Nilakantham
-
పెళ్లింట చావు బాజా
శ్రీకాకుళం రూరల్: మరికొద్ది గంటల్లో పెళ్లి జరగాల్సిన ఇంట చావు బాజా మోగింది. వివాహానికి వస్తున్న వారిలో రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, నాలుగేళ్ల చిన్నారితో సహా తల్లీ కూడా గాయపడడంతో ఆ ఇంట విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళితే మండలంలోని లంకాం గ్రామానికి చెందిన తట్ట నీలకంఠం (48) తమ్ముడు కుమారుడుకు బుధవారం రాత్రి వివాహం. దీంతో పోలాకి మండలం ఈదులవలసలో ఉంటున్న నీలకంఠం కుమార్తె గొండు ఊర్మిల, మనుమరాలు వైష్ణవీ (నాలుగు నెలల చిన్నారి)ని ఆటోలో బుధవారం వివాహం కోసం లంకాం తీసుకొని వస్తున్నాడు. ఇంతలో సిలగాం సింగువలస ఎఫ్‌సీఐ గొడౌన్ కూడలిలో ఎదురుగా వస్తున్న బీఎంపీఎస్ పార్శిల్ సర్వీసు లారీ వీరు ప్రయాణిస్తున్న ఆటోను ఢీకొట్టింది. దీంతో నీలకంఠం అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనతో పాటు ఉన్న ఆయన కుమార్తె ఊర్మిల, మనుమరాలు వైష్ణవితో పాటు ఆటోలో ప్రయాణిస్తున్న లంకాం గ్రామానికి చెందిన తేజేశ్వరావు అనేవ్యక్తి గాయపడ్డాడు. క్షతగాత్రులను 108 వాహనంలో రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. చిన్నారి వైష్ణవి పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖకు వైద్యులు రిఫర్ చేశారు. ఊర్మిల తలకు తీవ్ర గాయాలయ్యాయి. కుడి కాలు విరిగిపోయింది. శోక సముద్రంలో పెళ్లిల్లు ప్రమాదం విషయం తెలుసుకున్న నీలకంఠం కుటుంబం తీవ్ర విషాదానికి గురైంది. పెళ్లి సందడితో కళకళలాడాల్సిన లంకాంలోని నీలకంఠం తమ్ముడు ఇల్లు శోకసంద్రంలో మునిగిపోయింది. గ్రామానికి సమీపంలో ప్రమాదం జరగడంతో విషయం తెలుసుకుని లంకాం గ్రామస్తులంతా సంఘటన స్థలానికి చేరుకున్నారు. చిన్నారి వైష్ణవి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో అందరూ కంటతడిపెట్టారు. నీలకంఠం మృతదేహానికి శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. రూరల్ ఎస్సై ఎం.శ్రీను కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
హిందూ ధర్మాన్ని పరిరక్షించుకుందాం
ఆళ్లగడ్డ టౌన్: హిందూ ధర్మాన్ని పరిరక్షించుకుందామని విశ్వహిందు పరిషత్ ప్రముక్ న్యాయవాది నీలకంఠం పిలుపునిచ్చారు. ఆ సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో వారం రోజులుగా నిర్వహిస్తున్న ప్రాథమిక శిక్షణ కార్యక్రమం బుధవారం ముగిసింది. ఈ సందర్భంగా స్వయం సేవకులు తదితరులు స్థానిక భారతీ విద్యామందిర్ నుంచి పాత బస్టాండ, ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఖుబ్దా వీధి, సంత మార్కెట్ మీదుగా పుర వీధులో మార్చ్ పాస్ట్ నిర్వహించారు. అనంతరం స్థానిక భారతీ విద్యా మందిర్ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ విశ్వ హిందూ పరిషత్‌ను గ్రామస్థాయిలో బలోపేతం చేయాలని సూచించారు. మత మార్పిడిలను అరికట్టాలన్నారు. కార్యక్రమంలో నాయకులు సుబ్బలక్ష్మయ్య, పద్మనాభుడు, టీఎంసీ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
