శ్రీకాకుళం రూరల్: మరికొద్ది గంటల్లో పెళ్లి జరగాల్సిన ఇంట చావు బాజా మోగింది. వివాహానికి వస్తున్న వారిలో రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, నాలుగేళ్ల చిన్నారితో సహా తల్లీ కూడా గాయపడడంతో ఆ ఇంట విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళితే మండలంలోని లంకాం గ్రామానికి చెందిన తట్ట నీలకంఠం (48) తమ్ముడు కుమారుడుకు బుధవారం రాత్రి వివాహం. దీంతో పోలాకి మండలం ఈదులవలసలో ఉంటున్న నీలకంఠం కుమార్తె గొండు ఊర్మిల, మనుమరాలు వైష్ణవీ (నాలుగు నెలల చిన్నారి)ని ఆటోలో బుధవారం వివాహం కోసం లంకాం తీసుకొని వస్తున్నాడు.
ఇంతలో సిలగాం సింగువలస ఎఫ్‌సీఐ గొడౌన్ కూడలిలో ఎదురుగా వస్తున్న బీఎంపీఎస్ పార్శిల్ సర్వీసు లారీ వీరు ప్రయాణిస్తున్న ఆటోను ఢీకొట్టింది. దీంతో నీలకంఠం అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనతో పాటు ఉన్న ఆయన కుమార్తె ఊర్మిల, మనుమరాలు వైష్ణవితో పాటు ఆటోలో ప్రయాణిస్తున్న లంకాం గ్రామానికి చెందిన తేజేశ్వరావు అనేవ్యక్తి గాయపడ్డాడు. క్షతగాత్రులను 108 వాహనంలో రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. చిన్నారి వైష్ణవి పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖకు వైద్యులు రిఫర్ చేశారు. ఊర్మిల తలకు తీవ్ర గాయాలయ్యాయి. కుడి కాలు విరిగిపోయింది.
శోక సముద్రంలో పెళ్లిల్లు
ప్రమాదం విషయం తెలుసుకున్న నీలకంఠం కుటుంబం తీవ్ర విషాదానికి గురైంది. పెళ్లి సందడితో కళకళలాడాల్సిన లంకాంలోని నీలకంఠం తమ్ముడు ఇల్లు శోకసంద్రంలో మునిగిపోయింది. గ్రామానికి సమీపంలో ప్రమాదం జరగడంతో విషయం తెలుసుకుని లంకాం గ్రామస్తులంతా సంఘటన స్థలానికి చేరుకున్నారు. చిన్నారి వైష్ణవి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో అందరూ కంటతడిపెట్టారు. నీలకంఠం మృతదేహానికి శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. రూరల్ ఎస్సై ఎం.శ్రీను కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పెళ్లింట చావు బాజా
Published Thu, Jun 11 2015 2:49 AM | Last Updated on Sun, Sep 3 2017 3:31 AM
Advertisement
Advertisement