ఏకగ్రీవ పంచాయతీలకు అందని ప్రోత్సాహకం
7 నుంచి 15 లక్షలు ఇస్తామని చెప్పారు
మార్గదర్శకాలు అందలేదు: డీపీవో చంద్రమౌళి
సాక్షి, చిత్తూరు: ఏకగ్రీవ పంచాయతీలకు భారీగా నిధులిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం ఆ మాటే ఎత్తడం లేదు. నిధుల విడుదల కలగానే మారుతోంది. ఈ క్రమంలో అభివృద్ధి పనులపై సర్పంచ్‌లు ముందడుగు వేయలేకపోతున్నారు. జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో 2013 జూలై, ఆగస్టు నెలల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు.
ఏకగ్రీవ పంచాయతీలకు రూ.7 లక్షల నుంచి రూ.15 లక్షలు ఇస్తామని ప్రభుత్వం పేర్కొంది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పీలేరు సహా అన్ని నియోజకవర్గాల్లో పలు పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. రాజకీయాలకు అతీతంగా చాలా చోట్ల పంచాయతీ పాలకవర్గాలను ఏకగ్రీవం చేసుకున్నారు. అయితే ఎన్నికలు ముగిసి నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి నిధుల మాటలేదు.
చేతులెత్తేసిన ప్రభుత్వం
జిల్లాలో 2006లో జరిగిన ఎన్నికల్లో పంచాయతీలు ఏకగ్రీవం చేసుకున్నందుకు రూ.5 లక్షల చొప్పున నిధులు వచ్చాయి. జిల్లాలో 2013 ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీలు 293 ఉన్నాయి. వీటిల్లో వంద చోట్ల అభ్యర్థులు పోటీపడినా చివరి నిమిషంలో పంచాయతీకి ప్రోత్సాహక నిధులు అందుతాయన్న ఆశతో నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. అయితే ప్రభుత్వం నిధుల మంజూరు మాటే ఎత్తడం లేదు. నిధులు ఇచ్చివుంటే గ్రామాల్లో తాగునీటి పైపులైన్లు, బోర్ల ఏర్పాటు, రోడ్లు, మురుగునీటి కాలువల నిర్మాణం జరిగి ఉండేది.
విడుదలైన నిధులివే
పంచాయతీ ఎన్నికల అనంతరం 13వ ఆర్థిక సంఘం నిధులు రూ.17 కోట్లు విడుదలయ్యాయి. రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు రూ.5.6 కోట్లు అందజేశారు. వృత్తి, సీనరేజ్ పన్నుల రూపంలో రూ.1.5 కోట్లు జిల్లాలోని పంచాయతీలకు జనాభా ప్రాతిపాదికన కేటాయించారు. తలసరి గ్రాంట్ పంచాయతీల ఖాతాలకు ఇంకా జమకాలేదు. వీధిలైట్ల ఏర్పాటు, మంచినీటి పథకాలు, పారిశుద్ధ్య నిర్వహణకు ఈ నిధులను ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు.
సమాచారం లేదు
ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహక నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు, మార్గదర్శకాలు అందలేదు. దీనిపై సమాచారమే లేదు. ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే ఏకగ్రీవ పంచాయతీలకు అందజేస్తాం.
-వీఆర్.చంద్రమౌళి, ఇన్‌చార్జ్ డీపీవో, చిత్తూరు.
కలగానే నజరానా
Published Tue, Jan 7 2014 3:20 AM | Last Updated on Mon, Mar 18 2019 8:51 PM
Advertisement
Advertisement