 7 నుంచి 15 లక్షలు ఇస్తామని చెప్పారు మార్గదర్శకాలు అందలేదు: డీపీవో చంద్రమౌళి సాక్షి, చిత్తూరు: ఏకగ్రీవ పంచాయతీలకు భారీగా నిధులిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం ఆ మాటే ఎత్తడం లేదు. నిధుల విడుదల కలగానే మారుతోంది. ఈ క్రమంలో అభివృద్ధి పనులపై సర్పంచ్‌లు ముందడుగు వేయలేకపోతున్నారు. జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో 2013 జూలై, ఆగస్టు నెలల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. ఏకగ్రీవ పంచాయతీలకు రూ.7 లక్షల నుంచి రూ.15 లక్షలు ఇస్తామని ప్రభుత్వం పేర్కొంది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పీలేరు సహా అన్ని నియోజకవర్గాల్లో పలు పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. రాజకీయాలకు అతీతంగా చాలా చోట్ల పంచాయతీ పాలకవర్గాలను ఏకగ్రీవం చేసుకున్నారు. అయితే ఎన్నికలు ముగిసి నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి నిధుల మాటలేదు. చేతులెత్తేసిన ప్రభుత్వం జిల్లాలో 2006లో జరిగిన ఎన్నికల్లో పంచాయతీలు ఏకగ్రీవం చేసుకున్నందుకు రూ.5 లక్షల చొప్పున నిధులు వచ్చాయి. జిల్లాలో 2013 ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీలు 293 ఉన్నాయి. వీటిల్లో వంద చోట్ల అభ్యర్థులు పోటీపడినా చివరి నిమిషంలో పంచాయతీకి ప్రోత్సాహక నిధులు అందుతాయన్న ఆశతో నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. అయితే ప్రభుత్వం నిధుల మంజూరు మాటే ఎత్తడం లేదు. నిధులు ఇచ్చివుంటే గ్రామాల్లో తాగునీటి పైపులైన్లు, బోర్ల ఏర్పాటు, రోడ్లు, మురుగునీటి కాలువల నిర్మాణం జరిగి ఉండేది. విడుదలైన నిధులివే పంచాయతీ ఎన్నికల అనంతరం 13వ ఆర్థిక సంఘం నిధులు రూ.17 కోట్లు విడుదలయ్యాయి. రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు రూ.5.6 కోట్లు అందజేశారు. వృత్తి, సీనరేజ్ పన్నుల రూపంలో రూ.1.5 కోట్లు జిల్లాలోని పంచాయతీలకు జనాభా ప్రాతిపాదికన కేటాయించారు. తలసరి గ్రాంట్ పంచాయతీల ఖాతాలకు ఇంకా జమకాలేదు. వీధిలైట్ల ఏర్పాటు, మంచినీటి పథకాలు, పారిశుద్ధ్య నిర్వహణకు ఈ నిధులను ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. సమాచారం లేదు ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహక నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు, మార్గదర్శకాలు అందలేదు. దీనిపై సమాచారమే లేదు. ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే ఏకగ్రీవ పంచాయతీలకు అందజేస్తాం. -వీఆర్.చంద్రమౌళి, ఇన్చార్జ్ డీపీవో, చిత్తూరు. -
నల్లబెల్లం వ్యాపారులపై కేసులు పెట్టండి
=నాటుసారా కేంద్రాలపై దాడులు చేయండి =ఎంఆర్పీకి విక్రయించకుంటే చర్యలు =ఎక్సైజ్ శాఖ కమిషనర్ అహ్మద్ నదీమ్ =5 జిల్లాల ఎక్సైజ్ అధికారులతో సమావేశం తిరుపతి క్రైం, న్యూస్‌లైన్: నాటుసారా తయారీదారులకు నల్లబెల్లం విక్రయించే వ్యాపారులపై కేసులు నమోదు చేయాలని, నాటుసారా తయారీని నిరోధంచాలని రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ అహ్మద్ నదీమ్ ఆదేశించారు. తిరుపతిలో బుధవారం కర్నూలు, వైఎస్సార్, అనంతపురం, చిత్తూరు, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల ఎక్సైజ్ డెప్యూటీ కమిషనర్లు, ఎక్సైజ్ సూపరింటెండెంట్లతో రాష్ట్ర కమిషనర్‌తో పాటు, ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ కమిషనర్ టి.