రెండో రోజూ లూటీ!
నగరంలో వీడని సమ్మె కష్టాలు..
{పయాణికులను నిలువునా దోచుకున్న
{పైవేట్ వాహనదారులు
{పత్యేక రైళ్లు ఏర్పాటు చేసిన ద.మ.రైల్వే
నేడు ఏపీ ఎంసెట్.. విద్యార్థుల్లో టెన్షన్
రెండో రోజూ నగరంలో సమ్మె కష్టాలు కొనసాగాయి. గురువారం ఆర్టీసీ బస్సులు పూర్తిగా డిపోలకే పరిమితమయ్యాయి. ప్రయాణికుల కష్టాలు మరింత పెరిగాయి. ఆటోలు, ప్రైవేట్ వాహనదారులు దోపిడీ పర్వాన్ని కొనసాగించారు. సాధారణంగా రూ.100 తీసుకునే దూరానికి రూ.300 వరకు వసూలు చేశారు. రైళ్లలో జిల్లాల నుంచి నగరానికి చేరుకున్న ప్రయాణికులు.. ఆటోవాలాల దోపిడీ చూసి అవాక్కయ్యారు. శుక్రవారం ఏపీ ఎంసెట్.. పరీక్షా కేంద్రానికి చేరుకోవడమే అసలైన పరీక్షగా మారిందని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. ఎంసెట్ విద్యార్థుల కోసం ప్రభుత్వం ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది.
సిటీబ్యూరో/సికింద్రాబాద్/కాచిగూడ : ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రైవేట్ వాహనదారుల నిలువుదోపిడీ రెండో రోజు గురువారం తారస్థాయికి చేరుకుంది. ఆటోవాలాలు మీటర్ రీడింగ్‌తో నిమిత్తం లేకుండా ఇష్టారాజ్యంగా వసూళ్లకు పాల్పడ్డారు. రెట్టింపు కంటే ఎక్కువ చార్జీలతో ప్రయాణకుల జేబులు లూఠీ చేశారు. సాధారణ రోజుల్లో కూకట్‌పల్లి నుంచి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వరకు రూ.215 నుంచి రూ.250 వరకు ఆటో చార్జీ ఉంటుంది. కానీ ఏకంగా రూ.500 వసూలు చేశారు. అలాగే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12 వరకు సాధారణంగా అయితే రూ.160 వరకు చార్జీ ఉంటుంది. కానీ ఆర్టీసీ సమ్మె కారణంగా రూ.270 నుంచి రూ.300 వరకు వసూలు చేశారు. ఇలా నగరంలోని అన్ని మార్గాల్లోనూ ఆటోవాలాలు, ట్యాక్సీ డ్రైవర్లు భారీ ఎత్తున దోపిడీకి దిగారు. ప్రభుత్వం ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడం పట్ల ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. సమ్మె వల్ల పేద, మధ్యతరగతి ప్రజలపైనే ఎక్కువ భారం పడింది. వేసవి సెలవులు, పెళ్లిళ్లు, శుభకార్యాలకు వెళ్లేందుకు బయలుదేరిన నగరవాసులు నానాపాట్లు పడ్డారు.
దోపిడీ పర్వం ఇలా.....
ఆర్టీసీ చేపట్టిన ప్రత్యామ్నాయ చర్యలు కొంతమేరకు ఫలితాన్ని ఇచ్చాయి. మొదటి రోజు 70 బస్సులు నడిపిన అధికారులు రెండో రోజు 250 బస్సులు నడపగలిగారు. మరోవైపు డిపోల్లోంచి బస్సులు బయటకు రాకుండా అన్నిచోట్లా ఆర్టీసీ కార్మిక సంఘాలు యథావిధిగా ఆందోళన కొనసాగించాయి. బస్సులను అడ్డుకున్న కార్మికులను పలు చోట్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రైవేట్ సిబ్బందిపై దాడికి పాల్పడిన రాణిగంజ్-2 డిపోకు చెందిన కండక్టర్ బి.రవిని విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ జయరావు తెలిపారు.
కంటోన్మెంట్ డిపోకు చెందిన కార్మికుడు ఆర్‌జీడీ ప్రభుదాస్ ఆర్టీసీ యాజమాన్యం వైఖరి పట్ల తీవ్ర మనస్తాపానికి గురై ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొనేందుకు యత్నించాడు. పోలీసులు వెంటనే అప్రమత్తమై అడ్డుకోవడంతో ముప్పు తప్పింది. అనంతరం అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
బస్సులు అందుబాటులో లేకపోవడం ఒక యువకుడి మృతికి కారణమైంది. పంజగుట్టలోని ఓ ప్రైవేట్ సంస్థలో పని చేసే కుత్బుల్లాపూర్‌కు చెందిన కుమార్‌గౌడ్ (35) గురువారం తన తండ్రితో కలిసి ద్విచక్ర వాహనంపై డైరీఫామ్ వద్దకు వచ్చాడు. అక్కడి నుంచి తన స్నేహితుడితో కలిసి వెళ్లేందుకు నిరీక్షిస్తుండగా కొంపల్లి నుంచి బోయిన్‌పల్లి వైపునకు వెళ్లే ఓ వాటర్ ట్యాంకర్ అదుపు తప్పి బోల్తా పడింది. అది సరిగ్గా కుమార్‌గౌడ్‌పైనే పడడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు .ప్రతి రోజు బస్సుల్లో వెళ్లే తన కొడుకు బస్సులు లేకపోవడం వల్ల ద్విచ క్రవాహనంపై వెళ్లవ లసి వచ్చిందని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
రైళ్లు కిటకిట...
ఆర్టీసీ సమ్మె కారణంగా ప్రయాణికులు ఎంఎంటీఎస్ రైళ్లపై ఆధారపడ్డారు. దీంతో నగరంలోని అన్ని వైపులా 121 సర్వీసులు ప్రయాణికులతో కిక్కిరిసి నడిచాయి. సమ్మెను దృష్టిలో ఉంచుకొని దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక చర్యలు చేపట్టింది. కాచిగూడ-నిజామాబాద్, సికింద్రాబాద్-కాజీపేట్ మధ్య 6 ప్యాసింజర్ రైళ్లను,తిరుపతి-హైదరాబాద్.
ఎంఎంటీఎస్ అదనపు సర్వీసులు...
ఎంఎంటీఎస్ రైళ్లకు భారీగా రద్దీ నెలకొడంతో శుక్రవారం నుంచి మరో 7 సర్వీసులు అదనంగా పెంచనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. తాత్కాలిక ప్రాతిపదికపై ఆర్టీసీలో విధులు నిర్వహిస్తున్న ప్రైవేట్ కండక్టర్‌లు సరైన అవగాహన లేక ఇష్టారాజ్యంగా చార్జీలు తీసుకుంటున్నట్లు ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. పంజగుట్ట నుంచి చిలుకలగూడ క్రాస్‌రోడ్డు వరకు ఆర్డినరీ బస్సు చార్జీ రూ.8 లు కాగా గురువారం ఏకంగా రూ.15 చొప్పున చార్జీ తీసుకున్నారని మల్కాజిగిరికి చెందిన మేరి అనే ప్రయాణికురాలు విస్మయం వ్యక్తం చేశారు.
అన్నీ ఇబ్బందులే..
హైదర్‌గూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకుని వచ్చాం. తప్పని సరిపరిస్థితుల్లో ఆటోలో ఎక్కువ డబ్బులు పెట్టి రావాల్సి వచ్చింది. కాచిగూడ రైల్వే స్టేషన్‌కు రూ.100 తీసుకున్నారు. మామూలు రోజుల్లో మీటర్ చార్జీ కనీసం రూ.40 నుంచి రూ.50 వరకు ఉంటుంది.
- జి.రాంరెడ్డి, కదిరి
మాదాపూర్‌కు రూ.500 డిమాండ్ చేస్తున్నారు
లింగంపల్లికి వెళ్లాలి. ఎంతోమంది ఆటో డ్రైవర్లను అడిగాను రూ.500కు తక్కువ వచ్చేది లేదంటున్నారు. ఆటో చార్జికి డబుల్ (రిటన్ చార్జి) ఇస్తానని అంటున్నా నహీ అంటున్నారు. బస్సులు లేకే ఈ పరిస్థితి.
మోహన్, ప్రయాణికుడు
నిలువు దోపిడీ చేస్తున్నారు
మంచిర్యాల నుంచి భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ రైలులో సికింద్రాబాద్‌కు వచ్చాను. 250 కిలోమీటర్ల దూరానికి రైలు చార్జీ రూ.80లు. కానీ సికింద్రాబాద్ నుంచి 15 కిలోమీటర్లు కూడా లేని జీడిమెట్లకు రూ.200 అడుగుతున్నారు ఆటోడ్రైవర్లు. చెల్లించక తప్పడం లేదు. దారుణమైన దోపిడీ ఇది.
-మహ్మద్ హజీయుద్దీన్, ఇంజినీరింగ్ విద్యార్థి.
గింత అన్యాయం ఉంటదా బిడ్డా
సుట్టపామెకు పూర్తిగ బాగలేదట. చూసి వద్దామని ఇంట్లకెళ్లి బెలైల్లిన. నల్లకుంట పోదామంటే రూ.200 అంటండ్రు. గింత అన్యాయం ఎక్కడన్న ఉంటదా బిడ్డా? పది రూపాయలు పారేస్తె బస్సుకు పోయ్యి వచ్చేదాన్ని . వాళ్లకేమైందో బస్సులు నడుపుత లేరంట. వీళ్లేమో మొత్తం దోపిడికి దిగిండ్రు.
- సరోజమ్మ, తుకారాంగేట్
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి
ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నందున బస్సులు నడవడం లేదు. మెహిదీపట్నం నుంచి కాచిగూడ రైల్వే స్టేషన్‌కు ఆటోలో రూ.200 వరకు తీసుకున్నారు. ప్రభుత్వం ప్రత్యామ్నా ఏర్పాట్లు చేయకపోవడం వల్లనే తాము ఎక్కువ డబ్బులు చెల్లించి ఆటోలో రావాల్సి వచ్చింది.
- శోభ, కడప