ఈ గాయం మానదు
= మందులు ఇవ్వరు = గాయాలను శుభ్రం చేయరు = కాలిన గాయాలతో గిరిజనుడి ఆవేదన =డోలీ మోతతో తిరిగి ఇంటికి తీసుకుపోయిన గిరిజనులు కనీసం మందులు ఇవ్వడం లేదు.. గాయాల్ని శుభ్రం చేయడం లేదు.. ఇదేమని అడిగి నా పట్టించుకోవడం లేదు... ఇదీ కాలిన గాయాలతో బాధపడుతున్న ఓ గిరిజన యువకుని బంధువులు ఆవే దన. పాడేరు వంద పడకల ఆస్పత్రి సిబ్బంది తీరును నిరసిస్తూ రోగిని డోలీ మోతతో తిరిగి ఇంటికి తీసుకుపోవడం అందర్నీ కలిచివేసింది. పాడేరు, న్యూస్‌లైన్: పెదబయలు మండలం సీకరి పంచాయతీ బైలువీధి గ్రామానికి చెందిన బొండా నీలకంఠం అనే గిరిజన యువకుడు 15 రోజుల క్రితం చలిమంటలో పడడం వల్ల కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. వైద్యం కోసం అతడ్ని పాడేరు ప్రాంతీయ ఆస్పత్రిలో చేర్చారు. తల్లిదండ్రులు లేకపోవడంతో బంధువులే అతడికి సపర్యలు చేస్తున్నారు. ఆస్పత్రిలో సరిగా వైద్యం చేయడం లేదని, రోజువారి డ్రస్సింగ్ కార్యక్రమాలు కూడా లేకపోవడంతో గాయాలు తగ్గుముఖం పట్టడం లేదని అతడి బంధువులు ఆరోపిస్తున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరడంతో విశాఖలోని కేజీహెచ్‌కు తీసుకువెళ్లాలని సూచిం చారు. అక్కడకి తీసుకువెళ్లేందుకు అంబులెన్స్ ఏర్పాటు చేస్తామని వైద్యులు చెప్పారు. విశాఖకు తీసుకువెళ్లేంత ఆర్థిక స్థొమత లేదని, ఇక్కడే ఉంచి మంచి వైద్యం అందించాలని కోరినా వైద్యులు పట్టించుకోలేదని అతడి బంధువులు వాపోయారు. ఆస్పత్రి సిబ్బంది ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతూ శనివారం స్వగ్రామానికి తీసుకుపోయేందుకు సిద్ధమయ్యారు. ఆటో, జీపులు అందుబాటులో లేకపోవడంతో డోలీమోతతో నీలకంఠాన్ని తమ గ్రామానికి తీసుకువెళ్లారు. నీలకంఠం బంధువులకు ‘న్యూస్‌లైన్’ కౌన్సెలింగ్ చేసి తిరిగి ఆస్పత్రిలో చేర్చే ప్రయత్నం చేసినప్పటికీ వారు అంగీకరించలేదు. ఆస్పత్రిలో తమను పట్టిం చుకోవడం లేదని, మందులు కూడా ఇవ్వడం లేదని, ఈ ఆస్పత్రిలో ఉంచలేమని వారు చెప్పారు. పాడేరు నుంచి పెదబయలుకు 33 కిలోమీటర్లు. అక్కడి నుంచి బైలువీధి మరో నాలుగు కిలోమీటర్లు. ఇంత దూరం డోలీమోతతో నీలకంఠంను తరలించడం ఎంత కష్టమోనని చూసిన వారంతా ఆవేదన చెందారు. రోగిని ఇంటికి తరలించేందుకు కనీసం అంబులెన్స్ సౌకర్యం కూడా కల్పించకపోవడాన్ని గిరిజనులు తప్పుబడుతున్నారు.