= మందులు ఇవ్వరు
= గాయాలను శుభ్రం చేయరు
= కాలిన గాయాలతో గిరిజనుడి ఆవేదన
=డోలీ మోతతో తిరిగి ఇంటికి తీసుకుపోయిన గిరిజనులు
కనీసం మందులు ఇవ్వడం లేదు.. గాయాల్ని శుభ్రం చేయడం లేదు.. ఇదేమని అడిగి నా పట్టించుకోవడం లేదు... ఇదీ కాలిన గాయాలతో బాధపడుతున్న ఓ గిరిజన యువకుని బంధువులు ఆవే దన. పాడేరు వంద పడకల ఆస్పత్రి సిబ్బంది తీరును నిరసిస్తూ రోగిని డోలీ మోతతో తిరిగి ఇంటికి తీసుకుపోవడం అందర్నీ కలిచివేసింది.
పాడేరు, న్యూస్‌లైన్: పెదబయలు మండలం సీకరి పంచాయతీ బైలువీధి గ్రామానికి చెందిన బొండా నీలకంఠం అనే గిరిజన యువకుడు 15 రోజుల క్రితం చలిమంటలో పడడం వల్ల కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. వైద్యం కోసం అతడ్ని పాడేరు ప్రాంతీయ ఆస్పత్రిలో చేర్చారు. తల్లిదండ్రులు లేకపోవడంతో బంధువులే అతడికి సపర్యలు చేస్తున్నారు. ఆస్పత్రిలో సరిగా వైద్యం చేయడం లేదని, రోజువారి డ్రస్సింగ్ కార్యక్రమాలు కూడా లేకపోవడంతో గాయాలు తగ్గుముఖం పట్టడం లేదని అతడి బంధువులు ఆరోపిస్తున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరడంతో విశాఖలోని కేజీహెచ్‌కు తీసుకువెళ్లాలని సూచిం చారు. అక్కడకి తీసుకువెళ్లేందుకు అంబులెన్స్ ఏర్పాటు చేస్తామని వైద్యులు చెప్పారు.
విశాఖకు తీసుకువెళ్లేంత ఆర్థిక స్థొమత లేదని, ఇక్కడే ఉంచి మంచి వైద్యం అందించాలని కోరినా వైద్యులు పట్టించుకోలేదని అతడి బంధువులు వాపోయారు. ఆస్పత్రి సిబ్బంది ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతూ శనివారం స్వగ్రామానికి తీసుకుపోయేందుకు సిద్ధమయ్యారు. ఆటో, జీపులు అందుబాటులో లేకపోవడంతో డోలీమోతతో నీలకంఠాన్ని తమ గ్రామానికి తీసుకువెళ్లారు. నీలకంఠం బంధువులకు ‘న్యూస్‌లైన్’ కౌన్సెలింగ్ చేసి తిరిగి ఆస్పత్రిలో చేర్చే ప్రయత్నం చేసినప్పటికీ వారు అంగీకరించలేదు.
ఆస్పత్రిలో తమను పట్టిం చుకోవడం లేదని, మందులు కూడా ఇవ్వడం లేదని, ఈ ఆస్పత్రిలో ఉంచలేమని వారు చెప్పారు. పాడేరు నుంచి పెదబయలుకు 33 కిలోమీటర్లు. అక్కడి నుంచి బైలువీధి మరో నాలుగు కిలోమీటర్లు. ఇంత దూరం డోలీమోతతో నీలకంఠంను తరలించడం ఎంత కష్టమోనని చూసిన వారంతా ఆవేదన చెందారు. రోగిని ఇంటికి తరలించేందుకు కనీసం అంబులెన్స్ సౌకర్యం కూడా కల్పించకపోవడాన్ని గిరిజనులు తప్పుబడుతున్నారు.
ఈ గాయం మానదు
Published Sun, Dec 29 2013 2:01 AM | Last Updated on Sat, Aug 18 2018 2:18 PM
Advertisement
Advertisement