ఆగమాగం | Loss of Rs 2.5 crore on the first day of RTC Telangana | Sakshi
Sakshi News home page

ఆగమాగం

Published Thu, May 7 2015 1:26 AM | Last Updated on Sun, Sep 3 2017 1:33 AM

ఆగమాగం

ఆగమాగం

మంగళవారం అర్ధరాత్రి నుంచే నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులు
బస్టాండ్లలో పడిగాపులతో ప్రయాణికుల ఇబ్బందులు
ఆర్టీసీకి తెలంగాణలో తొలి రోజు నష్టం రూ.2.5 కోట్లు

 
 హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెతో తెలుగు రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించిపోయింది. నిత్యం తిరుగాడే లక్షలాది మందిని ఆగమాగం చేసింది. 43 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలన్న డిమాండ్‌ను ప్రభుత్వం తోసిపుచ్చడంతో మంగళవారం అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెను ప్రారంభించారు. బుధవారం ఉదయానికి ఒక్క బస్సు కూడా రోడ్డెక్కకపోవడంతో.. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆర్టీసీ యాజమాన్యం చెప్పినా.. బుధవారం అలాంటిదేమీ కనిపించలేదు. అత్యవసరంగా ప్రయాణాలు చేయాల్సి వచ్చినవారికి, కనీసం అద్దె బస్సులైనా తిరిగే అవకాశముందని భావించి ప్రయాణాలకు సిద్ధమైనవారికి తీవ్ర ఇబ్బందులు తప్పలేదు, ప్రైవేటు వాహనాలను ఆశ్రయించక తప్పలేదు. ఇక సందట్లో సడేమియాగా ప్రైవేటు వాహనాల యజమానులంతా అందినకాడికి దండుకున్నారు.

అతి కష్టం మీద..

తెలంగాణలో నిత్యం 10,705 ఆర్టీసీ బస్సులు (అద్దెవాటితో సహా) తిరుగుతాయి. వాటిలో బుధవారం అతి కష్టం మీద 350 బస్సులను మాత్రం ఆర్టీసీ తిప్పగలిగింది. అంటే మొత్తం బస్సుల్లో ఇది 3.2 శాతమే. బస్సుల్లేక ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. పలు జిల్లాల్లో అద్దె బస్సులను తిప్పేందుకు డ్రైవర్లు వచ్చినా.. ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు. దీంతో ఆర్టీసీ ఎండీ సాంబశివరావు అద్దె బస్సుల యజమానుల సంఘం ప్రతినిధులతో అత్యవసరంగా భేటీ అయ్యారు. గురువారం నుంచి పోలీసు భద్రత కల్పించి, బస్సులకు, సిబ్బందికి ఎలాంటి నష్టం జరగకుండా చూస్తామని.. వారి అన్ని బస్సులను తిప్పాలని కోరారు. తిరిగిన కిలోమీటర్ల ఆధారంగా డబ్బు చెల్లించే పద్ధతిని తాత్కాలికంగా పక్కనపెట్టి, ఆ బస్సు తిరిగేందుకు మంజూరైన కిలోమీటర్ల ఆధారంగా లెక్కగట్టి చెల్లిస్తామని వారికి చెప్పారు. అంటే తక్కువ దూరం తిరిగినా, తిరగాల్సిన దూరం లెక్కన డబ్బు చెల్లిస్తారు. కండక్టర్‌ను కూడా వారే ఏర్పాటుచేస్తే రోజుకు రూ.800 చొప్పున అదనంగా చెల్లిస్తామని హామీ ఇచ్చారు. దీంతో గురువారం నుంచి అద్దె బస్సులు తిప్పేందుకు వారు అంగీకరించారు.
 
తాత్కాలిక సిబ్బందీ కష్టమే..

తాత్కాలిక పద్ధతిలో సిబ్బందిని నియమించుకునేందుకు ఆర్టీసీ యాజమాన్యం చేసిన ప్రయత్నం కూడా విఫలమైంది. భారీ సంఖ్యలో నిరుద్యోగ యువకులు దరఖాస్తు చేసుకునేందుకు వచ్చినా... వారి అర్హతా పత్రాలు పరిశీలిం చేందుకు డిపోల్లో సిబ్బందే లేకపోవడం గమనార్హం. దీంతో కొన్ని చోట్ల రవాణా శాఖకు చెందిన మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లను రప్పించి డ్రైవర్ల ఫిట్‌నెస్‌ను పరిశీలింపజేశారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా బుధవారం 333 దరఖాస్తులు అందగా 186 మందికి రవాణాశాఖ అధికారులు ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు ఇచ్చారు. వారు గురువారం నుంచి ఆర్టీసీ బస్సులను నడపనున్నారు. మరోవైపు చాలా డిపోల వద్ద ఇలా దరఖాస్తు చేసేందుకు వచ్చిన యువకులను ఆర్టీసీ కార్మికులు అడ్డుకుని, పంపేశారు. హన్మకొండలాంటి కొన్ని చోట్ల వారిపై దాడికి కూడా దిగడంతో పోలీసులు వచ్చి చెదరగొటారు. ఇక డిపోల్లో పనిచేసేందుకూ తాత్కాలిక సిబ్బందిని నియమించాలని ఎండీ సాంబశివరావు నిర్ణయించారు. ఇక పోలీసు, అగ్నిమాపక శాఖ డ్రైవర్లు కూడా గురువారం నుంచి రంగంలోకి దిగనున్నారు.

నష్టం భారీగానే..

సమ్మె తొలిరోజు ఆర్టీసీ రూ.10.50 కోట్ల ఆదాయం కోల్పోగా.. నికరంగా రూ.2.5 కోట్లు నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు.
 
తాత్కాలిక సిబ్బందికి 30 శాతం వెయిటేజీ
 
సమ్మె సమయంలో తాత్కాలిక పద్ధతిలో డ్రైవర్, కండక్టర్లుగా పనిచేసేవారికి భావి నియామకాల్లో ఇస్తున్న 5 శాతం వెయిటేజీని 30 శాతానికి పెంచాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. దీనికి సంబంధించి చట్ట సవరణకు సిద్ధమని ప్రకటించింది కూడా. దీంతో గురువారం నుంచి నిరుద్యోగ యువకులు పెద్ద సంఖ్యలో వస్తారని అంచనా వేస్తున్నారు.
 
‘కాంట్రాక్టు’ క్రమబద్ధీకరణ

 
ఆర్టీసీలో డ్రైవర్లు, కండక్టర్లతోపాటు డిపోల్లో దాదాపు 5,000 మంది వరకు కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్నారు. సమ్మెకాలంలో హాజరైతే వెంటనే వారి సర్వీసును క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారు విధులకు గైర్హాజరైతే వెంటనే విధుల నుంచి తొలగించాలని యోచిస్తోంది. గురువారం మధ్యాహ్నం వరకు విధులకు హాజరుకాని కాంట్రాక్టు ఉద్యోగులందరినీ తొలగించనున్నట్టు స్వయంగా ఆర్టీసీ ఎండీ సాంబశివరావు ప్రకటించారు.
 
ఓయూ పరిధిలోని నేటి పరీక్షలు యథాతథం

ఓయూ పరిధిలో నేడు (7న)  జరగాల్సిన అన్ని పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని గురువారం పరీక్షల నియంత్రణ అధికారి ప్రొ.భిక్షమయ్య తెలిపారు. ఆర్టీసీ సమ్మె ఉన్నా పరీక్షలు వాయిదా వేసేది లేదని స్పష్టం చేశారు.
 
ఎస్మాకు రంగం సిద్ధం

 
ఆర్టీసీ కార్మికులపై ఎస్మా ప్రయోగం ద్వారా ఒత్తిడి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అత్యవసర సేవల పరిధిలో ఆర్టీసీ ఉన్నందున.. జనజీవనం అస్తవ్యస్తమవటానికి కారణమవుతున్న సమ్మెను తీవ్రంగా పరిగణిస్తున్నట్టు పేర్కొంది. కానీ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నిక జరిగే సమయం అయినందున సంఘాలు సమ్మెను విరమించుకునే అవకాశం లేదు. ప్రభుత్వ ఈ బెదిరింపులకు తలొగ్గబోమని ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘాలైన ఎంప్లాయీస్ యూనియన్, తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రకటించాయి. కార్మికులను వేధించే ఉద్దేశం తమకూ లేదని ఎండీ సాంబశివరావు పేర్కొన్నారు.
 
రైళ్లకు అదనపు బోగీలు


ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కొన్ని రైళ్లకు 23 బోగీలను అదనంగా ఏర్పాటు చేశారు. దీంతో దాదాపు 20 రైళ్లలో 1,600 బెర్తులు అదనంగా అందుబాటులోకి వచ్చాయి. వీలైతే గురువారం నుంచి అదనపు రైళ్లు నడిపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం అదనపు రేక్‌లు, బోగీలు ఇవ్వాల్సిందిగా ఇతర జోన్ల అధికారులకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు విజ్ఞప్తి చేశారు. మరోవైపు హైదరాబాద్‌లోనూ ఆర్టీసీ బస్సులు పూర్తిగా నిలిచిపోవడంతో.. ఎంఎంటీఎస్‌లు కిక్కిరిసిపోతున్నాయి. దీంతో ఇతర ప్రాంతాల నుంచి డెమూ, మెమూ సర్వీసులను రప్పించారు. వాటిని గురువారం నుంచి 4 ట్రిప్పుల చొప్పున తిప్పనున్నారు.
 
 రాజధానిలో పూర్తిగా...

హైదరాబాద్‌లో ఆర్టీసీ సమ్మె ప్రభావం పూర్తిస్థాయిలో కనిపించింది. సుమారు 3,800 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బుధవారం మొత్తంగా 70 బస్సులే రోడ్డెక్కగలిగాయి. టీఎంయూ, ఎంప్లాయీస్ యూనియన్ల నేతృత్వంలో కార్మికులు డిపోల వద్ద ధర్నాలకు దిగారు. హైదరాబాద్ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు రాకపోకలు సాగించే మరో 3,500 బస్సులు ఎక్కడికక్కడ ఆగిపోవడంతో మహాత్మాగాంధీ, జూబ్లీ బస్‌స్టేషన్‌లు వెలవెలపోయాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆర్టీఏ అధికారులు ప్రైవేట్ బస్సులకు స్టేజీ క్యారేజీలుగా అనుమతినిచ్చారు. సెవెన్ సీటర్ ఆటోలను నగరంలోకి అనుమతించారు. స్కూల్ బస్సులు, కాలేజీ బస్సులలో ప్రయాణికులను ఎక్కించుకొనేందుకు అనుమతినిచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement