ప్రయాస ప్రయాణం | The difficulty of travel | Sakshi
Sakshi News home page

ప్రయాస ప్రయాణం

Published Mon, Dec 23 2013 2:36 AM | Last Updated on Sat, Sep 2 2017 1:51 AM

ప్రయాస ప్రయాణం

ప్రయాస ప్రయాణం

=వెయ్యికిపైగా గ్రామాలకు నడవని బస్సులు
 =ప్రయాణాలకు షేర్‌ఆటోలే దిక్కు
 =కొన్ని పల్లెల్లో ట్రాక్టర్లే రవాణా సాధనాలు
 =నిరుపయోగంగా మారిన రోడ్లు
 =పలుచోట్ల బస్టాండ్లకు వెళ్లని బస్సులు
 =ప్రారంభానికి నోచుకోని పుంగనూరు ఆర్‌టీసీ డిపో
 =మదనపల్లె బస్టాండ్‌లో సౌకర్యాలు కరువు
 =ఆదాయమే ప్రామాణికం అంటున్న ఆర్‌టీసీ

 
 బస్సులను నడపకపోవడంతో జిల్లాలోని పల్లె జనానికి పాట్లు తప్పడం లేదు. ఎక్కడికి వెళ్లాలన్నా షేర్ ఆటోలే దిక్కవుతున్నాయి. పొద్దు పోయిందంటే ఇవీ ఉండవు. ఇక కాలినడకన ఇళ్లకు చేరుకోవాల్సిందే. కొన్ని గ్రామాల్లో ట్రాక్టర్లే రవాణా సాధనాలుగా మారాయి. ఇంకొన్ని మార్గాల్లో చాలీచాలని సర్వీసులు నడుస్తున్నాయి. దీంతో జనానికి బస్సుటాప్ ప్రయాణం తప్పడం లేదు. అదే విధంగా పలు ప్రాంతాల్లో ఆర్‌టీసీ బస్టాండ్‌లకు బస్సులు వెళ్లడం లేదు. ప్రయాణిలు చెట్ల కిందో, దుకాణాల పక్కనో నిలబడి బస్సుల కోసం ఎదురుచూస్తున్నారు.
 
సాక్షి, చిత్తూరు: జిల్లాలోని 1365 పంచాయతీల్లో 3 వేలకుపైగా గ్రామాలు ఉన్నాయి. వీటిలో వెయ్యికిపైగా గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. ఈ క్రమంలో గ్రామాల నుంచి పట్టణాలకు వస్తున్న రైతు లు, విద్యార్థులు, కూలీలు, చిరు వ్యాపారులు నరకం చూస్తున్నా రు. వీరి గోడు ఆర్‌టీసీ అధికారులకు పట్టడం లేదు. ఆదాయం బాగా వచ్చే మార్గాల్లో మాత్రమే బస్సులు నడుపుతున్నారు. రోడ్ల సౌకర్యం బాగా ఉన్నా ఆదాయం లేదనే కారణంతో పలు మార్గాల్లో బస్సులు నడపడం లేదు.

అధికారుల తీరును ప్రశ్నించే ప్రజాప్రతినిధులు కరువవుతున్నారు. మరోవైపు గ్రామగ్రామా నా షేర్ ఆటోలు దర్శనమిస్తున్నాయి. అత్యాశతో ఆటోడ్రైవర్లు పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తున్నారు. ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఫలితంగా అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. తిరుపతి ఆర్‌టీసీ రీజియన్ అధికారులు మాత్రం తమ రికార్డుల్లో బస్సుల్లేని గ్రామాలు 20 నుంచి 30 మాత్రమే ఉన్నాయని చెప్పుకుంటున్నారు.
     
పలమనేరు నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో సుమారు 40 గ్రామాలకు బస్సు, ఇతర రవాణా సదుపాయం లేదు. కేసీపెంట, కీలకపల్లె (గంగవరం), బెరైడ్డిపల్లె మండలంలోని ధర్మపురి, వి.కోట మండలంలోని మావట్టూరు, పెద్దపంజాణి మండలంలోని నాగిరెడ్డిపల్లె, లింగాపురం, పలమనేరు మండలంలోని జగమర్ల యానాదికాలనీ తదితర గ్రామాలకు ఎలాంటి రవాణా సదుపాయమూ లేదు. బెరైడ్డిపల్లెలో ఆర్‌టీసీ బస్టాండ్ వృథాగా ఉంది. అవసరమైన ప్రాంతాల్లో బస్‌షెల్టర్లు లేవు.
     
సత్యవేడు నియోజకవర్గంలో ఇరుగులం, ఆంబాకం పంచాయతీలకు తారురోడ్లు ఉన్నా ఆర్‌టీసీ బస్సులు నడపడం లేదు. ఇరుగులం పంచాయతీకి వెళ్లాలంటే నాలుగు కిలోమీటర్ల దూరం నడవాల్సిందే. మండల కేంద్రానికి పది కిలోమీటర్ల లోపే ఉన్నా పల్లెవెలుగు బస్సులు తిరగడం లేదు. షేర్ ఆటోలే దిక్కుగా ఉన్నాయి.
     
పుంగనూరు నియోజకవర్గంలోని సుమారు 30 గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. ఎక్కువ మందికి షేర్ ఆటోలే ఆధారమవుతున్నాయి. పుంగనూరులో ఆర్‌టీసీ బస్టాండ్ 15 ఏళ్లుగా నిరుపయోగంగా ఉంది. పుంగనూరులో డిపో కట్టి నాలుగేళ్లు అవుతున్నా ఇంతవరకు ప్రారంభించలేదు. చౌడేపల్లెలో బస్టాండ్ దూరంగా ఉండడంతో బస్సులు వెళ్లడం లేదు. గోతువారిపల్లె, పాలెంపల్లె, ఈడిగపల్లె, పట్రపల్లె తదితర గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. షేర్‌ఆటోలు, ట్రాక్టర్లలో జనం ప్రయాణిస్తున్నారు.
     
హస్తి మండలంలోని ముచ్చివేలు, తొండమనాడు మార్గాల్లో బస్సుల సంఖ్య సరిపోవడంలేదు. ఈ క్రమంలో జనం బస్సుల టాప్‌లపై ప్రయాణిస్తున్నారు. తొట్టంబేడు, చియ్యవరం మార్గంలో బస్సులు సక్రమంగా నడవడం లేదు. విద్యార్థులకు బస్సు పాసులున్నా ఆటోల్లో వెళ్లాల్సిన పరిస్థితి. ఏర్పేడు మండలంలోని పరమాలపల్లె, బండివారిపల్లెలకు బస్సు సౌకర్యం లేదు. ఏర్పేడు తదితర ప్రాంతాల్లో బస్టాండ్లు నిరుపయోగంగా ఉన్నాయి.
     
జీడీ నెల్లూరు నియోజకవర్గంలోని వెదురుకుప్పం, పెనుమూరు, జీడీ నెల్లూరు, పాలసముద్రం మండలాల్లో ఎక్కడా ఆర్‌టీసీ బస్టేషన్లు లేవు. ప్రయాణికులు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ రోడ్లపైనే బస్సులు ఎక్కుతున్నారు. ఎస్‌ఆర్.పురం, కార్వేటినగరం మండలాల్లో బస్ షెల్టర్లు శిథిలావస్థలో ఉన్నాయి. పెనుమూరు మండలంలోని ఎస్.రామాపురం, పోలవరం గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు.
     
తంబళ్లపల్లె నియోజకవర్గంలోని బి.కొత్తకోట మండలంలో రూ.3.3 కోట్లతో వడిగలవారిపల్లె-మద్దినాయనపల్లె క్రాస్‌కు రోడ్డు వేశారు. అలాగే రూ.1.79 కోట్లతో ఉలవారిపల్లె- కనికలతోపునకు రోడ్డు నిర్మించారు. కురబలకోట మండలం ఎర్రబల్లె నుంచి తిమ్మనవారిపల్లెకు రూ.80 లక్షలతో రోడ్డు వేశారు. అయితే ఈ గ్రామాలకు బస్సులు నడవడం లేదు. నియోజకవర్గంలోని వంద పల్లెలకు బస్సులు వెళ్లడం లేదు.
     
తిరుపతి-చెన్నై, నాగలాపురం రోడ్లు సమీప గ్రామాలకు మిన హా, ఇతర గ్రామాలకు బస్సులు లేవు. బస్సులులేని గ్రామాలు సుమారు 30 ఉన్నాయి. ఈ గ్రామాల వారికి షేర్ ఆటోలే దిక్కుగా ఉన్నాయి. పొద్దు పోయిందంటే జనం కాలినడకన గ్రామాలకు చేరుకోవాల్సిందే.
 
మదనపల్లె: మండలంలో 306 గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. ఈ పల్లెలకు ఆర్‌అండ్‌బీ రోడ్లు 8, పంచాయతీరాజ్‌శాఖ రోడ్లు 70 ఉన్నా బస్సులు నడవడం లేదు. మదనపల్లె ఆర్‌టీసీ డిపోలోని 250 బస్సుల్లో మదనపల్లె చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు 5 మాత్రమే నడుపుతున్నారు. చిత్తూరు బస్టాండ్‌కు ఆర్‌టీసీ బస్సులు రావడం లేదు. బస్సుల కోసం జనం చెట్ల కింద, దుకాణాల ముందు రోడ్లు నిలుచుకుంటున్నారు. ఆర్‌టీసీ బస్టాండ్‌లో కుర్చీలు లేవు.
 
 కుప్పం: డిపోలో 94 సర్వీసులు తిరుగుతున్నాయి. ఇందులో 30 వరకు పాడయ్యాయి. ఇప్పటికీ 120 గ్రామాలకు బస్సు సర్వీసులు లేవు. రామకుప్పం, గుడిపల్లె మండలాల్లోని ఆర్‌టీసీ బస్టాండ్లు నిరుపయోగంగా ఉన్నాయి. శాంతిపురంలో బస్‌స్టేషన్ నిర్మాణం శంకుస్థాపనకే పరిమితమైంది. రామకుప్పం, కుప్పం మండలాల్లోని పలు పల్లెలకు బస్సు సర్వీసులను రద్దు చేశారు.
 
 పూతలపట్టు: నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఆర్‌టీసీ బస్సులు సక్రమంగా నడవడం లేదు. ఐరాల మండలంలోని కాణిపాకం ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. ఇక్కడ ఇంత వరకు ఆర్‌టీసీ బస్టాండ్ లేదు. పూతలపట్టులో రోడ్డుపక్కనే బస్టాండ్ నిర్మించినా బస్సులు ఆగడం లేదు. ఈ క్రమంలో ప్రయాణికులకు రోడ్లపైనే ఎదురుచూపులు తప్పడం లేదు. డిపోలో 94 సర్వీసులు తిరుగుతున్నాయి. ఇందులో 30 వరకు పాడయ్యాయి. 120 గ్రామాలకు బస్సు సర్వీసులు లేవు. రామకుప్పం, గుడిపల్లె మండలాల్లోని ఆర్‌టీసీ బస్టాండ్లు నిరుపయోగంగా ఉన్నాయి. శాంతిపురంలో బస్‌స్టేషన్ నిర్మాణం శంకుస్థాపనకే పరిమితమైంది. రామకుప్పం, కుప్పం మండలాల్లోని పలు పల్లెలకు బస్సు సర్వీసులను రద్దు చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement