పంచాయతీల్లో ఆన్‌లైన్‌కు ఆదిలోనే హంసపాదు | Test online early opener | Sakshi
Sakshi News home page

పంచాయతీల్లో ఆన్‌లైన్‌కు ఆదిలోనే హంసపాదు

Published Mon, Jul 7 2014 1:46 AM | Last Updated on Sat, Sep 2 2017 9:54 AM

Test online early opener

  • పంచాయతీల్లో ఏప్రిల్ నుంచి నిలిచిన లెక్కలు
  •  జిల్లాలో 347 పంచాయతీలకు ఆపరేటర్లు లేరు
  •  పని జరగకున్నా నెలనెలా బీఎస్‌ఎన్‌ఎల్ బిల్లులు
  • మచిలీపట్నం : పంచాయతీల నిధుల ఖర్చులో పారదర్శకత పాటించేందుకు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) పర్యవేక్షణలో ఏర్పాటైన ఆన్‌లైన్ పథకానికి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. నూతనంగా ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా పంచాయతీకి సంబంధించిన భౌగోళిక స్వరూపం, స్థిరాస్తులు, చరాస్తులు, రోడ్లు తదితర వివరాల్ని కంప్యూటరీకరిస్తారు.

    ఈ సమాచారంతో అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తారు. వాటి వినియోగం, చెల్లింపులు తదితర అంశాల్ని తెలుసుకునేందుకు ఈ పథకాన్ని రూపొందించారు. పంచాయతీలకు కంప్యూటర్లు అందజేయటం, ఆపరేటర్ల నియామకం బాధ్యతను అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో కార్వీ సంస్థకు అప్పగించారు. జిల్లాలో తొలివిడతలో 347 పంచాయతీలను ఎంపిక చేసి ఈ ఏడాది ఏప్రిల్లో కంప్యూటర్లను అందజేశారు. వీటితో పాటు మరో 52 పంచాయతీలకు అదనంగా బీఎస్‌ఎన్‌ఎల్ ఇంటర్‌నెట్ సర్వీసులనూ అందుబాటులోకి తెచ్చారు.

    కంప్యూటర్ ఆపరేటర్లను నియమించి పంచాయతీరాజ్ ఉద్యోగులతో రెండు నెలల కిందట శిక్షణ కూడా నిర్వహించారు. అయితే ఆ తర్వాత కంప్యూటర్ ఆపరేటర్ల నియామక ప్రక్రియను కార్వీ సంస్థ నిలిపేసింది. కంప్యూటర్లనూ సిబ్బంది వాడటం లేదు. ఇప్పటి వరకు పంచాయతీ జమా లెక్కల్ని జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు చూసేవారు. ఆన్‌లైన్ పథకం రావడంతో వారు పట్టించుకోవటం లేదు. దీంతో మూడు నెలలుగా పంచాయతీల్లో ఆర్థిక పరమైన అంశాలకు బ్రేక్ పడింది.
     
    బిల్లులు పంపుతున్న బీఎస్‌ఎన్‌ఎల్

    నెట్ కనెక్షన్, సర్వీస్‌చార్జ్ తదితర ఖర్చులతో ఒక్కొక్క పంచాయతీ నుంచి వెయ్యి నుంచి రెండువేల రూపాయల వరకు బీఎస్‌ఎన్‌ఎల్ నుంచి బిల్లులు వచ్చాయి. కంప్యూటర్లు బిగించకుండా, పనులు జరగకుండానే ఇంటర్‌నెట్ బిల్లులు రావడంపై అధికారులు తలలుపట్టుకుంటున్నారు. ఆపరేటర్ల నియామకాన్ని ప్రభుత్వం కార్వీ సంస్థకే అప్పగించిందని ఇన్‌చార్జ్ డీపీవో చంద్రశేఖర్ తెలిపారు. ప్రభుత్వం నుంచి అనుమతలు రాకపోవడంతో నియామకాలు నిలిచిపోయాయని కార్వీ సంస్థ హైదరాబాదు ప్రతినిధి వివరించారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement