pancayati
-
పంచాయతీల్లో ఆన్‌లైన్‌కు ఆదిలోనే హంసపాదు
పంచాయతీల్లో ఏప్రిల్ నుంచి నిలిచిన లెక్కలు జిల్లాలో 347 పంచాయతీలకు ఆపరేటర్లు లేరు పని జరగకున్నా నెలనెలా బీఎస్ఎన్ఎల్ బిల్లులు మచిలీపట్నం : పంచాయతీల నిధుల ఖర్చులో పారదర్శకత పాటించేందుకు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) పర్యవేక్షణలో ఏర్పాటైన ఆన్లైన్ పథకానికి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. నూతనంగా ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా పంచాయతీకి సంబంధించిన భౌగోళిక స్వరూపం, స్థిరాస్తులు, చరాస్తులు, రోడ్లు తదితర వివరాల్ని కంప్యూటరీకరిస్తారు. ఈ సమాచారంతో అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తారు. వాటి వినియోగం, చెల్లింపులు తదితర అంశాల్ని తెలుసుకునేందుకు ఈ పథకాన్ని రూపొందించారు. పంచాయతీలకు కంప్యూటర్లు అందజేయటం, ఆపరేటర్ల నియామకం బాధ్యతను అవుట్సోర్సింగ్ పద్ధతిలో కార్వీ సంస్థకు అప్పగించారు. జిల్లాలో తొలివిడతలో 347 పంచాయతీలను ఎంపిక చేసి ఈ ఏడాది ఏప్రిల్‌లో కంప్యూటర్లను అందజేశారు. వీటితో పాటు మరో 52 పంచాయతీలకు అదనంగా బీఎస్ఎన్ఎల్ ఇంటర్నెట్ సర్వీసులనూ అందుబాటులోకి తెచ్చారు. కంప్యూటర్ ఆపరేటర్లను నియమించి పంచాయతీరాజ్ ఉద్యోగులతో రెండు నెలల కిందట శిక్షణ కూడా నిర్వహించారు. అయితే ఆ తర్వాత కంప్యూటర్ ఆపరేటర్ల నియామక ప్రక్రియను కార్వీ సంస్థ నిలిపేసింది. కంప్యూటర్లనూ సిబ్బంది వాడటం లేదు. ఇప్పటి వరకు పంచాయతీ జమా లెక్కల్ని జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు చూసేవారు. ఆన్లైన్ పథకం రావడంతో వారు పట్టించుకోవటం లేదు. దీంతో మూడు నెలలుగా పంచాయతీల్లో ఆర్థిక పరమైన అంశాలకు బ్రేక్ పడింది. బిల్లులు పంపుతున్న బీఎస్ఎన్ఎల్ నెట్ కనెక్షన్, సర్వీస్చార్జ్ తదితర ఖర్చులతో ఒక్కొక్క పంచాయతీ నుంచి వెయ్యి నుంచి రెండువేల రూపాయల వరకు బీఎస్ఎన్ఎల్ నుంచి బిల్లులు వచ్చాయి. కంప్యూటర్లు బిగించకుండా, పనులు జరగకుండానే ఇంటర్నెట్ బిల్లులు రావడంపై అధికారులు తలలుపట్టుకుంటున్నారు. ఆపరేటర్ల నియామకాన్ని ప్రభుత్వం కార్వీ సంస్థకే అప్పగించిందని ఇన్చార్జ్ డీపీవో చంద్రశేఖర్ తెలిపారు. ప్రభుత్వం నుంచి అనుమతలు రాకపోవడంతో నియామకాలు నిలిచిపోయాయని కార్వీ సంస్థ హైదరాబాదు ప్రతినిధి వివరించారు. -
ప్రభుత్వం మాది...దిక్కున్నచోట చెప్పుకోండి..