ప్రసాద్ సమావేశమయ్యారు. ఎస్వీయూ ఆర్ట్స్ బ్లాక్ ఆడిటోరియంలో జరిగిన సమావేశంలో అహ్మద్ నదీమ్ మాట్లాడుతూ నాటుసారా తయారీ కోసం నల్ల బెల్లం సరఫరా చేసే వ్యాపారస్తులను గుర్తించి వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. మద్యం దుకాణాల్లో అధిక ధరలకు విక్రయించడాన్ని పూర్తిగా నిరోధించాలన్నారు. పక్క రాష్ట్రాల మద్యం రాకుండా నిరోధించాలని, సరిహద్దు చెక్‌పోస్టుల్లో తనిఖీలు క్షుణ్ణంగా చేయాలని ఆదేశించారు. ఎక్కైడైనా కల్తీ మద్యం దొరికితే సంబంధి స్టేషన్ సీఐ, ఆ జిల్లా ఎక్సైజ్ అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బార్ అండ్ రెస్టారెంట్లు, మద్యం దుకాణాల్లో కల్తీ మద్యం విక్రయాలను అరికట్టేందుకు అధికారులు తనిఖీలు చేయాలని చెప్పారు. నెల్లూరు జిల్లాలో ఎంఆర్పీ ధరల సిండికేట్, కల్తీ మద్యంపై ఫిర్యాదులు అందాయంటూ ఆ జిల్లా డెప్యూటీ కమిషనర్ చైతన్యమురళిపై మండిపడ్డారు. అలాగే వైఎస్సార్ జిల్లా బద్వేల్ ఎక్సైజ్ సీఐ ఖాజాబీ పట్టణంలోని మద్యం వ్యాపారస్తులతో కుమ్మక్కై కల్తీ మద్యం విక్రయాలకు సహకరిస్తున్నారని ఫిర్యాదులు అందాయని ఆ జిల్లా డెప్యూటీ కమిషనర్ నాగలక్ష్మి తెలిపారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశానన్నారు. ఈ సమావేశంలో డెప్యూటీ కమిషనర్లు చంద్రమౌళి(చిత్తూరు), జీవన్‌సింగ్(అనంతపురం), ప్రేమ్‌ప్రసాద్(కర్నూలు), నాగలక్ష్మి(కడప), చైతన్యమురళి(నెల్లూరు)తో పాటు నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల అసిస్టెంట్ కమిషనర్లు పాల్గొన్నారు. -
ప్రాజెక్టు ‘కనికట్టు’!
సాక్షి ప్రతినిధి, అనంతపురం: సమైక్యాంధ్ర పోరాటానికి చుక్కానిలా నిలుస్తోన్న అనంతపురం జిల్లాలో ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కిరణ్ సర్కారు కుట్ర పన్నుతోందా? ఉద్యమంలో కీలక భూమిక పోషిస్తోన్న రైతులను కనికట్టు చేసేందుకు పూనుకుందా? సేద్యాన్ని లాభసాటిగా మార్చేందుకు ఉద్దేశించిన ‘ప్రాజెక్టు అనంత’కు నిధులు మంజూరు చేయడం మాట పక్కన పెట్టి.. అమలు కోసమంటూ రిటైర్డు ఐఏఎస్ అధికారి చంద్రమౌళిని ప్రత్యేకాధికారిగా నియమించడం అందులో భాగమేనా?.. ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతున్నారు వ్యవసాయ శాఖ అధికారులు, సమైక్యవాదులు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ), యూపీఏ పక్షాలు జూలై 30న తీర్మానం చేసిన తక్షణమే ‘అనంత’లో సమైక్యాంధ్ర ఉద్యమం పురుడుపోసుకున్న విషయం విదితమే. ఈ ఉద్యమం దావానంలా సీమాంధ్ర అంతటా వ్యాపించింది. ఉద్యమానికి ‘అనంత’ మార్గనిర్దేశనం చేస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లాలో ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కిరణ్ సర్కారు పూనుకుంది. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు సమ్మెను తాత్కాలికంగా విరమించినా.. జిల్లాలో మాత్రం ఉద్యమ వేడి ఏమాత్రమూ తగ్గలేదు. రైతులు, కూలీలు, ఇతర అన్ని వర్గాల ప్రజలు ఉద్యమానికి దన్నుగా నిలుస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర నిఘా సంస్థలు కూడా ఇదే అంశాన్ని స్పష్టీకరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైతులు, వ్యవసాయ కూలీలను కూడా ఉద్యమం నుంచి తప్పించడానికి ప్రభుత్వం ఉత్తుత్తి తాయిలాలను ఎరగా వేస్తోంది. ‘ప్రాజెక్టు అనంత’ అమలు కోసం ప్రత్యేకాధికారిగా రిటైర్డు ఐఏఎస్ చంద్రమౌళిని హడావుడిగా నియమించడమే ఇందుకు నిదర్శనం. నిధుల్లేని ‘ప్రాజెక్టు అనంత’ దుర్భిక్ష ‘అనంత’లో సేద్యాన్ని లాభసాటిగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు కేంద్రం వ్యవసాయ శాస్త్రవేత్తలతో ఓ అత్యున్నత సాంకేతిక కమిటీని నియమించింది. ఈ కమిటీ రెండు పర్యాయాలు జిల్లాలో పర్యటించి... ఓ నివేదికను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు అందించింది. ఈ నివేదిక అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా అధికార యంత్రాంగం ఓ ప్రణాళిక రూపొందించింది. ఈ ప్రణాళిక పేరును ‘ప్రాజెక్టు అనంత’గా పెట్టారు. ఈ ప్రాజెక్టు అమలుకు రూ.7,676 కోట్లు అవసరమని జిల్లా అధికారులు తేల్చారు. కానీ.. ఆ మేరకు నిధులు మంజూరు చేయలేమని రాష్ట్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. చేసేదిలేక రాష్ట్ర రెవెన్యూమంత్రి ఎన్.రఘువీరారెడ్డి కేంద్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్‌సింగ్ అహ్లూవాలియాను కలిసి.. ‘ప్రాజెక్టు అనంత’కు నిధులు కేటాయించాలని కోరారు. అందుకు అహ్లూవాలియా అంగీకరించలేదు. దాంతో శాఖాపరంగా మంజూరయ్యే నిధులను ‘ప్రాజెక్టు అనంత’కు మళ్లించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. వ్యవసాయ, ఉద్యాన, సూక్ష్మనీటిపారుదల, పశుసంవర్ధక, పట్టు, మత్స్యశాఖలకు శాఖాపరంగా ఐదేళ్లలో రూ.4,387 కోట్లు మంజూరవుతాయని లెక్కకట్టిన సర్కారు.. తక్కిన రూ.3,282 కోట్లను సమీకరించే ప్రయత్నాలు చేస్తామని తెలిపింది. అయితే.. శాఖాపరంగా మంజూరయ్యే నిధులను మళ్లించలేమంటూ అధికారులు ఇప్పటికే సర్కారుకు తెగేసి చెప్పారు. అమలుకు ప్రత్యేకాధికారా? ‘ప్రాజెక్టు అనంత’ అమలు కోసమంటూ రిటైర్డు ఐఏఎస్ అధికారి చంద్రమౌళిని ప్రత్యేకాధికారిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులను సమన్వయపరచి.. ‘ప్రాజెక్టు అనంత’ను అమలు చేసే బాధ్యతను అప్పగించింది. అసలు నిధులే లేని ప్రాజెక్టు అమలుకు ఏకంగా రిటైర్డు ఐఏఎస్ అధికారిని ప్రత్యేకాధికారిగా నియమించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సమైక్యాంధ్ర ఉద్యమంలో అగ్రపథాన సాగుతోన్న ‘అనంత’ రైతన్నలను, వ్యవసాయ కూలీలను దారి మళ్లించేందుకే ఈ రకమైన ఎత్తుగడలు వేసినట్లు వ్యవసాయశాఖ అధికారులు స్పష్టీకరిస్తున్నారు. లేని తాయిలాలను ఎరగా వేసి.. ఉద్యమాన్ని నీరుగార్చాలన్న లక్ష్యంతోనే కిరణ్ సర్కారు ఈ వ్యూహం రచించినట్లు సమైక్యవాదులు మండిపడుతున్నారు. నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ‘ప్రాజెక్టు అనంత’ అమలుకు తక్షణమే నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.