పంచాయతీ చెరువు నుంచి అడ్డగోలుగా నీటి మళ్లింపు అడ్డుకున్న మహిళా సర్పంచ్, గ్రామస్తులపై దౌర్జన్యం పోలీసులను సైతం లెక్క చేయని వైనం అధికార పార్టీ నాయకుడి నిర్వాకం పామర్రు, న్యూస్‌లైన్ : రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం మాది.. మీకు చేతనైంది చేస్కోండి.. దిక్కున్నచోట చెప్పుకోండి.. ఏం జరుగుద్దో మీరే చూస్తారు.. ఇవీ అధికార పార్టీకి చెందిన ఓ నేత బెదిరింపులు. అంతేకాదు పంచాయతీ చెరువులోని నీటిని అక్రమంగా తోడేస్తుండటంపై ప్రశ్నించిన సర్పంచ్, గ్రామస్తులపై దౌర్జన్యం ప్రదర్శించారు. పోలీసులపై సైతం బెదిరింపులకు దిగారు. వివరాల్లోకి వెళితే.. పామర్రు మండలం కొమరవోలు గ్రామంలో పంచాయతీ పరిధిలో 18 ఎకరాల చెరువు ఉంది. అదే గ్రామానికి చెందిన, తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధిగా చెలామణి అవుతున్న పొట్లూరి కృష్ణబాబు నిబంధనలకు విరుద్ధంగా ఆ నీటిని తన సొంత చెరువుల్లోకి తోడేస్తున్నారు. విషయం తెలుసుకున్న సర్పంచ్ పొట్లూరి కృష్ణకుమారి, గ్రామస్తులు కారే ముసిలి, పొట్లూరి రామశాస్త్రులు, అట్లూరి వెంకటేశ్వరరావు, వేములపల్లి పూర్ణచంద్రరావు, సింగవరపు రామచంద్రరావు, కాకరాల కోటేశ్వరరావు, పొట్లూరి శివయ్య తదితరులు వెళ్లి నీటి మళ్లింపును అడ్డుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పొట్లూరి కృష్ణబాబు అక్కడికి చేరుకుని వారితో వాగ్వివాదానికి దిగారు. ‘నా ఇష్టం వచ్చినట్లు తోడుకుంటాను.. అడ్డుకోండి చూస్తాను.. అధికారంలో ఉన్నది మేమే.. మీరు మమ్మల్ని ఏమీ చేయలేరు..’ అంటూ దౌర్జన్యానికి దిగారు. పోలీసులతోనూ వాగ్వాదం... ఈ ఘటనపై సర్పంచ్ పొట్లూరి కృష్ణకుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పామర్రు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. నీటి తరలింపుపై ఎస్సై విల్సన్ పొట్లూరి కృష్ణబాబును ప్రశ్నించగా, సమాధానం దాటవేశారు. అదే సమయంలో సీఐ శ్రీనివాస్ యాదవ్ అక్కడికి చేరుకుని తమకు సర్పంచ్ నుంచి ఫిర్యాదు అందిందని, నీటి తోడకం చేయడానికి వీలులేదని కృష్ణబాబును వారించారు. దీంతో ‘మీకు రాతపూర్వకంగా ఫిర్యాదు అందకుండా మీరు ఎందుకు వచ్చారు.. ఏం చేద్దామని వచ్చారు’ అంటూ సీఐని, ఎస్సైలను కృష్ణబాబు నిలదీశారు. అనంతరం సీఐ ఆదేశాల మేరకు పోలీసు సిబ్బంది రాత్రంతా కాపలా ఉన్నారని గ్రామస్తులు ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. ఆదివారం ఉదయం 11 గంటలకు సర్పంచ్ పొట్లూరి కృష్ణకుమారి లిఖితపూర్వకంగా ఫిర్యాదు పత్రాన్ని గ్రామస్తులకు ఇచ్చి పోలీస్‌స్టేషన్‌కు పంపగా, పోలీసులు కేసు నమోదు చేయకుండా గ్రామానికి వచ్చి నీటి తవ్వకాలను అడ్డుకున్నారు. అవసరం తీరాకే.. ఆపేశారు.. ఘటనాస్థలిలో రాత్రంతా పోలీసులు ఉన్నా ప్రయోజనం మాత్రం శూన్యమని గ్రామస్తులు తెలిపారు. ఓ పక్క పోలీసులు అక్కడ ఉండగానే నీరంతా సొంత చెరువుల్లోకి తరలించేశారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఉదయం ఎస్సై వచ్చి తవ్వకాలను ఆపేయాలని అనడంతో అప్పటికే పనులు పూర్తయిన నేపథ్యంలో ఇంజ న్లను తొలగించారని గ్రామస్తులు చెప్పారు. -
కలగానే నజరానా
ఏకగ్రీవ పంచాయతీలకు అందని ప్రోత్సాహకం 7 నుంచి 15 లక్షలు ఇస్తామని చెప్పారు మార్గదర్శకాలు అందలేదు: డీపీవో చంద్రమౌళి సాక్షి, చిత్తూరు: ఏకగ్రీవ పంచాయతీలకు భారీగా నిధులిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం ఆ మాటే ఎత్తడం లేదు. నిధుల విడుదల కలగానే మారుతోంది. ఈ క్రమంలో అభివృద్ధి పనులపై సర్పంచ్‌లు ముందడుగు వేయలేకపోతున్నారు. జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో 2013 జూలై, ఆగస్టు నెలల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. ఏకగ్రీవ పంచాయతీలకు రూ.7 లక్షల నుంచి రూ.15 లక్షలు ఇస్తామని ప్రభుత్వం పేర్కొంది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పీలేరు సహా అన్ని నియోజకవర్గాల్లో పలు పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. రాజకీయాలకు అతీతంగా చాలా చోట్ల పంచాయతీ పాలకవర్గాలను ఏకగ్రీవం చేసుకున్నారు. అయితే ఎన్నికలు ముగిసి నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి నిధుల మాటలేదు. చేతులెత్తేసిన ప్రభుత్వం జిల్లాలో 2006లో జరిగిన ఎన్నికల్లో పంచాయతీలు ఏకగ్రీవం చేసుకున్నందుకు రూ.5 లక్షల చొప్పున నిధులు వచ్చాయి. జిల్లాలో 2013 ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీలు 293 ఉన్నాయి. వీటిల్లో వంద చోట్ల అభ్యర్థులు పోటీపడినా చివరి నిమిషంలో పంచాయతీకి ప్రోత్సాహక నిధులు అందుతాయన్న ఆశతో నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. అయితే ప్రభుత్వం నిధుల మంజూరు మాటే ఎత్తడం లేదు. నిధులు ఇచ్చివుంటే గ్రామాల్లో తాగునీటి పైపులైన్లు, బోర్ల ఏర్పాటు, రోడ్లు, మురుగునీటి కాలువల నిర్మాణం జరిగి ఉండేది. విడుదలైన నిధులివే పంచాయతీ ఎన్నికల అనంతరం 13వ ఆర్థిక సంఘం నిధులు రూ.17 కోట్లు విడుదలయ్యాయి. రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు రూ.5.6 కోట్లు అందజేశారు. వృత్తి, సీనరేజ్ పన్నుల రూపంలో రూ.1.5 కోట్లు జిల్లాలోని పంచాయతీలకు జనాభా ప్రాతిపాదికన కేటాయించారు. తలసరి గ్రాంట్ పంచాయతీల ఖాతాలకు ఇంకా జమకాలేదు. వీధిలైట్ల ఏర్పాటు, మంచినీటి పథకాలు, పారిశుద్ధ్య నిర్వహణకు ఈ నిధులను ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. సమాచారం లేదు ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహక నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు, మార్గదర్శకాలు అందలేదు. దీనిపై సమాచారమే లేదు. ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే ఏకగ్రీవ పంచాయతీలకు అందజేస్తాం. -వీఆర్.చంద్రమౌళి, ఇన్చార్జ్ డీపీవో, చిత్తూరు. -
ఈ గాయం మానదు
= మందులు ఇవ్వరు = గాయాలను శుభ్రం చేయరు = కాలిన గాయాలతో గిరిజనుడి ఆవేదన =డోలీ మోతతో తిరిగి ఇంటికి తీసుకుపోయిన గిరిజనులు కనీసం మందులు ఇవ్వడం లేదు.. గాయాల్ని శుభ్రం చేయడం లేదు.. ఇదేమని అడిగి నా పట్టించుకోవడం లేదు... ఇదీ కాలిన గాయాలతో బాధపడుతున్న ఓ గిరిజన యువకుని బంధువులు ఆవే దన. పాడేరు వంద పడకల ఆస్పత్రి సిబ్బంది తీరును నిరసిస్తూ రోగిని డోలీ మోతతో తిరిగి ఇంటికి తీసుకుపోవడం అందర్నీ కలిచివేసింది. పాడేరు, న్యూస్‌లైన్: పెదబయలు మండలం సీకరి పంచాయతీ బైలువీధి గ్రామానికి చెందిన బొండా నీలకంఠం అనే గిరిజన యువకుడు 15 రోజుల క్రితం చలిమంటలో పడడం వల్ల కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. వైద్యం కోసం అతడ్ని పాడేరు ప్రాంతీయ ఆస్పత్రిలో చేర్చారు. తల్లిదండ్రులు లేకపోవడంతో బంధువులే అతడికి సపర్యలు చేస్తున్నారు. ఆస్పత్రిలో సరిగా వైద్యం చేయడం లేదని, రోజువారి డ్రస్సింగ్ కార్యక్రమాలు కూడా లేకపోవడంతో గాయాలు తగ్గుముఖం పట్టడం లేదని అతడి బంధువులు ఆరోపిస్తున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరడంతో విశాఖలోని కేజీహెచ్‌కు తీసుకువెళ్లాలని సూచిం చారు. అక్కడకి తీసుకువెళ్లేందుకు అంబులెన్స్ ఏర్పాటు చేస్తామని వైద్యులు చెప్పారు. విశాఖకు తీసుకువెళ్లేంత ఆర్థిక స్థొమత లేదని, ఇక్కడే ఉంచి మంచి వైద్యం అందించాలని కోరినా వైద్యులు పట్టించుకోలేదని అతడి బంధువులు వాపోయారు. ఆస్పత్రి సిబ్బంది ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతూ శనివారం స్వగ్రామానికి తీసుకుపోయేందుకు సిద్ధమయ్యారు. ఆటో, జీపులు అందుబాటులో లేకపోవడంతో డోలీమోతతో నీలకంఠాన్ని తమ గ్రామానికి తీసుకువెళ్లారు. నీలకంఠం బంధువులకు ‘న్యూస్‌లైన్’ కౌన్సెలింగ్ చేసి తిరిగి ఆస్పత్రిలో చేర్చే ప్రయత్నం చేసినప్పటికీ వారు అంగీకరించలేదు. ఆస్పత్రిలో తమను పట్టిం చుకోవడం లేదని, మందులు కూడా ఇవ్వడం లేదని, ఈ ఆస్పత్రిలో ఉంచలేమని వారు చెప్పారు. పాడేరు నుంచి పెదబయలుకు 33 కిలోమీటర్లు. అక్కడి నుంచి బైలువీధి మరో నాలుగు కిలోమీటర్లు. ఇంత దూరం డోలీమోతతో నీలకంఠంను తరలించడం ఎంత కష్టమోనని చూసిన వారంతా ఆవేదన చెందారు. రోగిని ఇంటికి తరలించేందుకు కనీసం అంబులెన్స్ సౌకర్యం కూడా కల్పించకపోవడాన్ని గిరిజనులు తప్పుబడుతున్నారు. -
ప్రయాస ప్రయాణం
=వెయ్యికిపైగా గ్రామాలకు నడవని బస్సులు =ప్రయాణాలకు షేర్ఆటోలే దిక్కు =కొన్ని పల్లెల్లో ట్రాక్టర్లే రవాణా సాధనాలు =నిరుపయోగంగా మారిన రోడ్లు =పలుచోట్ల బస్టాండ్లకు వెళ్లని బస్సులు =ప్రారంభానికి నోచుకోని పుంగనూరు ఆర్టీసీ డిపో =మదనపల్లె బస్టాండ్‌లో సౌకర్యాలు కరువు =ఆదాయమే ప్రామాణికం అంటున్న ఆర్టీసీ బస్సులను నడపకపోవడంతో జిల్లాలోని పల్లె జనానికి పాట్లు తప్పడం లేదు. ఎక్కడికి వెళ్లాలన్నా షేర్ ఆటోలే దిక్కవుతున్నాయి. పొద్దు పోయిందంటే ఇవీ ఉండవు. ఇక కాలినడకన ఇళ్లకు చేరుకోవాల్సిందే. కొన్ని గ్రామాల్లో ట్రాక్టర్లే రవాణా సాధనాలుగా మారాయి. ఇంకొన్ని మార్గాల్లో చాలీచాలని సర్వీసులు నడుస్తున్నాయి. దీంతో జనానికి బస్సుటాప్ ప్రయాణం తప్పడం లేదు. అదే విధంగా పలు ప్రాంతాల్లో ఆర్టీసీ బస్టాండ్లకు బస్సులు వెళ్లడం లేదు. ప్రయాణిలు చెట్ల కిందో, దుకాణాల పక్కనో నిలబడి బస్సుల కోసం ఎదురుచూస్తున్నారు. సాక్షి, చిత్తూరు: జిల్లాలోని 1365 పంచాయతీల్లో 3 వేలకుపైగా గ్రామాలు ఉన్నాయి. వీటిలో వెయ్యికిపైగా గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. ఈ క్రమంలో గ్రామాల నుంచి పట్టణాలకు వస్తున్న రైతు లు, విద్యార్థులు, కూలీలు, చిరు వ్యాపారులు నరకం చూస్తున్నా రు. వీరి గోడు ఆర్టీసీ అధికారులకు పట్టడం లేదు. ఆదాయం బాగా వచ్చే మార్గాల్లో మాత్రమే బస్సులు నడుపుతున్నారు. రోడ్ల సౌకర్యం బాగా ఉన్నా ఆదాయం లేదనే కారణంతో పలు మార్గాల్లో బస్సులు నడపడం లేదు. అధికారుల తీరును ప్రశ్నించే ప్రజాప్రతినిధులు కరువవుతున్నారు. మరోవైపు గ్రామగ్రామా నా షేర్ ఆటోలు దర్శనమిస్తున్నాయి. అత్యాశతో ఆటోడ్రైవర్లు పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తున్నారు. ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఫలితంగా అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. తిరుపతి ఆర్టీసీ రీజియన్ అధికారులు మాత్రం తమ రికార్డుల్లో బస్సుల్లేని గ్రామాలు 20 నుంచి 30 మాత్రమే ఉన్నాయని చెప్పుకుంటున్నారు. పలమనేరు నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో సుమారు 40 గ్రామాలకు బస్సు, ఇతర రవాణా సదుపాయం లేదు. కేసీపెంట, కీలకపల్లె (గంగవరం), బెరైడ్డిపల్లె మండలంలోని ధర్మపురి, వి.కోట మండలంలోని మావట్టూరు, పెద్దపంజాణి మండలంలోని నాగిరెడ్డిపల్లె, లింగాపురం, పలమనేరు మండలంలోని జగమర్ల యానాదికాలనీ తదితర గ్రామాలకు ఎలాంటి రవాణా సదుపాయమూ లేదు. బెరైడ్డిపల్లెలో ఆర్టీసీ బస్టాండ్ వృథాగా ఉంది. అవసరమైన ప్రాంతాల్లో బస్షెల్టర్లు లేవు. సత్యవేడు నియోజకవర్గంలో ఇరుగులం, ఆంబాకం పంచాయతీలకు తారురోడ్లు ఉన్నా ఆర్టీసీ బస్సులు నడపడం లేదు. ఇరుగులం పంచాయతీకి వెళ్లాలంటే నాలుగు కిలోమీటర్ల దూరం నడవాల్సిందే. మండల కేంద్రానికి పది కిలోమీటర్ల లోపే ఉన్నా పల్లెవెలుగు బస్సులు తిరగడం లేదు. షేర్ ఆటోలే దిక్కుగా ఉన్నాయి. పుంగనూరు నియోజకవర్గంలోని సుమారు 30 గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. ఎక్కువ మందికి షేర్ ఆటోలే ఆధారమవుతున్నాయి. పుంగనూరులో ఆర్టీసీ బస్టాండ్ 15 ఏళ్లుగా నిరుపయోగంగా ఉంది. పుంగనూరులో డిపో కట్టి నాలుగేళ్లు అవుతున్నా ఇంతవరకు ప్రారంభించలేదు. చౌడేపల్లెలో బస్టాండ్ దూరంగా ఉండడంతో బస్సులు వెళ్లడం లేదు. గోతువారిపల్లె, పాలెంపల్లె, ఈడిగపల్లె, పట్రపల్లె తదితర గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. షేర్‌ఆటోలు, ట్రాక్టర్లలో జనం ప్రయాణిస్తున్నారు. హస్తి మండలంలోని ముచ్చివేలు, తొండమనాడు మార్గాల్లో బస్సుల సంఖ్య సరిపోవడంలేదు. ఈ క్రమంలో జనం బస్సుల టాప్‌లపై ప్రయాణిస్తున్నారు. తొట్టంబేడు, చియ్యవరం మార్గంలో బస్సులు సక్రమంగా నడవడం లేదు. విద్యార్థులకు బస్సు పాసులున్నా ఆటోల్లో వెళ్లాల్సిన పరిస్థితి. ఏర్పేడు మండలంలోని పరమాలపల్లె, బండివారిపల్లెలకు బస్సు సౌకర్యం లేదు. ఏర్పేడు తదితర ప్రాంతాల్లో బస్టాండ్లు నిరుపయోగంగా ఉన్నాయి. జీడీ నెల్లూరు నియోజకవర్గంలోని వెదురుకుప్పం, పెనుమూరు, జీడీ నెల్లూరు, పాలసముద్రం మండలాల్లో ఎక్కడా ఆర్టీసీ బస్టేషన్లు లేవు. ప్రయాణికులు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ రోడ్లపైనే బస్సులు ఎక్కుతున్నారు. ఎస్ఆర్.పురం, కార్వేటినగరం మండలాల్లో బస్ షెల్టర్లు శిథిలావస్థలో ఉన్నాయి. పెనుమూరు మండలంలోని ఎస్.రామాపురం, పోలవరం గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. తంబళ్లపల్లె నియోజకవర్గంలోని బి.కొత్తకోట మండలంలో రూ.3.3 కోట్లతో వడిగలవారిపల్లె-మద్దినాయనపల్లె క్రాస్‌కు రోడ్డు వేశారు. అలాగే రూ.1.79 కోట్లతో ఉలవారిపల్లె- కనికలతోపునకు రోడ్డు నిర్మించారు. కురబలకోట మండలం ఎర్రబల్లె నుంచి తిమ్మనవారిపల్లెకు రూ.80 లక్షలతో రోడ్డు వేశారు. అయితే ఈ గ్రామాలకు బస్సులు నడవడం లేదు. నియోజకవర్గంలోని వంద పల్లెలకు బస్సులు వెళ్లడం లేదు. తిరుపతి-చెన్నై, నాగలాపురం రోడ్లు సమీప గ్రామాలకు మిన హా, ఇతర గ్రామాలకు బస్సులు లేవు. బస్సులులేని గ్రామాలు సుమారు 30 ఉన్నాయి. ఈ గ్రామాల వారికి షేర్ ఆటోలే దిక్కుగా ఉన్నాయి. పొద్దు పోయిందంటే జనం కాలినడకన గ్రామాలకు చేరుకోవాల్సిందే. మదనపల్లె: మండలంలో 306 గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. ఈ పల్లెలకు ఆర్అండ్బీ రోడ్లు 8, పంచాయతీరాజ్‌శాఖ రోడ్లు 70 ఉన్నా బస్సులు నడవడం లేదు. మదనపల్లె ఆర్టీసీ డిపోలోని 250 బస్సుల్లో మదనపల్లె చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు 5 మాత్రమే నడుపుతున్నారు. చిత్తూరు బస్టాండ్‌కు ఆర్టీసీ బస్సులు రావడం లేదు. బస్సుల కోసం జనం చెట్ల కింద, దుకాణాల ముందు రోడ్లు నిలుచుకుంటున్నారు. ఆర్టీసీ బస్టాండ్‌లో కుర్చీలు లేవు. కుప్పం: డిపోలో 94 సర్వీసులు తిరుగుతున్నాయి. ఇందులో 30 వరకు పాడయ్యాయి. ఇప్పటికీ 120 గ్రామాలకు బస్సు సర్వీసులు లేవు. రామకుప్పం, గుడిపల్లె మండలాల్లోని ఆర్టీసీ బస్టాండ్లు నిరుపయోగంగా ఉన్నాయి. శాంతిపురంలో బస్‌స్టేషన్ నిర్మాణం శంకుస్థాపనకే పరిమితమైంది. రామకుప్పం, కుప్పం మండలాల్లోని పలు పల్లెలకు బస్సు సర్వీసులను రద్దు చేశారు. పూతలపట్టు: నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఆర్టీసీ బస్సులు సక్రమంగా నడవడం లేదు. ఐరాల మండలంలోని కాణిపాకం ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. ఇక్కడ ఇంత వరకు ఆర్టీసీ బస్టాండ్ లేదు. పూతలపట్టులో రోడ్డుపక్కనే బస్టాండ్ నిర్మించినా బస్సులు ఆగడం లేదు. ఈ క్రమంలో ప్రయాణికులకు రోడ్లపైనే ఎదురుచూపులు తప్పడం లేదు. డిపోలో 94 సర్వీసులు తిరుగుతున్నాయి. ఇందులో 30 వరకు పాడయ్యాయి. 120 గ్రామాలకు బస్సు సర్వీసులు లేవు. రామకుప్పం, గుడిపల్లె మండలాల్లోని ఆర్టీసీ బస్టాండ్లు నిరుపయోగంగా ఉన్నాయి. శాంతిపురంలో బస్‌స్టేషన్ నిర్మాణం శంకుస్థాపనకే పరిమితమైంది. రామకుప్పం, కుప్పం మండలాల్లోని పలు పల్లెలకు బస్సు సర్వీసులను రద్దు చేశారు. -
విలీనానికి వ్యతిరేకం
=స్పష్టం చేసిన ప్రజానీకం =‘గ్రేటర్’లో గ్రామాలు కలపొద్దని డిమాండ్ =ప్రజాభిప్రాయ సేకరణ రసాభాస అనకాపల్లి టౌన్, న్యూస్‌లైన్ : అనకాపల్లి పరిధిలో గల పంచాయతీలను గ్రేటర్లో విలీనం చేయడానికి సంబంధించి శుక్రవారం గ్రామాల్లో చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ గ్రామసభలు రసాభాసగా మారాయి. గ్రామస్తులు ఈ సభలలో అధిక సంఖ్యలో పాల్గొని, గ్రేటర్లో విలీనం చేయొద్దని ఎలుగెత్తి చాటారు. అనకాపల్లి మున్సిపాలిటీని ఇది వరకే గ్రేటర్ విశాఖలో విలీనం చేయడంతో మండలానికి చెందిన మూడు పంచాయతీలు గ్రేటర్లో కలసిపోయాయి. అయితే అప్పట్లో ఆయా పంచాయతీలకు చెందిన ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోకుండానే విలీనం చేయడంతో గ్రామస్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయింది. విలీనం చేసిన సుమారు మూడు నెలల తర్వాత ఎట్టకేలకు అధికారులు స్పందించి శుక్రవారం కొప్పాక, వల్లూరు, రాజుపాలెం గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణకు గ్రామసభలు నిర్వహించారు. ఆ మూడు గ్రామాల ప్రత్యేకాధికారి పి.అచ్యుతరావు ఆధ్వర్యంలో వీటిని చేపట్టారు. అసలు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టకుండా ఎలా విలీనం చేశారంటూ అక్కడికి వచ్చిన అధికారులపై గ్రామస్తులు మండిపడ్డారు. గ్రేటర్లో విలీనం చేయొద్దంటూ పట్టుబట్టారు. దీంతో అధికారులు, గ్రా మస్తుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గ్రామసభ రసాభాసగా మా రింది. జీవీఎంసీలో విలీనం వల్ల పన్నుల భారం పెరుగుతుందని, కూలీలు ఉపాధి హామీ పథకానికి నోచుకోరని గ్రామస్తులు చెప్పారు. వెయ్యి మందికి పైగా ప్రజలు ఉపాధి కోల్పోతారన్నారు. అనేక సమస్యలు ఎదురవుతాయని, అందుకే జీవీఎంసీలో విలీనానికి తాము వ్యతిరేకమని అధికారులకు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పంచాయతీ ప్రత్యేకాధికారి అచ్యుతరావు మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రజాభిప్రాయ సేకరణకు గ్రామసభ నిర్వహించామని తెలిపారు. ప్రజల అభిప్రాయాలను నేరుగా అధికారులకు నివేదిస్తామని చెప్పారు. తమ గ్రామాలకు జీవీఎంసీలో విలీనం చేయొద్దంటూ గ్రామస్తులు ఏకగ్రీవంగా తీర్మానం చేసి అధికారులకు తీర్మాన పత్రాన్ని అందజేశారు. రాజుపాలెం గ్రామంలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ సభలో మాత్రం కొందరు విలీనాన్ని వ్యతిరేకించగా, మరికొందరు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఈవోపీఆర్డీ ఆర్.ఎల్.ఎన్.కుమార్, పంచాయతీ కార్యదర్శి దుర్గా ప్రసాద్, వల్లూరు పంచాయతీ మాజీ సర్పంచ్ వై.వి.సత్యనారాయణ, వైఎస్సార్సీపీ నాయకుడు సిమ్మా ముసిలినాయుడు, ఎంపీటీసీ మాజీ సభ్యులు ఎం.గోపాలరావు, వి.ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.